ఏపీ మంత్రివర్గ కూర్పుపై మారుతున్న సమీకరణాలు..




అమరావతి: ఏపీ మంత్రి వర్గ కూర్పుపై సమీకరణాలు మారుతున్నాయి. సీనియర్లు అలకపాన్పు ఎక్కడం జగన్‌కు తలనొప్పిగా మారింది. అయితే ఏడాది క్రితం ప్రమాణస్వీకారం చేసిన వేణుగోపాల్ కృష్ణ, అప్పలరాజుపై స్పష్టత వచ్చింది. కొత్తగా కేబినెట్‌లోకి శ్రీకాకుళం నుంచి ధర్మాన ప్రసాదరావు, కృష్ణా జిల్లా నుంచి జోగి రమేష్, అనకాపల్లి నుంచి గుడివాడ అమర్‌నాథ్, చిలకలూరిపేట ఎమ్మెల్యే రజనీ, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి బెర్త్‌లు ఖరారయ్యాయని వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మైనారిటీ కోటాల్లో హఫీజ్‌ఖాన్, ముస్తఫాల్లో ఒకరికి చోటు కల్పించబోతున్నారు. అలాగే రెడ్డి, కాపు సామాజిక వర్గాలకు ఒక్కో పదవి కట్ కాబోతోంది. తగ్గించిన పదవులు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు లభించే అవకాశమున్నట్లు సమాచారం.

గత నెలలో జరిగిన కేబినెట్‌ భేటీలో.. సామాజిక సమీకరణల కారణంగా ఒకరిద్దరు మంత్రులను కొనసాగించక తప్పదని ముఖ్యమంత్రి అన్నారు. ఇది సీనియర్‌ మంత్రుల్లో అసంతృప్తి రాజేసింది. సీనియర్‌ మంత్రులకూ ఉద్వాసన పలుకుతానని జగన్‌ చెప్పడం తీవ్ర అవమానంగా వారు భావించారు. ముఖ్యంగా ప్రకాశం జిల్లా నుంచి సురేశ్‌ను కొనసాగిస్తానని చెప్పడం.. అదే జిల్లాకు చెందిన బాలినేని శ్రీనివాసరెడ్డికి ఆగ్రహం తెప్పించింది. సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి బుజ్జగించినా ఆయన అలక వీడలేదు. ఉంటే ఇద్దరం ఉండాలి.. లేదంటే ఇద్దరినీ తొలగించాల్సిందేనని స్పష్టం చేశారు. దీంతో బాలినేనిని జగన్‌ పిలిపించుకుని మాట్లాడారు. సురేశ్‌ కొనసాగి తీరుతారని సీఎం సూటిగా చెప్పినట్లు తెలిసింది.

కొత్తగా... వీరి పేర్లు బలంగా!

ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ను తప్పించి ఆయన స్థానంలో ఆయన తమ్ముడైన ధర్మాన ప్రసాదరావుకు అవకాశం దక్కుతుందని వైసీపీ వర్గాలు అంటున్నాయి. ఇక కృష్ణా జిల్లా పెడన ఎమ్మెల్యే జోగి రమేశ్‌(గౌడ), పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని(రజక), ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే కె.అబ్బయ్యచౌదరి (కమ్మ)కి కేబినెట్‌లో తప్పకుండా అవకాశం ఉంటుందని బలంగా ప్రచారం జరుగుతోంది. అలాగే కోనసీమ జిల్లాలో మంత్రి పినిపె విశ్వరూప్‌ స్థానంలో అదే జిల్లా పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు(ఎస్సీ)కు చాన్సిస్తారని అంటున్నారు. ఎన్‌టీఆర్‌ జిల్లా నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు(ఎస్సీ), నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి (రెడ్డి)కి కూడా బెర్తు ఖాయమని అంటున్నా రు. మొత్తానికి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ.. రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో ముఖ్యమంత్రి భేటీ.. కేబినెట్‌ సమావేశంలో మంత్రులందరి మూకుమ్మడి రాజీనామాల్లాంటి అంశాలు రాష్ట్రంలో హాట్‌ టాపిక్‌గా మారాయి

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఏపీ మంత్రివర్గ కూర్పుపై మారుతున్న సమీకరణాలు.."

Post a Comment