బీపీ లెక్క మారింది 120/80 కాదు.. 140/90
- సాధారణ వ్యక్తులకైతే ఆలోపు రక్తపోటు ఓకే
- వరుసగా 2 రోజులు ఆ పరిమితికి మించి ఉంటే
- అధిక రక్తపోటుగా పరిగణించి చికిత్స చేయాలి
- హృద్రోగాలు, రిస్క్‌ఫ్యాక్టర్స్ ఉన్నవారికైతే
- సిస్టోలిక్ పోటు 130 దాటితే జాగ్రత్తపడాలి
- మార్గదర్శకాలను సవరించిన డబ్ల్యూహెచ్‌వో
న్యూయార్క్, ఆగస్టు 26: సైలెంట్ కిల్లర్‌గా పేరొందిన అధిక రక్తపోటుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ సవరించింది. ప్రస్తుతం ఉన్న ప్రమాణాల ప్రకారం సిస్టోలిక్ పోటు (హృదయ సంకోచ సమయంలో.. అంటే గుండె కొట్టుకున్నప్పుడు) 120ఎంఎంహెచ్‌జీ, డయస్టాలిక్ పోటు (హృదయం వ్యాకోచించినప్పుడు) 80 ఎంఎంహెచ్‌జీలోపు ఉండాలి. సిస్టోలిక్ పోటు 130కి చేరితే.. డయస్టాలిక్‌పోటు 80 దాటితే జాగ్రత్తపడాలని, జీవనశైలిలో మార్పులు చేసుకోవాలని, ఉప్పు తగ్గించాలని వైద్యులు సూచిస్తున్నారు. కానీ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా బీపీ ప్రమాణాలకు సంబంధించిన మార్గదర్శకాలను సవరించింది. సాధారణ ఆరోగ్యవంతులకు సిస్టోలిక్ పోటు 140ఎంఎంహెచ్‌జీ, అంతకు మించి.. డయస్టాలిక్ పోటును 90ఎంఎంహెచ్‌జీ, అంతకు మించి వరుసగా 2 రోజులపాటు ఉంటే దాన్ని అధిక రక్తపోటుగా పరిగణించాలని పేర్కొంది. రిస్క్ ఫ్యాక్టర్స్.. అంటే పొగ తాగే అలవాటు, మద్యపానం, కష్టపడకుండా ఒకే చోట కూర్చుని పనిచేయడం, రోజుకు అరగంటైనా వ్యాయామం చేయకపోవడం, వంశపారంపర్యంగా బీపీ వచ్చే అవకాశం వంటివి ఉన్నవారికి, హృద్రోగులకు సిస్టోలిక్ పోటు గరిష్ఠంగా 130 దాకా ఉండొచ్చని పేర్కొంది. సవరించిన మార్గదర్శకాలు అధికరక్తపోటు ఔషధాల పరిశ్రమపై పెనుప్రభావం చూపుతాయంటే అతిశయోక్తి కాదు.
వీటితో ముప్పు..
బీపీ రావడానికి పలు కారణాలుంటాయి. వాటిలో కొన్ని మనం మార్చుకోదగ్గ రిస్క్ ఫ్యాక్టర్లు.. అంటే, అధికంగా ఉప్పు తినడం, సంతృప్త కొవ్వులు, ట్రాన్స్‌ఫ్యాట్స్ ఎక్కువగా ఉండే ఆహారం తినడం, పండ్లు, కూరగాయలు తక్కువ తినడం, శారీరక శ్రమ లేకపోవడం, పొగతాగడం, మద్యపానం, స్థూలకాయం, అధికబరువు. ఇవన్నీ మనం ప్రయత్నం మీద మార్చుకోగలవే. ఉప్పు తగ్గించడం, ధూమపానం, మద్యపానం మానుకోవడం, రోజుకు అరగంటైనా చెమట పట్టేలా వ్యాయామం చేయడం, ఎక్కువసేపు ఒకే చోట కూర్చోవడం కాకుండా కాసేపు లేచి అటూ ఇటూ నడవడం, పండ్లు కూరగాయలు ఎక్కువగా తింటూ కొవ్వుపదార్థాలను తగ్గించుకుంటే బీపీ ముప్పు తగ్గుతుంది. ఇక మనం మార్చుకోలేని రిస్క్‌ఫ్యాక్టర్లలో ప్రధానమైనది.. వంశపారంపర్యంగా అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఉండడం. వృద్ధాప్యం, కిడ్నీ జబ్బులు, హృద్రోగాల వంటివాటివల్ల కూడా బీపీ పెరుగుతుంది. ఎలా వచ్చినా.. వైద్యులను సంప్రదించి వారి సూచనల మేరకు తగిన మందులు వాడుతూ, జీవనశైలిలో మార్పుచేర్పులు చేసుకుంటే అధిక రక్తపోటును నియంత్రణలో పెట్టుకోవచ్చు.
128 కోట్లు
ప్రపంచవ్యాప్తంగా 30-79 ఏళ్లవారిలో దాదాపు 128 కోట్ల మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారని అంచనా.
46%
అధిక రక్తపోటు బాధితుల్లో 46% మందికి తమకు ఆ సమస్య ఉన్నట్టు తెలియదు. అందుకే బీపీని సైలెంట్ కిల్లర్ అంటారు. 30 ఏళ్లు దాటాక తరచుగా బీపీ చెక్ చేయించుకోవడం మంచిది. 40 దాటినవారు తప్పనిసరిగా తమ రక్తపోటు స్థాయులను పరీక్షించుకుంటూ ఉండాలి.
30 ఏళ్లలో రెట్టింపు
ప్రపంచవ్యాప్తంగా అధిక రక్తపోటు బాధితుల సంఖ్య గత 30 ఏళ్లల్లో రెట్టింపు అయినట్టు అంతర్జాతీయ పరిశోధకుల బృందం అధ్యయనంలో వెల్లడైంది. వారిలో అత్యధికులు పేద, మధ్య ఆదాయ దేశాల ప్రజలే. 1990 నాటికి ప్రపంచవ్యాప్తంగా 33.1 కోట్ల మంది మహిళలు, 31.7 కోట్ల మంది అధిక రక్తపోటుతో బాధపడుతుండగా.. 2019 నాటికి ఆ సంఖ్యలు మహిళల్లో 62.6 కోట్లకు, పురుషుల్లో 65.2 కోట్లకు పెరిగింది. ఈ అధ్యయన నివేదిక లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితమైంది
0 Response to "బీపీ లెక్క మారింది 120/80 కాదు.. 140/90"
Post a Comment