Vaccine for Children: వచ్చే నెలలోనే చిన్నారులకు టీకా? ఆశాభావం వ్యక్తం చేసిన కేంద్ర ఆరోగ్యశాఖ
దిల్లీ: దేశవ్యాప్తంగా 18ఏళ్ల వయసుపైబడిన వారికి కరోనా వ్యాక్సిన్ పంపిణీ ముమ్మరంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో చిన్నారుల కోసం టీకాను సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా వచ్చే నెలలోనే చిన్నారుల టీకా
అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఆగస్టులోనే చిన్నారులకు టీకా ఇచ్చే కార్యక్రమం ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని భాజపా ఎంపీలతో జరిగిన సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ సంకేతాలు ఇచ్చారు.
చిన్నారుల టీకా కోసం భారత్ బయోటెక్, జైడస్ క్యాడిలా సంస్థలు క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి. వీటిలో 12-18ఏళ్ల వయసు వారికోసం జైడస్ క్యాడిలా ఇప్పటికే ప్రయోగాలు పూర్తిచేసింది. భారత్ బయోటెక్ మాత్రం 2 నుంచి 18ఏళ్ల వయసు పిల్లలపై మూడో దశ ప్రయోగాలను మూడు దశల్లో నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా 6ఏళ్లకు పైబడిన వారికి రెండు డోసులు ఇచ్చి పరీక్షించింది. వీటి ఫలితాలు త్వరలోనే వెల్లడి కానుండడంతో పాటు వ్యాక్సిన్ కూడా సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయని కొవిడ్ వర్కింగ్ గ్రూప్ ఛైర్మన్ ఎన్‌కే అరోరా ఈ మధ్యే పేర్కొన్నారు. ఇక ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా కూడా సెప్టెంబర్‌లో చిన్నారులకు టీకాలు ఇచ్చే కార్యక్రమం ప్రారంభమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదిలాఉంటే, మోడెర్నా, ఫైజర్ సంస్థలు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను 12ఏళ్ల వయసుపైబడిన వారికి ఇచ్చేందుకు అమెరికా, యూరప్ దేశాలు అనుమతి ఇచ్చాయి. అక్కడ చిన్నారులకు టీకా పంపిణీ కూడా మొదలయ్యింది. ఇక భారత్‌లోనూ కరోనా వ్యాక్సిన్ పంపిణీ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 18ఏళ్ల పైబడిన వారికి 44 కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. నిన్న ఒక్కరోజు 66లక్షల డోసులను అందించినట్లు పేర్కొంది
0 Response to "Vaccine for Children: వచ్చే నెలలోనే చిన్నారులకు టీకా? ఆశాభావం వ్యక్తం చేసిన కేంద్ర ఆరోగ్యశాఖ"
Post a Comment