27న భారత్‌బంద్‌ చరిత్రాత్మకం


27న భారత్‌బంద్‌ చరిత్రాత్మకం




ఆన్‌లైన్‌ బహిరంగ సభలో డీ రాజా

అమరావతి, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): ‘‘దేశ సమాఖ్య వ్యవస్థపై దాడి చేసేలా, అప్రజాస్వామిక విధానంలో మోదీ పాలన కొనసాగుతోంది. మూడు వ్యవసాయ వ్యతిరేక చట్టాల్ని వ్యతిరేకిస్తూ, మోదీ ప్రజా వ్యతిరేక విధానాల్ని ఎండగడుతూ దేశ వ్యాప్తంగా ఈ నెల 27న తలపెట్టిన భారత్‌ బంద్‌ చరిత్రాత్మకంగా నిలిచిపోతుంది. దేశ ప్రజానీకం, అన్ని రాజకీయ, రైతు, కార్మిక, ప్రజా సంఘాలు బంద్‌ను జయప్రదం చేయాలి’’ అని సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా పిలుపునిచ్చారు. మోదీ ప్రభుత్వ నిరంకుశ విధానాలను నిరసిస్తూ ఈ నెల 27న సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపునిచ్చిన భారత్‌ బంద్‌ను జయప్రదం చేయాలని కోరుతూ సీపీఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో శుక్రవారం భాగస్వామ్య పక్షాల ఆన్‌లైన్‌ బహిరంగ సభను నిర్వహించారు. ఈ సభకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అధ్యక్షత వహించారు. వివిధ రాజకీయ పార్టీల నేతలు, కార్మిక, ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడారు. రాష్ట్రాల హక్కులను హరించేలా కేంద్రం నిర్ణయం తీసుకుంటోందని, మోదీకి దేశాన్ని పాలించే అర్హతలేదని, బీజేపీ పాలనపై అన్ని వర్గాలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నాయన్నారు.  

బంద్‌కు టీడీపీ, కాంగ్రెస్‌ మద్దతు

ఈ నెల 27న జరిగే భారత్‌ బంద్‌లో టీడీపీ భాగస్వామ్యం అవుతుందని టీడీపీ ఎమ్మెల్సీ తొండెపు దశరథ జనార్థన్‌, తెలుగు రైతు అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. బంద్‌కు ఏఐసీసీ సంపూర్ణ మద్దతు ప్రకటించిందని, రాష్ట్రంలో బంద్‌ విజయవంతానికి కాంగ్రెస్‌ శ్రేణులు నడుం బిగించాయని శైలజానాథ్‌ అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినా మోదీ విధానాల వల్ల ప్రజలకు ప్రయోజనం లేకుండా పోయిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు విమర్శించారు. బంద్‌కు తమ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ఎస్‌టీయూ ఏపీ అధ్యక్ష కార్యదర్శులు సీహెచ్‌ జోసఫ్‌ సుధీర్‌బాబు, రఘునాఽథరెడ్డి, ఏపీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు భానుమూర్తి, పి పాండురంగ వరప్రసాదరావు శుక్రవారం తెలిపారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "27న భారత్‌బంద్‌ చరిత్రాత్మకం"

Post a Comment