గ్రాట్యుటీ ఎప్పుడిస్తారో..?
డబ్బు అందక రిటైర్డ్ ఉద్యోగుల వెతలు
అన్ని శాఖల్లోనూ ఇదే పరిస్థితి
ఉద్యోగుల పెండింగ్ నిధులూ ఇవ్వని వైనం
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు రెండున్నరేళ్లుగా ఒక్క నెలలో కూడా సకాలంలో జీతాలు అందడం లేదు. అలాగే పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు పెన్షన్ అందడం లేదు. పండుగలు వచ్చినా సరే ఎదురు చూడాల్సిన దుస్థితి. గత రెండున్నరేళ్లుగా రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి అయితే మరింత దారుణం. 30 సంవత్సరాల పాటు సర్వీసులో ఉండి దాచుకున్న సొమ్మును కూడా ప్రభు త్వం ఇవ్వడంలేదు. రిటైర్ అయ్యాక వృద్ధాప్యంలో వారికి ఆ డబ్బులు ఎంతో ఉపయోగపడతాయి. గ్రాట్యుటీ పెద్ద మొత్తంలో వస్తుంది కాబట్టి పిల్లల పెళ్లిళ్లు, ఇతర అవసరాల కోసం ఉపయోగించుకోవాలని భావిస్తారు. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన మొదటి 6 నెలలు మాత్రం రిటైర్డ్ ఉద్యోగులకు గ్రాట్యుటీ, ఇతర ప్రయోజనాలు అందించింది. ఆ తర్వాత రిటైరైన వారికి ప్రయోజనాలు దక్కడం లేదు. ప్రభుత్వ పెద్దల నుంచి సిఫార్సులు పొందిన ఒకరిద్దరికి తప్ప ఎవ్వరికీ గ్రాట్యుటీ అందలేదు. సచివాలయంలో పనిచేసి రిటైర్ అయిన ఉద్యోగులతో పాటు వివిధ శాఖల కార్యాలయాల్లో, జిల్లాల్లో పని చేసిన ఉద్యోగులందరిదీ అదే పరిస్థితి. గడిచిన రెండేళ్లలో గృహనిర్మాణ శాఖలో ఎస్‌ఈ కేడర్ నుంచి దిగువ స్థాయి కేడర్ వరకు మొత్తం 165 మంది రిటైర్డ్ అయ్యారు. వీరిలో ఒక్కరికి కూడా గ్రాట్యుటీ అందలేదు. ప్రభుత్వానికి ఎన్ని విజ్ఞప్తులు చేసినా తమకు గ్రాట్యుటీ ఇవ్వలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రిటైర్డ్ ఉద్యోగుల సంఖ్య పెరిగిపోతుండడంతో వారికి ఇవ్వాల్సిన ప్రయోజనాలు కొండలా పేరుకుపోతున్నాయి. వారికి ఇవ్వాల్సిన ప్రయోజనాలను వాయిదా వేసేందుకు ప్రభుత్వం కొత్త ఎత్తుగడ వేసినట్టు విమర్శలున్నాయి. పీఆర్‌సీని అడ్డంపెట్టుకొని పదవీ విరమణ వయసును పెంచింది. పీఆర్సీ డిమాండ్లలో ఉద్యోగులెవరూ అడగకపోయినా రిటైర్‌మెంట్ వయసును 62 ఏళ్లకు పెంచింది. దీంతో మరో రెండేళ్ల వరకు రిటైర్‌మెంట్లు ఉండవు. ఈ లోపు ఎన్నికలు వస్తాయి. అప్పటివరకు తప్పించుకునేందుకు జగన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుందని ఉద్యోగులు విమర్శిస్తున్నారు.
పెండింగ్ నిధులు 2100 కోట్లు
మెరుగైన పీఆర్సీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఉద్యోగులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న రూ.2100 కోట్ల నిధులు తక్షణమే ఇవ్వాలనేది వారి ప్రధాన డిమాండ్లలో ఒకటి. మంత్రుల కమిటీతో జరిగిన చర్చల్లో ఉద్యోగ సంఘాల నాయకులు ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఏప్రిల్‌లో పెండింగ్ నిధులు చెల్లిస్తామని మంత్రుల కమిటీ, అందులోని అధికారులు హామీ ఇచ్చారని అప్పట్లో ఉద్యోగ సంఘాల నాయకులు చెప్పారు. ఏప్రిల్ గడిచిపోయి మే నెల వచ్చింది. కానీ ఆ పెండింగ్ నిధులపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేదు. ఉద్యోగ సంఘాల నాయకులు కూడా ఈ విషయం గురించి ప్రభుత్వాన్ని మళ్లీ అడిగిన దాఖలాలు లేవు. పెండింగ్ నిధుల కోసం ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు
0 Response to " గ్రాట్యుటీ ఎప్పుడిస్తారో..?"
Post a Comment