80 శాతం ‘స్ట్రోక్స్‌’ నివారించదగినవే

సడెన్‌ స్ట్రోక్స్‌కు.. 15 ఏళ్ల ముందే లక్షణాలు

కాల్షియం స్కోర్‌, యాంజియో టెస్టులు ముఖ్యం

అమెరికా. బ్రిటన్‌ దేశాల్లో ఇవే ప్రామాణికం

ముందు జాగ్రత్తలతోనే గుండెకు ఆరోగ్యం

రమేశ్‌ హాస్పిటల్స్‌ ఎండీ రమేశ్‌ బాబు వెల్లడి

ఒత్తిడిని జయించాలంటున్న నిపుణులు


అమరావతి/విశాఖపట్నం, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): గుండెపోటు.. కొద్దికాలం కిందటి వరకు ఓ వయసు దాటిన వారిలోనే కనిపించే ఈ సమస్య.. ఇటీవల యుక్త, మధ్య వయసు వారినీ వెంటాడుతోంది. కన్నడ పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మృతి చెందారు. ఇటీవల విశాఖపట్నం నగరంలోని ఒక షాపింగ్‌మాల్‌లో పనిచేస్తున్న వ్యక్తి నిలబడిన చోటే గుండెపోటుతో కుప్పకూలిపోయారు. మరో ఘటనలో నిద్రలో ఉన్న 22 ఏళ్ల యువకుడు గుండెపోటుకు గురై మరణించాడు. ఈ నేపథ్యంలో గుండె పోటుకు కారణాలపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే, ఈ రోజుల్లో సంభవిస్తున్న గుండెపోటు మరణాల్లో 80 శాతం నివారించదగినవేనని ప్రముఖ గుండె చికిత్స నిపుణులు.. రమేశ్‌ హాస్పిటల్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌(ఎండీ) డాక్టర్‌ పి. రమేశ్‌బాబు తెలిపారు. గుండెపోటుతో కన్నడ సినీ హీరో పునీత్‌ రాజ్‌కుమార్‌ మరణించిన నేపథ్యంలో ‘ఆంధ్రజ్యోతి’తో ఆయన మాట్లాడారు. పునీత్‌ జిమ్‌లో వర్కవుట్స్‌ చేయడం వల్ల గుండెపోటు రాలేదని రమేశ్‌ చెప్పారు. గుండెపోటు మరణాల్లో 80 శాతం ముందుగానే గుర్తించే అవకాశం ఉందన్నారు. ఆకస్మిక గుండెపోటు.. 20, 30 ఏళ్ల వయసు వారికి, అందునా.. పుట్టుకతోనే కొన్ని సమస్యలు ఉన్నవారికి వస్తుందన్నారు. ఎనామలస్‌ హారిజన్‌, గుండెలో రిథమ్‌ సమస్యలు, అదనపు విద్యుత్‌ నాళాలు ఉన్న వారికి మాత్రమే వర్కవుట్‌ చేస్తున్నప్పుడు గుండెపోటు వస్తుందని వివరించారు. 40-50 ఏళ్ల వారికి వ్యాయామం చేసే సమయంలో స్ట్రోక్స్‌ వచ్చాయంటే రెండు లేదా మూడు రక్తనాళాలు పూడిపోయి ఉంటాయని తెలిపారు. ఈ పరిస్థితులు 15 ఏళ్ల ముందు నుంచే ప్రారంభమవుతాయని చెప్పారు. రక్తనాళాల్లో 25 శాతం కాల్షియం ఉంటే.. 100 శాతం కొవ్వు చేరినట్టు అర్థం చేసుకోవాలని సూచించారు. కాల్షియం ఎంత శాతం ఉంటే అంతకు మూడింతలు కొవ్వు ఉంటుందన్నారు. శరీరంలో కాల్షియం స్కోర్‌ ఎక్కువగా ఉంటే.. గుండె ప్రమాదంలో ఉందని భావించాలన్నారు. 


ప్రధాన కారణాలివే

గుండెపోటుకు ఒత్తిడి, ఫ్యామిలీ హిస్టరీ, జీవన విధానం కారణాలుగా భావిస్తున్నారు. పునీత్‌ రాజ్‌కుమార్‌ గుండెపోటుతో మృతి చెందడానికి ఫ్యామిలీ హిస్టరీయే కారణమని నిపుణులు చెబుతున్నారు. రాజ్‌కుమార్‌ తండ్రి, అన్నయ్య కూడా గతంలో గుండెపోటుకు గురయ్యారు.  

