విద్యార్థుల హాజరును బయోమెట్రిక్ ద్వారా నమోదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యార్థుల్లో సామర్థ్యాలు, నైపుణ్యాల పెంపే లక్ష్యంగా ప్రభుత్వం మరో ముందడుగు వేస్తోంది. విద్యార్థులు పాఠశాలలకు రోజూ హాజరయ్యేలా చర్యలు చేపడుతోంది. ఏడాదిలో కనీసం 75 శాతం హాజరు ఉండేలా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా విద్యార్థుల హాజరును బయోమెట్రిక్ ద్వారా నమోదు చేసేందుకు ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. ప్రభుత్వం మనబడి – నాడు–నేడు కింద కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు విద్యార్థుల తల్లులకు జగనన్న అమ్మఒడి కింద ఏటా రూ.15 వేలు, జగనన్న విద్యాకానుక కింద 3 జతల యూనిఫామ్, షూ, బెల్టు, బ్యాగు, పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, వర్క్‌బుక్స్, డిక్షనరీ అందిస్తోంది. విద్యార్థులకు జగనన్న గోరుముద్ద కింద రుచికరమైన పౌష్టికాహారం అందిస్తోంది. వీటన్నిటి అంతిమ లక్ష్యం.. విద్యాప్రమాణాల పెంపే.
75 శాతం హాజరు ఉంటేనే అమ్మఒడి
విద్యా ప్రమాణాలను పెంచాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే విద్యార్థులు రోజూ పాఠశాలలకు హాజరుకావాలి. ఈ నేపథ్యంలో వారి హాజరును పెంచేందుకు వీలుగా ‘అమ్మఒడి’ పథకానికి హాజరును అనుసంధానం చేస్తోంది. 75 శాతం హాజరు ఉంటేనే అమ్మఒడి పథకాన్ని వర్తింప చేయనుంది. 1 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల తల్లులకు అమ్మఒడిని అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం రూపొందించిన బయోమెట్రిక్ హాజరు యాప్‌ను ప్రయోగాత్మకంగా కృష్ణా జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద అమలు చేస్తోంది. ఇందులో ఏవైనా లోపాలు తలెత్తితే.. వాటిని పరిష్కరించి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి తేనుంది

0 Response to " విద్యార్థుల హాజరును బయోమెట్రిక్ ద్వారా నమోదు"
Post a Comment