విద్యార్థినులకు ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్స్‌

విద్యార్థినులకు ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్స్‌

ప్రభుత్వ పాఠశాలలూ, జూ.కళాశాలల్లో చదివే వారికే
ఒక్కొక్కరికి ఏడాదికి 120 చొప్పున పంపిణీ
మహిళా దినోత్సవం రోజున పథకం ప్రారంభం
సీఎం వెల్లడి



ఈనాడు డిజిటల్‌, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో 7 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న బాలికలకు బ్రాండెడ్‌ కంపెనీల శానిటరీ న్యాప్‌కిన్స్‌ ఉచితంగా అందించనున్నట్లు ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించారు. జులై 1 నుంచి ప్రతినెలా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు, గురుకుల పాఠశాలల విద్యార్థినులకు పంపిణీ చేస్తామన్నారు. ఒక్కో విద్యార్థినికి నెలకు 10 చొప్పున ఏడాదికి 120 అందిస్తామని తెలిపారు. మహిళా దినోత్సవం రోజున(మార్చి 8) ప్రారంభించే ఈ పథకానికి రూ.41.4 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. ఏప్రిల్‌ 15 నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి నెలాఖరు నాటికి ప్రతిష్ఠాత్మక కంపెనీలతో సెర్ప్‌, మెప్మాలు అవగాహన ఒప్పందం చేసుకుంటాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈమేరకు శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో శానిటరీ న్యాప్‌కిన్స్‌ పంపిణీపై సీఎం సమీక్షించారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు, యువతులకు చేయూత కిరాణా దుకాణాల్లో తక్కువ ధరకే న్యాప్‌కిన్స్‌ అందించాలని అధికారులకు సీఎం సూచించారు


విద్యార్థినులకు పోటీ పరీక్షల కోసం అత్యుత్తమ శిక్షణ అందించాలని సీఎం జగన్‌ ఆదేశించారు. ‘అమ్మఒడిలో 9వ తరగతి, ఆపైన విద్యార్థులకు ల్యాప్‌ట్యాప్‌ను ఎంపిక చేసుకునే అవకాశమిచ్చాం. ఈ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తిగా చేయాలి. ల్యాప్‌ట్యాప్‌ల సహకారంతో కోచింగ్‌ ఇవ్వాలి. ఇంటరాక్టివ్‌ విధానంలో,  సాంకేతికతను వినియోగించుకుంటూ కోచింగ్‌ సంస్థలు, ఎంపిక చేసిన  నిపుణుల సహకారం తీసుకోవాలి’ అని స్పష్టంచేశారు.

న్యాప్‌కిన్స్‌ యంత్రం..!
ప్రభుత్వ పాఠశాలల్లోని బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్స్‌ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా విజయవాడ నగరంలోని ఓ ఉన్నత పాఠశాలలో న్యాప్‌కిన్‌ పంపిణీ యంత్రాన్ని అమర్చారు. ఉపాధ్యాయులు అందించే టోకెన్లు ఇందులో వేసి న్యాప్‌కిన్స్‌ తీసుకోవచ్చు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "విద్యార్థినులకు ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్స్‌"

Post a Comment