ఫస్ట్‌ తేదీ జీతం పడి ఎన్నాళ్లయిందో

37 నెలల నుంచి పెన్షన్‌లో జాప్యం

రిటైరై నెలలైనా అందని బెనిఫిట్స్‌

కనీసం జీతాలైనా సరైన టైమ్‌కి ఇచ్చేలా ఆర్థిక వనరులను సమకూర్చుకోవాలి

ఏపీఎన్జీవో నేత  శ్రీనివాసరావు 




తిరుమల, తిరుపతి, జూలై 29 (ఆంధ్రజ్యోతి): సరైన సమయంలో జీతాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నా, నాలుగు నెలలుగా ఉద్యోగులకు ఇబ్బందులు తప్పడం లేదని ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తంచేశారు. కనీసం జీతాలైనా సరైన సమయంలో ఇచ్చేలా ఆర్థిక వనరులను ప్రభుత్వం సమకూర్చుకోవాలన్నారు. గురువారం ఉదయం తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. సంక్షేమ పథకాలతోపాటు ఉద్యోగుల సంక్షేమంపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరారు. అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసినప్పటికీ జీతాలు సక్రమంగా అందని పరిస్థితి నెలకొందన్నారు. ‘‘తెలంగాణలో ప్రకటించిన విఽధంగా 11వ పీఆర్సీని జాప్యం లేకుండా వెంటనే ప్రకటించాలి. ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగులకిచ్చిన హామీలన్నీ వెంటనే అమలు చేయాలి. పెన్షన్ల మంజూరులో జాప్యం నివారించాలి. పాదయాత్రలో ప్రకటించిన విధంగా కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలి’’ అని డిమాండ్‌ చేశారు. ఈ హామీలు నెరవేర్చే శక్తిని సీఎంకు ఇవ్వాలని స్వామివారిని ప్రార్థించానని శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. సీఎ్‌ఫఎంఎస్‌ పథకాన్ని రద్దు చేసి నాల్గవ తరగతి ఉద్యోగులకు 62ఏళ్ల దాకా ఉద్యోగ విరమణ కాలాన్ని పొడిగించాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

‘‘జీతాలు వచ్చే ఒకటో తేదీ ఉద్యోగులకు పండగ. సక్రమంగా వేతనాలు పడక గత నాలుగునెలలుగా మా జీవితాల్లో ఆ పండగే లేకుండా పోయింది. పాలు, కూరగాయలు ఇచ్చే వారు కూడా ఉద్యోగులను చులకనగా చూస్తున్నారు. రిటైర్డ్‌ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్‌ కూడా కొద్ది నెలల నుంచి అందటం లేదు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షన్లు అందించడంలో 37 నెలల నుంచి జాప్యమవుతోంది. చాలా మంది వాటికోసం ఎదురుచూస్తున్నారు. ఒక జిల్లాలో ఉద్యోగులకు పెన్షన్‌ వస్తే మరో జిల్లా వారికి అందడం లేదు’’

- బండి శ్రీనివాసరావు, ఏపీఎన్జీవో అధ్యక్షుడు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఫస్ట్‌ తేదీ జీతం పడి ఎన్నాళ్లయిందో"

Post a Comment