అంతరజిల్లా బదిలీలకు మోక్షం ఎప్పుడో?
50 రోజులుగా సీఎం కార్యాలయంలోనే ఫైల్
541 ఉపాధ్యాయ కుటుంబాలు ఎదురుచూపు
గుంటూరు, ఫిబ్రవరి 9: టీచర్ల మ్యూచువల్ బదిలీ ప్రక్రియ ఎనిమిది నెలలుగా అటకెక్కింది. ఫైలు అనేక దశలను దాటుకుంటూ ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరి రెండు నెలలు కావస్తున్నా.. ఇంకా మోక్షం కలగడం లేదు. దానిపై సీఎం ఎప్పుడు సంతకం పెడతారా అని ఉపాధ్యాయ కుటుంబాలు ఆశగా ఎదురు చూస్తున్నాయి. చివరకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, మంత్రులు, సంబంధిత ఉన్నతాధికారులను కలిసి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం కనిపించడం లేదు. గతేడాది జూన్‌లో రాష్ట్ర ప్రభుత్వం అంతర్ జిల్లాల్లో భార్యాభర్తలు, మ్యూచువల్ బదిలీలకు నోటిఫికేషన్ జారీచేసింది. షెడ్యూల్ ప్రకారం దరఖాస్తు చేసుకున్న వారిలో 541 మందిని ఆయా బదిలీలకు ఎంపిక చేస్తూ జాబితా కూడా విడుదల చేసింది. ఆ ఫైలు సాధారణ పరిపాలన విభాగం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టేబుల్‌పైకి చేరింది. ఆయన కూడా దానికి ఆమోదిస్తూ విద్యాశాఖ మంత్రి వద్దకు పంపారు. మంత్రి కార్యాలయం కూడా క్లియర్ చేయడంతో ఆ ఫైల్ సీఎం కార్యాలయానికి చేరింది. అనేక దశలు దాటుకుంటూ అక్కడికి చేరిన ఫైలు 50 రోజులుగా పెండింగ్‌లో ఉంది. దీంతో మ్యూచ్‌వల్ బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్న 541 మంది.. సీఎం ఎప్పుడు కరుణిస్తారా అని ఎదురుచూస్తున్నారు. అయితే ఇటీవల ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలలను విలీనం చేస్తామని ప్రకటించింది. దానిలో భాగంగా సాధారణ బదిలీలు రేషనలైజేషన్ చేయనున్నట్టు తెలిపింది. అయితే ఎనిమిది నెలల క్రితమే మ్యూచ్‌వల్ బదిలీలకు నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో.. ముందుగా 541 మంది ఉపాధ్యాయుల బదిలీ పూర్తిచేసుకున్న తర్వాతే సాధారణ బదిలీలు చేయాలని ఆయా ఉపాధ్యాయులు కోరుతున్నారు. ఈ విషయమై పీడీఎఫ్ ఎమ్మెల్సీలు పలు దఫాలు సీఎం కార్యాలయ అధికారులకు వినతిపత్రాలు కూడా సమర్పించారు. అయినప్పటికీ పని కావడం లేదు. ఇప్పటికైనా సీఎం జగన్ స్పందించి ఈ బదిలీల ప్రక్రియకు ముగింపు పలకాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.
0 Response to "అంతరజిల్లా బదిలీలకు మోక్షం ఎప్పుడో?"
Post a Comment