టీచర్లే.. కానీ చదువు చెప్పనివ్వరు!
ఎవరెవరో చేయాల్సిన పనులన్నీ వారికే
ఐటీ, స్టాటిస్టికల్ పనులు.. బయోమెట్రిక్ రిపేరు కూడా
ఓపెన్ స్కూల్స్ డైరెక్టర్‌గా ఉండేందుకు టీచర్లలోనే పోటీ
కొందరు పైరవీలు చేసి మరీ బోధనకు దూరమవుతున్న వైనం
విద్యాహక్కు చట్టానికి పూర్తి విరుద్ధం.. అయినా చర్యలు శూన్యం
ఉపాధ్యాయుడి ప్రథమ కర్తవ్యం చదువు చెప్పడం. కానీ కొందరు టీచర్లు మాత్రం చదువు చెప్పరు. విద్యాశాఖే చెప్పనీయడం లేదు! కంప్యూటర్ ఆపరేటర్‌గా, అసిస్టెంట్ స్టాటిస్టికల్ అధికారిగా, ఓపెన్ స్కూళ్లకు డైరెక్టర్లుగా.. ఆఖరికి బయోమెట్రిక్ యంత్రాలు మరమ్మతు చేసే వారిగా.. రకరకాల పనులు చేయిస్తోంది. ఈ పనులు కావాలని కొందరు పైరవీలు చేసుకుని మరీ వెళ్తుంటే.. మరికొందరేమో అనివార్య పరిస్థితుల కారణంగా బోధనకు దూరమవుతున్నారు.
(అమరావతి-ఆంధ్రజ్యోతి): విద్యా హక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయులు బోధనేతర విధులేవీ నిర్వహించకూడదు. జనాభా లెక్కల సేకరణ, తుఫాన్లు, ప్రకృతి వైపరీత్యాల సమయాల్లో సాయం, ఎన్నికల విధులు లాంటివి తప్ప.. బోధనేతర పనుల్లోకి వెళ్లకూడదు. కానీ రాష్ట్రంలో ఉపాధ్యాయులను రకరకాల అవసరాలకు వాడేస్తున్నా విద్యాశాఖ దీనిపై కిమ్మనడం లేదు. ఫలితంగా పాఠశాలల్లో పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులు బయట కార్యాలయాల్లో ఇతర పనులు చేస్తున్నారు. అసలే టీచర్ల కొరత వేధిస్తుంటే.. కొందరు ఇలా బోధనకు దూరం కావడం వలన విద్యార్థులకు తీరని నష్టం జరుగుతోంది. అదే సమయంలో ఒక ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి, తక్కువ వేతనం తీసుకుంటున్న ఉద్యోగి చేయాల్సిన పనిని.. అధిక వేతనం తీసుకుంటున్న ఉపాధ్యాయులు చేస్తున్నారు.
దీనివల్ల మానవ వనరుల వృథా కూడా జరుగుతోంది. జిల్లా విద్యాధికారి కార్యాలయంలో స్టాటిస్టికల్ పనులు ఉంటాయి. వీటికోసం అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్లు ఉండాలి. లేకుంటే ఔట్‌సోర్సింగ్ సిబ్బందితో వీటిని చేయిస్తారు. కానీ ఈ పనులు కూడా ఉపాధ్యాయులే చేస్తున్నారు. దీనికోసం వారిని డిప్యుటేషన్‌పై నియమిస్తున్నారు. డీఈవో కార్యాలయంలో ప్రోగ్రామింగ్ అధికారి పనిని టైపిస్టు, క్లర్కులు చేయాలి. ప్రోగ్రామింగ్ అధికారి అంటే దాదాపు కంప్యూటర్ ఆపరేటరే. ఈ పనికి కూడా టీచర్లనే వాడుతున్నారు. కొంతమందైతే ఏళ్ల తరబడి ఇలాంటి పనులే చేస్తున్నారు. కొంతకాలానికి బోధన కూడా మార్చిపోతారేమో అన్నట్లుగా వారు ఇక్కడే అలవాటు పడిపోయారు. మరోవైపు ఓపెన్ స్కూల్స్ డైరెక్టర్‌గా పనిచేసేందుకు డీఈవో కార్యాలయంలో కొందరు అసిస్టెంట్ డైరెక్టర్లు ఉంటారు. దీనికి కూడా ఉపాధ్యాయులనే నియమిస్తున్నారు. ఓపెన్ స్కూల్స్ డైరెక్టర్‌గా పనిచేయడానికి ఫుల్ డిమాండ్ ఉంది. ఇక్కడ ఉంటే ఇతరత్రా ఆదాయం ఉండడమే దీనికి కారణం. పాఠశాలల్లో బయోమెట్రిక్ యంత్రాలు పెట్టారు. కార్వీ సంస్థకు వీటి నిర్వహణ బాధ్యత అప్పగించారు. ఈ యంత్రాల్లో ఏదైనా సమస్య తలెత్తితే ఆ సంస్థే మరమ్మతులు చేయాలి. కానీ ఈ పని కూడా ఉపాధ్యాయులకే అప్పగిస్తున్నారు. వారు మరమ్మతులు చేయడం నేర్చుకోవడం చిత్రమైన విషయం. కొన్ని పాఠశాలల్లో డిజిటల్, వర్చువల్ క్లాస్ రూమ్‌లు ఏర్పాటుచేశారు. యూ స్కై సొల్యూషన్స్ అనే ప్రైవేటు ఏజెన్సీ డిజిటల్ క్లాస్‌రూమ్‌ల నిర్వహణ బాధ్యత చూడాలి. కానీ ఆ పనికీ టీచర్లనే వినియోగిస్తున్నారు.
విద్యాహక్కు చట్టానికి తూట్లు..
విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ 27 ప్రకారం.. ఉపాధ్యాయులను బోధనేతర పనులకు ఉపయోగించకూడదు. పదేళ్లకోసారి జరిగే జనగణన, ప్రకృతి వైపరీత్యాలు, ఎన్నికల సందర్భంలో మాత్రం వారి సేవలను వినియోగించుకోవచ్చు. ఇవి మినహా మరే సందర్భంలోనూ ఇతర బాధ్యతలు అప్పగించరాదు. విద్యాశాఖలో మాత్రం భిన్నంగా జరుగుతోంది. నిబంధనలు విరుద్ధమని తెలిసినా.. విద్య శాఖ డైరెక్టరే ఉపాధ్యాయులను ఇతర విధుల్లోకి తీసుకోవాలంటూ ఉత్తర్వులివ్వడం గమనార్హం. విద్యాహక్కు చట్టం నిబంధనలను ఉల్లంఘించకుండా టీచర్లను ఈ బాధ్యతల్లో నియమించాలంటూ ఉత్తర్వుల్లో పేర్కొనడం మరీ విచిత్రం
0 Response to " టీచర్లే.. కానీ చదువు చెప్పనివ్వరు!"
Post a Comment