రోజువారీ తీసుకునే ఆహారంలో కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటే కొలెస్ర్టాల్‌ పెరుగుతుంది. రక్తనాళాల్లో సున్నపు పూతగా ఏర్పడుతుంది. దీనినే ఎథిరోస్కెలోటిక్‌ ప్లేక్‌ అంటారు. తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పుడు పూతలో పగుళ్లు ఏర్పడతాయి. ఈ పగుళ్లు ఏర్పడిన ప్రాంతంలో అతుక్కుపోయి రక్తం గడ్డకట్టేలా చేస్తాయి. దీంతో రక్తం సరఫరాకు అంతరాయం ఏర్పడి స్ర్టోక్‌ వస్తుంది.  

తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పుడు శరీరంలో కార్టికో స్టెరాయిడ్స్‌ ఉత్పత్తి పెరుగుతుంది. దీనివల్ల చక్కెర స్థాయిలు, బీపీ పెరుగుతాయి. తద్వారా రక్తనాళాలు కుంచించుకుపోయి ఎథిరోస్కెలోటిక్‌ ప్లేక్‌కు దారితీసి, గుండెపోటుకు గురవుతారు. హార్ట్‌ స్ర్టోక్స్‌ బారినపడుతున్న వారిలో చెడు కొలెస్ర్టాల్‌ 200కు పైగా ఉంటోందని నిపుణులు చెబుతున్నారు.


కాల్షియం స్కోర్‌ టెస్ట్‌ అవసరం

వ్యక్తుల్లో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ.. కాల్షియం స్కోర్‌ తక్కువగా ఉంటే ఎలాంటి ప్రమాదమూ లేదని డాక్టర్‌ రమేశ్‌బాబు వివరించారు. ప్రతి ఒక్కరూ ‘కాల్షియం స్కోర్‌ టెస్ట్‌’ చేయించుకోవాలని సూచించారు. అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాల్లో ఈ పరీక్షను ప్రామాణికంగా తీసుకుంటున్నారని తెలిపారు. కాల్షియం స్కోర్‌ టెస్ట్‌ను గుండె సమస్యలకు ‘గేట్‌ కీపర్‌’గా భావిస్తారని చెప్పారు. ‘‘కాల్షియం స్కోర్‌ను బట్టి ‘ట్రేస్‌ టెస్ట్‌’ చేయించుకోవాలి. ఇది గుండె సంబంధిత పరీక్షల్లో గేట్‌ కీపర్‌-2గా పరిగణిస్తారు. ట్రేస్‌ టెస్ట్‌లో కూడా సమస్యలు బయటపడితే.. అప్పుడు సి.టి. యాంజీయో చేయించుకుంటే మంచింది. యాంజియో, కాల్షియం స్కోర్‌ టెస్ట్‌ వల్ల రేడియేషన్‌ ఎఫెక్ట్‌ ఉంటుందన్న ప్రచారంలో వాస్తవం లేదు. ప్రపంచ వ్యాప్తంగా 50ు మంది స్టాటిన్‌ టాబ్లెట్లు వాడేస్తున్నారు. ఇవి అత్యంత ప్రమాదకరం. ఛాతీ నొప్పి లక్షణాలు ఉన్నవారు ఎవరైనా తొలుత ట్రోకోనిన్‌ టెస్ట్‌, ఈసీజీ తీయించుకుంటే సరిపోతుంది. కాల్షియం స్కోర్‌ 1000 ఉన్న వారికి 37 రేట్లు అధికంగా గుండె పోటు వచ్చే అవకాశం ఉంది’’ అని రమేశ్‌ బాబు వివరించారు.  


ఒత్తిడికి దూరంగా ఉండాలి

ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవనంలో ఒత్తిడిని నియంత్రించుకోవడం ఎవరికి వారు చేయాల్సిన పని. యోగా, మెడిటేషన్‌తోపాటు మానసిక సాంత్వన కలిగించే అంశాలపై దృష్టిసారించాలి. జంక్‌ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. కాయగూరలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. అధిక కార్బోహైడ్రేట్స్‌ ఉన్న ఆహారం, మద్యం, పొగతాగడం వంటివి గుండెకు ప్రమాదం.

- డాక్టర్‌ సాగర్‌బాబు, కార్డియోథొరాసిస్‌ నిపుణులు, కేజీహెచ్‌

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "80 శాతం ‘స్ట్రోక్స్‌’ నివారించదగినవే"

Post a Comment