గడువు లేకుంటే ఉద్యోగాల భర్తీకి అర్థం లేదు కాల్‌లెటర్‌ బదులు ఎస్‌ఎంఎస్‌ కూడా చెల్లుబాటు సుప్రీంకోర్టు వ్యాఖ్య




దిల్లీ: ఉద్యోగాల భర్తీకి గడువు విధించుకోకపోతే ఆ ప్రకియకు అర్థమే ఉండదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. భర్తీ ప్రక్రియకు ఎక్కడో ఒక చోట ముగింపు పలకకపోతే ఉద్యోగాల ఖాళీల గుర్తింపు, తదుపరి నియామకాల ప్రకటన విడుదలకు ఆటంకాలు కలుగుతాయని తెలిపింది. ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రొవిన్షియల్‌ ఆర్మ్‌డ్‌ కానిస్టేబులరీ జవాన్ల నియమాకానికి సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పులను కొట్టివేస్తూ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ ఎ.ఎస్‌.బోపన్నలతో కూడిన ధర్మాసనం పై వ్యాఖ్య చేసింది. కానిస్టేబుళ్ల నియామకానికి 2015లో ప్రకటన వెలువడగా, 2018లో ధ్రువపత్రాల పరిశీలన, శారీరక దృఢత్వ పరీక్షలు జరిగాయి. వీటి సమాచారాన్ని సంబంధిత అధికారులు అభ్యర్థులందరికీ ఎస్‌ఎంఎస్‌ల ద్వారా పంపించారు. అయితే నిబంధనల ప్రకారం పోస్టు ద్వారా కాల్‌లెటర్‌ పంపించాల్సి ఉన్నా, అలా చేయలేదంటూ ఓ అభ్యర్థి అలహాబాద్‌ హైకోర్టులో దావా వేశారు. లిఖితపూర్వక సమాచారం లేని కారణంగా తాను శారీరక దృఢత్వ పరీక్షలకు హాజరు కాలేకపోయానని చెప్పారు. దాంతో ఆయనకు పరీక్షల్లో పాల్గొనేందుకు అవకాశం కలిగించాలని 2019లో హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఆదేశించింది. దీనిపై అధికారులు డివిజన్‌ బెంచ్‌కు అప్పీలు చేయగా అక్కడ కూడా ఇదే రకమైన తీర్పు వచ్చింది. భర్తీ ప్రక్రియకు ఆటంకం కలగడంతో మళ్లీ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ అభ్యర్థికి ఎస్‌ఎంఎస్‌ ద్వారా సమాచారం ఇచ్చినా కేవలం సాంకేతిక కారణం సాకుతో కావాలనే హాజరు కాలేదని ధర్మాసనం అభిప్రాయపడింది. దరఖాస్తులో పేర్కొన్న చిరునామాలో అభ్యర్థి లేనప్పుడు పోస్టు ద్వారా కన్నా ఎస్‌ఎంఎస్‌ సమాచారమే ఉపయోగకరంగా ఉంటుందని తెలిపింది. హైకోర్టు ఇచ్చిన తీర్పులను కొట్టివేసింది. భర్తీ ప్రక్రియ ఇప్పటికే ఆలస్యమయినందున ఈ దిశలో మినహాయింపులు ఇవ్వడం తగదని తెలిపింది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "గడువు లేకుంటే ఉద్యోగాల భర్తీకి అర్థం లేదు కాల్‌లెటర్‌ బదులు ఎస్‌ఎంఎస్‌ కూడా చెల్లుబాటు సుప్రీంకోర్టు వ్యాఖ్య"

Post a Comment