Digital Learning: డిజిటల్ లెర్నింగ్‌కు అడ్డంకులు ఇవే..! ‘ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్’ తాజా అధ్యయనం
దిల్లీ: కరోనా మహమ్మారి వణికిస్తోన్న వేళ.. ప్రపంచ వ్యాప్తంగా విద్యారంగం డిజిటల్ వైపు అడుగులు వేసింది. ఆన్‌లైన్ క్లాసుల నుంచీ పరీక్షల వరకు అన్నింటిని డిజిటల్ మాధ్యమంలోనే నిర్వహించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో అధ్యాపకులతోపాటు విద్యార్థుల్లో పరిమిత స్థాయిలో సాంకేతిక నైపుణ్యాలు, యోగ్యత లేమి, పిల్లల్ని ఆన్‌లైన్ పాఠాల్లో నిమగ్నం చేయడం వంటి అంశాలే ప్రధాన అవరోధాలని తాజా అధ్యయనం ఒకటి పేర్కొంది.
కొవిడ్ మహమ్మారి వేళ డిజిటల్ బోధనలో ఎదురవుతున్న సమస్యలపై ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ ఓ అధ్యయనం నిర్వహించింది. ‘అడ్రసింగ్ ది డీపెనింగ్ డిజిటల్ డివైడ్’ పేరుతో నిర్వహించిన ఈ అధ్యయనంలో భాగంగా భారత్‌తో పాటు 91 దేశాల్లోని 1557 పాఠశాలలు, ఇంగ్లీష్ బోధించే ఉపాధ్యాయుల అభిప్రాయాలను సేకరించింది. డిజిటల్ విధానంలో సమర్థవంతమైన బోధన, అభ్యసనానికి ఎదురవుతున్న సవాళ్లను కనుగొనే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా విద్యార్థులపై వీటి ప్రభావాన్ని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ విశ్లేషించింది.
* సాంకేతికతపై పట్టు, డిజిటల్ నైపుణ్యాలు కూడా పరిమితంగా ఉండడం సమస్యగా మారుతోందని సర్వేలో పాల్గొన్న 68శాతం మంది ఉపాధ్యాయులు పేర్కొన్నారు. ముఖ్యంగా ఇంటర్నెట్ లేదా కంప్యూటర్ పరికరాలు లేకపోవడం తీవ్ర ఇబ్బందిగా మారినట్లు చెప్పారు.
* ఉపాధ్యాయులతోపాటు విద్యార్థులకు డిజిటల్ సామర్థ్యాలు లేకపోవడం కూడా ప్రధాన సమస్య అని సర్వేలో పాల్గొన్న 56శాతం మంది వెల్లడించారు.
* ఆన్‌లైన్ పాఠాల్లో పిల్లల్ని నిమగ్నం చేయడం అత్యంత సవాల్‌తో కూడుకున్నదని మెజారిటీ ఉపాధ్యాయులు అభిప్రాయపడ్డారు. ప్రతి 10 మంది ఉపాధ్యాయుల్లో ఆరుగురు ఇదేవిధమైన అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.
* ఆన్‌లైన్ చదువులకు కావాల్సిన డిజిటల్ పరికరాలు లేకపోవడంతో పేద విద్యార్థులు చదువులకు దూరమవుతునట్లు దాదాపు 70శాతం మంది అధ్యాపకులు పేర్కొన్నారు.
* చిన్నారుల డిజిటల్ విద్యలో వారి తల్లిదండ్రులే కీలక పాత్ర పోషించాలని అధ్యాపకులు భావిస్తున్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులకు డిజిటల్ మాధ్యమాలు, పరికరాలపై పరిజ్ఞానం లేకపోవడం చిన్నారులకు ఇబ్బందిగా మారుతోందని సర్వేలో పాల్గొన్న 50శాతం మంది టీచర్లు అభిప్రాయపడ్డారు.
* 58శాతం మంది పేద విద్యార్థులకు వారి తల్లిదండ్రులు, కుటుంబాల మద్దతు లేదని 58శాతం టీచర్లు వెల్లడించారు.
ఇలా డిజిటల్ విద్యలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ అధ్యయనం పలు సిఫార్సులు చేసింది. ముఖ్యంగా స్వతంత్ర అభ్యాసనంపై దృష్టి, అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రుల్లో డిజిటల్ సామర్థ్య నైపుణ్యాలు పెంపొందించడం, డిజిటల్ వనరులపై దృష్టి సారించాలని సూచించింది. ప్రపంచవ్యాప్తంగా విద్యారంగంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయని.. డిజిటల్ విభజన కారణంగా ఎంతో మంది చిన్నారులు వెనుకబడిపోతున్నారని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ సీఈఓ నైగెల్ పోర్ట్‌వూడ్ అభిప్రాయపడ్డారు
0 Response to "Digital Learning: డిజిటల్ లెర్నింగ్‌కు అడ్డంకులు ఇవే..! ‘ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్’ తాజా అధ్యయనం"
Post a Comment