బ్రేకింగ్ : ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ కన్నుమూత
అమరావతి/హైదరాబాద్ సిటీ : ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి (49) కన్నుమూశారు. ఇవాళ ఉదయం గుండెపోటు రావడంతో హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరిన ఆయన.. అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కాగా ఆస్పత్రికి వచ్చేటప్పటికే గౌతమ్ పరిస్థితి తీవ్ర విషమంగా ఉందని తెలుస్తోంది. దీంతో అత్యవసర చికిత్స అందించినప్పటికీ ప్రాణం నిలబడలేదు. ఆయన మరణించారన్న విషయాన్ని గౌతమ్ భార్యకు అపోలో వైద్యులు సమాచారం ఇచ్చారు. కాగా.. వారం రోజుల పాటు దుబాయ్ పర్యటన ముగించుకొని నిన్న (ఆదివారం నాడు) గౌతమ్ హైదరాబాద్‌కు వచ్చారు.
మంత్రి ఇకలేరన్న విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆయన హఠాన్మరణంతో అభిమానులు, వైసీపీ కార్యకర్తలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. గౌతమ్ మృతిపట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కేబినెట్ మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వైసీపీ నేతలు ప్రగాఢ సంతాపం తెలిపారు.
గౌతమ్‌రెడ్డి 1971 నవంబర్ 2న జన్మించారు. గౌతమ్‌రెడ్డి స్వగ్రామం నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లి. ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్ యూనివర్సిటీ ఆయన ఎమ్మెస్సీ చేశారు. ఈయన తండ్రి మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి. 2014 అసెంబ్లీ ఎన్నికలతో రాజకీయ రంగప్రవేశం చేసిన గౌతమ్.. తొలిసారి ఆత్మకూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2019 ఎన్నికల్లో కూడా ఆయన ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో వైసీపీ గెలవడంతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. మేకపాటికి కేబినెట్‌లో చోటిచ్చారు. ప్రస్తుతం పరిశ్రమలు, ఐటీ శాఖా మంత్రిగా గౌతమ్ ఉన్నారు. ఇటీవలే కరోనా బారిన పడిన మేకపాటి కోలుకున్నారు. పోస్ట్ కొవిడ్ పరిణామాలే గుండెపోటుకు కారణమని తెలుస్తోంది.
0 Response to "బ్రేకింగ్ : ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ కన్నుమూత"
Post a Comment