జూన్ కల్లా బడికి రెడీ!
పిల్లల భద్రతపై 60% మందిలో ఆందోళన
‘క్లే’ సంస్థ సర్వే నివేదిక వెల్లడి
85% చిన్నారుల తల్లిదండ్రులు సిద్ధం
న్యూఢిల్లీ, మార్చి 5: దేశంలో కరోనా ఉధృతి క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో తమ పిల్లలను తిరిగి పాఠశాలలకు పంపించడానికి 85శాతం మంది తల్లిదండ్రులు సిద్ధంగా ఉన్నారని ఓ సర్వే వెల్లడించింది. బెంగళూరుకు చెందిన ప్రీస్కూల్, డే కేర్ సెంటర్ క్లే (కేఎల్‌ఏవై) ఆధ్వర్యంలో 2020 నవంబరు, 2021 ఫిబ్రవరిల్లో ఈ సర్వే నిర్వహించారు. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, పుణె, నోయిడా, గురుగ్రామ్, ముంబై నగరాల్లో చేపట్టిన మొదటి దశ సర్వేలో 53శాతం మంది తల్లిదండ్రులు మాత్రమే పిల్లలను బడికి పంపడానికి ఇష్టపడుతున్నారని తేలింది. అయితే రెండోదశలో ఇది 85 శాతానికి పెరిగింది. ఈ ఏడాది జూన్ నాటికి తమ చిన్నారుల భద్రతకు తగిన సురక్షితమైన, సంతోషకరమైన వాతావరణం బడుల్లో ఉంటుందని అధిక శాతం మంది అభిప్రాయపడ్డారు. కరోనా కేసులు తగ్గడంతో పాటు టీకా అందుబాటులోకి రావడం కూడా దీనికి కారణమని సర్వే నివేదిక పేర్కొంది. 0-6 ఏళ్ల చిన్నారులకు భౌతిక దూరం అమలు చేయడం సవాలుతో కూడుకున్నదని క్లే సంస్థ సీఈవో ఏకే శ్రీకాంత్ అన్నారు. పిల్లలు కూర్చునే సీట్లలో వారి ఫొటోలు అంటించడం ద్వారా దీన్ని ఒక ఆటలా మార్చి నిబంధనను అమలుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు.
సర్వేలో వెల్లడైన అంశాలు
- 60% - పాఠశాలకు వెళ్తే పిల్లల భద్రతపై ఆందోళనగా ఉంటుంది
- 21% - బడుల్లో పాటించే భద్రత ప్రొటోకాల్ గురించి తెలుసుకోవాలి
- 16% - ఆటస్థలాలు, బొమ్మలు, ఇతర వస్తువుల శానిటైజేషన్‌పై భయంగా ఉంది
- 11% - పాఠశాలల్లో భౌతిక దూరం నిబంధన అమలు ఎలా ఉంటుందో...
- 10% - స్కూలు సిబ్బందికి కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియపై వివరాలు కావాలి
0 Response to "జూన్ కల్లా బడికి రెడీ!"
Post a Comment