సీపీఎస్‌పై తాడో పేడో!



  • నేడు బెజవాడలో ‘సత్యాగ్రహ దీక్ష’
  • సీపీఎస్‌ రద్దు, ఓపీఎస్‌ పునరుద్ధరణకు డిమాండ్‌


అమరావతి, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): కంట్రిబ్యూటరీ పెన్షన్‌ విధానంపై ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవాలని ఉద్యోగవర్గాలు నిర్ణయించాయి!. ఈమేరకు.. సీపీఎస్‌ రద్దు చేయాలని, పాతపెన్షన్‌ విధానం (ఓపీఎస్)పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తూ విశ్రాంత సీపీఎస్‌ ఉద్యోగులు ఉద్యమబాట పట్టారు. ఈ మేరకు శనివారం గాంధీ జయంతి సందర్భంగా విజయవాడ ధర్నా చౌక్‌లో.. ఆంధ్రప్రదేశ్‌ కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ‘సత్యాగ్రహదీక్ష’కు సిద్ధమవుతున్నారు. ‘ఇప్పటి వరకు 1300 మంది సీపీఎస్‌ విధానంలో ఉద్యోగంలో చేరి పదవీ విరమణ చెందారు. వీరిలో అత్యధిక మందికి రూ.700 నుంచి రూ. 2100 వరకే పెన్షన్‌ వస్తోంది. ఇది ప్రభుత్వ తెల్లకార్డు గల వృద్ధులకు ఇచ్చే పింఛను కన్నా తక్కువే. దీంతో.. పదవీ విరమణ తర్వాత తమ జీవితాలు దుర్భరంగా మారాయి’ అని రిటైర్డు ఉద్యోగులు వాపోతున్నారు. సీపీఎస్‌ విధానంలో పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు హెల్త్‌ కార్డు సౌకర్యం కూడా లేదని, ఓపీఎస్‌ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. 


రద్దుకు జగన్‌ హామీ ఇచ్చారు కానీ..

ప్రతిపక్ష నేతగా జగన్‌ తన పాదయాత్రలో.. తాము అధికారంలోకి వచ్చిన సీపీఎస్‌ రద్దు చేస్తామని హామీ ఇచ్చారని.. ఇప్పటికి రెండున్నరేళ్లయినా ఎలాంటి స్పందనా లేదని ఉద్యోగులు వాపోతున్నారు. సీపీఎ్‌సను అమలులోకి తెచ్చిన సెప్టెంబరు 1న రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల మంది సీపీఎస్‌ ఉద్యోగులు, ఉపాధ్యాయులు సీపీఎస్‌ రద్దు చేయాలంటూ నిరసనలు చేపట్టారు. జగన్‌ పాదయాత్రలో తమకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాని నిరసనకు దిగారు. అయినా ప్రభుత్వం ప్రభుత్వం స్పందించలేదు. దీంతో ఆ నిరసన కార్యక్రమానికి కొనసాగింపుగా గాంధీ జయంతిరోజున దీక్షకు పూనుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విశ్రాంత సీపీఎస్‌ ఉద్యోగులు.. ‘సత్యాగ్రహదీక్ష’ చేపట్టారు. 


రూ.774 పెన్షన్‌తో ఎలా బతకాలి

జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి గ్రామ నౌకరుగా పద్దెనిమిదిన్నరేళ్లు, జంగారెడ్డిగూడెం వీఆర్‌వోగా ఆరేళ్లు, తిరుమలదేవి పేట వీఆర్వోగా రెండేళ్లు పనిచేశాను. సీపీఎస్‌ విధానంలోనే రిటైర్డ్‌ అయ్యాను. ఇప్పుడు నాకు పెన్షన్‌ రూ.774 వస్తోంది. ఈ సొమ్ముతో నా కుటుంబం మొత్తం ఎలా బతకాలి. 

నాగ జగ్గారావు, విశ్రాంత వీఆర్‌వో


సర్కారు కొలువే కానీ నికృష్ట బతుకు...

1997లో సిద్ధాంతం హైస్కూల్‌లో పార్ట్‌టైం టీచర్‌గా చేరాను. 2009లో పర్మినెంట్‌ చేసినప్పటికీ.. సీపీఎస్‌ విధానంలో పెట్టారు. 2021 ఫిబ్రవరిలో ఉపాధ్యాయురాలిగా పదవీ విరమణ చేశాను. ఇంకా రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ రాలేదు. పెన్షన్‌ రూ.2 వేలు వస్తుందని చెబుతున్నారు. దానికి సంబంధించిన ప్రక్రియ కూడా ఇం కా జరగలేదు. మా వారికి 75 ఏళ్లు. నాకు ఉద్యోగం ఉందని మా కు రేషన్‌ కార్డు, వృద్ధాప్య పెన్షన్‌ తీసేశారు. ఇన్నాళ్లు గవర్నమెంట్‌ సర్వీస్‌ చేసి నికృష్టమైన బతుకు బతుకుతున్నాం.

పద్మావతి, పశ్చిమ గోదావరి జిల్లా


SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "సీపీఎస్‌పై తాడో పేడో!"

Post a Comment