ఆర్బీఐ ద్రవ్య విధానం : గృహ, ఆటో రుణగ్రస్థులకు ఉపశమనం లేదు
ఢిల్లీ : భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) ద్వైమాసిక ద్రవ్య విధాన సమీక్షలో గృహ, ఆటో రుణాల గ్రహీతలకు ఉపశమనం లభించలేదు. సమీప భవిష్యత్తులో వీరి ఈఎంఐలు తగ్గే అవకాశం లేదు. 2022 బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రతిపాదించిన అనంతరం ఈ సమీక్ష జరిగింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో చివరి సమీక్ష ఇది.
ద్వైమాసిక ద్రవ్య విధాన సమీక్ష ఫలితాలను ఆర్బీఐ గురువారం ప్రకటించింది. రెపో రేటును మార్చడం లేదని, 4 శాతంగా కొనసాగిస్తున్నామని తెలిపింది. రివర్స్ రెపో రేటు 3.35 శాతమని తెలిపింది. ఈ రేట్లలో మార్పులు జరగకపోవడం వరుసగా ఇది పదోసారి. ఈ రేట్లను చిట్టచివరిసారి 2020 మే 22న మార్చింది.
మానెటరీ పాలసీ కమిటీలో ఆరుగురు సభ్యులు ఉన్నారు. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అధ్యక్షతన మంగళవారం నుంచి సమీక్ష నిర్వహించారు. వీరంతా ఏకగ్రీవంగా ఈ రేట్లను మార్చకూడదని నిర్ణయించారు. వృద్ధికి ఊతమివ్వడం కోసం ద్రవ్యోల్బణాన్ని నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా ఉండటం కోసం అవసరమైనంత వరకు ఇదే ధోరణిని కొనసాగించాలని నిర్ణయించింది.
కమర్షియల్ బ్యాంకులకు నిధులను సమకూర్చినపుడు ఆర్బీఐ వసూలు చేసే వడ్డీ రేటును రెపో రేటు అంటారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ఆర్బీఐ ఉపయోగించే సాధనమిది. బ్యాంకుల నుంచి ఆర్బీఐ రుణాలను తీసుకున్నపుడు ఆ బ్యాంకులకు ఆర్బీఐ చెల్లించే వడ్డీ రేటును రివర్స్ రెపో రేటు అంటారు
0 Response to " ఆర్బీఐ ద్రవ్య విధానం : గృహ, ఆటో రుణగ్రస్థులకు ఉపశమనం లేదు"
Post a Comment