మెరుపు వేగంతో ఇంటర్నెట్
1 జీబీపీఎస్, అంతకు మించి స్పీడ్‌తో సేవలు
ప్రారంభానికి అమెజాన్, స్టార్‌లింక్ ప్లాన్
న్యూఢిల్లీ, అక్టోబరు 1 : మెరుపు వేగంతో ఇంటర్నెట్ సేవలను పొందే భాగ్యం భారతీయులకు త్వరలో కలగనుంది. కేబుళ్లతో చిక్కులు లేకుండా, నేరుగా ఉపగ్రహం నుంచే హైస్పీడ్ ఇంటర్నెట్‌ను పొందే సదుపాయం మరి కొద్దిరోజుల్లో అందుబాటులోకి రానుంది. ఈ విధానంలో ఎంబీపీఎస్ వేగాన్ని దాటి.. 1 జీబీపీఎస్, అంతకు మించిన స్పీడ్‌తో వినియోగదారులు నాణ్యమైన సేవలను పొందే అవకాశం ఉంది. ప్రపంచ కుబేరులైన ఇద్దరు వ్యాపారవేత్తలు భారత్‌లో ఉపగ్రహ ఆధారిత హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్, ఇంటర్నెట్ సేవలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అమెజాన్ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జెఫ్ బెజోస్, స్పేస్ ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్ భారత్‌లో ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్‌ను అందించేందుకు కసరత్తు ప్రారంభించారు.
ఇందుకు సంబంధించిన ప్రణాళికలతో వారు భారత ప్రభుత్వాన్ని సంప్రదించారు. సునీల్ మిట్టల్‌కు చెందిన ఎయిర్‌టెల్, ముఖేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో కంపెనీలకు జెఫ్, మస్క్ గట్టి పోటీ ఇవ్వబోతున్నారు. ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ విధానంలో.. భూమికి సుమారు వెయ్యి కి.మీ దూరంలో పరిభ్రమించే శాటిలైట్ల ద్వారా ఎక్కువ వేగంతో ఇంటర్నెట్ సేవలు అందుతాయి. కేబుల్ రహిత విధానం కావడం వల్ల.. మారుమూల గ్రామీణ ప్రాంతాలు, కొండలు, ఎడారులు, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు, ఇతర సున్నితమైన ప్రాంతాలకు ఈ ఇంటర్నెట్ సులభంగా చేరుతుంది. దీంతో కేబుల్ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్, ఇంటర్నెట్ సేవలు అందించే ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా సంస్థలకు తీవ్ర పోటీ ఎదురు కానుంది. మస్క్‌కు చెందిన శాటిలైట్ ఇంటర్నెట్ వెంచర్ స్టార్‌లింక్, అమెజాన్ కంపెనీలు టెలికం మంత్రిత్వ శాఖ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్‌తో వేర్వేరుగా చర్చలు జరిపాయి.
స్టార్ లింక్ కంపెనీ త్వరలోనే లైసెన్సు కోసం దరఖాస్తు చేయబోతోంది. కనీసం రెండు లక్షల మంది ఖాతాదారులు లభిస్తే వచ్చే ఏడాది డిసెంబరు నుంచే భారత్‌లో ఇంటర్నెట్ సేవలు ప్రారంభించాలని స్టార్‌లింక్ భావిస్తోంది. ఈ కంపెనీ ఇప్పటికే 5,000 మంది ఖాతాదారులను నమోదు చేసింది. ‘‘స్టార్‌లింక్, అమెజాన్ కంపెనీలకు చెందిన ప్రతినిధులు మాతో చర్చలు జరిపారు. వారు భారత్‌లో ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవలను ప్రారంభించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. త్వరలోనే వారు లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకుంటారని భావిస్తున్నాం’’ అని టెలికం శాఖ వర్గాలు వెల్లడించాయి. ‘‘భారత్‌లో హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు ప్రారంభించాలని ఆసక్తిగా ఉన్నాం. అక్కడి ప్రభుత్వ అనుమతులు తీసుకునేందుకు కసరత్తు చేస్తున్నాం’’ అని ఎలాన్ మస్క్ ఇటీవల ట్విటర్‌లో ప్రకటించారు. ఇక అమెజాన్ ప్రాజెక్ట్ కైపర్ పేరిట ఉపగ్రహ ఆధారిత హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించడం ద్వారా మరింత ఎక్కువ మందికి చేరువ కావాలని భావిస్తోంది. తద్వారా తన రిటైల్ వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలని అనుకుంటోంది. కాగా, వచ్చే ఏడాది నాటికి భారత్ సహా పలు దేశాల్లో ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవలను ప్రారంభిస్తామని సునీల్ మిట్టల్ అతిపెద్ద వాటాదారుగా ఉన్న వన్‌వెబ్ సంస్థ ప్రకటించింది. ఈ సంస్థ ఇప్పటికే టెలికం శాఖ నుంచి నేషనల్ లాంగ్ డిస్టెన్స్ లైసెన్స్‌ను పొందింది.
లైసెన్స్ లేకుండానే వసూళ్లు..
మరోవైపు బ్రాడ్‌బ్యాండ్ లైసెన్స్ కోసం కనీసం దరఖాస్తు చేయకుండానే స్టార్‌లింక్.. భారత్‌లో ఖాతాదారుల నుంచి ముందస్తు డిపాజిట్లు సేకరిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. టెలికం వాచ్‌డాగ్ అనే సంస్థ దీనిపై టెలికం శాఖకు ఫిర్యాదు చేసింది. లైసెన్స్ కోసం దరఖాస్తు చేసినా, లైసెన్స్ లభిస్తుందనే నమ్మకం లేదని ఆ సంస్థ తెలిపింది. పైగా స్టార్‌లింక్ ఈ డిపాజిట్లను ఆర్‌బీఐ నిబంధనలకు విరుద్ధంగా డాలర్లలో సేకరిస్తోందని టెలికం శాఖకు ఫిర్యాదు చేసింది
0 Response to "మెరుపు వేగంతో ఇంటర్నెట్"
Post a Comment