జనవరి నుంచి అమల్లోకి రాబోతున్న కొత్త నిబంధనలు
న్యూఢిల్లీ : నూతన సంవత్సరం ప్రారంభం నుంచి కొన్ని రంగాల్లో కొత్త నిబంధనలు అమల్లోకి రాబోతున్నాయి. పాజిటివ్ పే సిస్టమ్, చెక్కుల జారీ, ఫాస్టాగ్స్, టెలిఫోన్, జీఎస్‌టీ రిటర్న్ వంటివాటిలో రాబోతున్న నిబంధనలను తెలుసుకుందాం.
అన్ని ఫోర్ వీలర్లకు ఫాస్టాగ్ తప్పనిసరి : సెంట్రల్ మోటార్ వెహికిల్ రూల్స్, 1989ను కేంద్ర ప్రభుత్వం సవరించింది. దీంతో 2017 డిసెంబరు 1కి ముందు అమ్ముడుపోయిన అన్ని ఫోర్ వీలర్ వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి అని కేంద్ర రోడ్లు, రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.
పాజిటివ్ పే సిస్టమ్ : చెక్కుల కోసం ‘పాజిటివ్ పే’ సిస్టమ్‌ను ప్రవేశపెట్టాలని భారతీయ రిజర్వు బ్యాంకు నిర్ణయించింది. ఇది 2021 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఈ విధానం ప్రకారం చెక్కు ద్వారా రూ.50,000కు మించిన చెల్లింపులు జరపాలంటే ముఖ్యమైన వివరాలను మరోసారి ధ్రువీకరించవలసి ఉంటుంది. చెక్కును జారీ చేసిన వ్యక్తి చెక్కు నెంబరు, తేదీ, డబ్బు ఎవరికి చెల్లించాలి, అకౌంట్ నెంబర్, సొమ్ము వంటి వివరాలను తెలియజేయాలి.
కాంటాక్ట్‌లెస్ కార్డ్ ట్రాన్సాక్షన్ లిమిట్ పెంపు : కాంటాక్ట్‌లెస్ కార్డ్ పేమెంట్స్ లిమిట్‌ను రూ.2,000 నుంచి రూ.5,000కు భారతీయ రిజర్వు బ్యాంకు పెంచింది. ఇది 2021 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది.
త్రైమాసిక వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) రిటర్న్ ఫైలింగ్ ఫెసిలిటీ : ఈ సదుపాయం పరిథిలోకి సుమారు 9.4 మిలియన్ల స్మాల్ బిజినెసెస్ వస్తాయి. ఈ విధానంలో సులువుగా మూడు నెలలకోసారి రిటర్న్ దాఖలు చేయడానికి వీలవుతుంది. ప్రస్తుతం రూ.5 కోట్ల వరకు అమ్మకాలు ఉన్న సంస్థలు ప్రతి నెల రిటర్నులను దాఖలు చేయవలసి ఉంది. ఈ విధానం అమల్లోకి వస్తే సంవత్సరానికి నాలుగు రిటర్నులను దాఖలు చేస్తే సరిపోతుంది.
ల్యాండ్‌లైన్ నుంచి మొబైల్ ఫోన్ కాల్స్ : ల్యాండ్ లైన్ ఫోన్ నుంచి మొబైల్ ఫోన్‌కు కాల్ చేయాలంటే ముందుగా జీరో డయల్ చేసి, ఆ తర్వాత ఆ మొబైల్ నంబరును డయల్ చేయాలి. ఈ విధానం జనవరి 15 నుంచి అమల్లోకి వస్తుందని టెలికాం డిపార్ట్‌మెంట్ ప్రకటించింది
0 Response to "జనవరి నుంచి అమల్లోకి రాబోతున్న కొత్త నిబంధనలు"
Post a Comment