ఆగని ‘ఎయిడెడ్’ ఆందోళనలు
నిడదవోలు/భీమవరం/ఏలూరు(ఎడ్యుకేషన్), అక్టోబరు 29: రాష్ట్రంలో ఎయిడెడ్ విద్యాసంస్థల విలీనంపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఎయిడెడ్ పాఠశాలల మూసివేతను నిరసిస్తూ యాజమాన్యాలను నిలదీస్తున్నారు. నిడదవోలులోని సెయింట్ ఆన్స్ తెలుగు మీడియం స్కూల్ మూసివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీసీలు తీసుకువెళ్లండన్న నిర్వాహకుల వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. శుక్రవారం విద్యార్థులు, వారి తల్లితండ్రులు పాఠశాల వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. విద్యా సంవత్సరం మధ్యలో పాఠశాల మూసివేయడం సరికాదని మిగిలిన ఆరు నెలలు పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా భీమవరం ఎస్‌సీహెచ్‌బీఆర్‌ఎం ఎయిడెడ్ పాఠశాల విద్యార్థులు కూడా ఆందోళనకు దిగారు. శుక్రవారం పాఠశాల నుంచి ర్యాలీగా బయలుదేరి ‘మాస్కూల్ మాకు కావాలి’ అంటూ నినాదాలు చేస్తూ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఇంటికి వెళ్లి వినతిపత్రాన్ని అందించారు. దీనిపై ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పాఠశాలను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు చూస్తామని ఎవరూ ఆందోళన చెందవద్దని చెప్పారు.
ఎయిడెడ్ కొనసాగింపు!
ఎయిడెడ్ పాఠశాలల ఎత్తివేతకు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతోపాటు ప్రభుత్వం నుంచి ఒత్తిళ్లు కూడా తగ్గడంతో సంబంధిత పాఠశాలలను యథాతథంగా కొనసాగించేందుకు యాజమాన్యాలు సిద్ధమయ్యాయి. పాఠశాలల ఎత్తివేతకు ఇచ్చిన అంగీకార పత్రాలను వెనక్కి తీసుకున్న ఎయిడెడ్ పాఠశాలల సంఖ్య తాజాగా 88కి చేరింది. జిల్లాలో మొత్తం 177 ఎయిడెడ్ పాఠశాలలు మూసివేత లేదా ప్రైవేటు పాఠశాలలుగా కొనసాగించడానికి తొలుత జిల్లా విద్యాశాఖకు అంగీకార పత్రాలను అందచేశాయి. ఈ క్రమంలో మొత్తం 463 మంది ఉపాధ్యాయులను డీఈవో పూల్‌కు చేర్చారు. కానీ, ఎయిడెడ్ పాఠశాలల ఎత్తివేతపై సర్వ త్రా నిరసన వ్యక్తం కావడంతో యాజమాన్యాలన్నీ పునరాలోచనలో పడ్డాయి. ఈ క్రమంలో తొలుత అంగీకార పత్రాలు ఇచ్చిన యాజమాన్యాలు క్రమేణా వాటిని ఉపసంహరించుకుంటున్నాయి. జిల్లాలో ఎక్కువ సంఖ్యలో ఉన్న 76 సీఎ్‌సఐ ఎయిడెడ్ పాఠశాలలతోపాటు మరికొన్ని ఎయిడెడ్ యాజమాన్యాలు అంగీకారపత్రాలను వెనక్కి తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది

0 Response to "ఆగని ‘ఎయిడెడ్’ ఆందోళనలు"
Post a Comment