వచ్చే ఏడాది ఏడో తరగతిలో ఆంగ్ల మాధ్యమం మార్చిలో అంగన్‌వాడీ మొదటిదశ పనులు ఏప్రిల్ నుంచి ‘నాడు-నేడు’ రెండో విడత సమీక్షలో సీఎం జగన్
వచ్చే విద్యా సంవత్సరం ఏడో తరగతి విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమం అమలు చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు.
పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికి విద్యా కానుక పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని, ఏకరూప దుస్తులు సహా ఎందులోనూ నాణ్యత తగ్గకుండా చూడాలని సూచించారు. తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం ‘నాడు-నేడు’, జగనన్న విద్యాకానుకపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించే ‘నాడు-నేడు’ రెండో విడత పనులను ఏప్రిల్ నుంచి ప్రారంభించాలి. మరుగుదొడ్ల నిర్వహణకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలి. పారిశుద్ధ్య పనులు చేసే వారికి రూ.6 వేలు చొప్పున చెల్లించాలి. పిల్లల సంఖ్యను అనుసరించి పనివారిని నియమించాలి. వెయ్యికి పైగా విద్యార్థులు ఉంటే నలుగుర్ని నియమించాలి. మరుగుదొడ్లను శుభ్రం చేసేందుకు వినియోగించే సామగ్రితో కలిపి ఒక్కో పాఠశాలకు నెలకు రూ.6,250 నుంచి రూ.8వేల వరకు వ్యయమవుతుంది. పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలి...’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు.
రెండున్నరేళ్లలో అన్ని పనులు పూర్తి
‘‘అంగన్‌వాడీ కేంద్రాల్లో మార్చిలో ‘నాడు-నేడు’ మొదటి దశ పనులు మొదలుపెట్టాలి. రెండున్నరేళ్లలో మొత్తం పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలి. మొదటివిడతలో 6,407 కొత్త భవనాల నిర్మాణం, 4,171 కేంద్రాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలి. రాష్ట్రవ్యాప్తంగా 27,438 కొత్త కేంద్రాలకు భవనాల నిర్మాణం, 16,681 కేంద్రాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలి. ఇందుకు మొత్తం రూ.5వేల కోట్లకుపైగా వ్యయమవుతుంది. పూర్వ ప్రాథమిక విద్యకు రూపొందించిన పుస్తకాల నాణ్యత బాగుండాలి. పిల్లల్లో జిజ్ఞాస పెంచేలా, బోధనకు ప్రత్యేక వీడియోలు రూపొందించాలి...’’ అని సీఎం జగన్ సూచించారు. రెండో విడతలో ప్రాథమిక పాఠశాలలు 9,476, ప్రాథమికోన్నత 822, ఉన్నత 2,771, జూనియర్ కళాశాలలు 473, వసతి గృహాలు 1,668, డైట్ కళాశాలలు 17, మండల విద్యా వనరుల కేంద్రాలు 672, భవిత కేంద్రాలు 446లో నిర్మాణ పనులు చేపట్టాలని ఆదేశించారు
0 Response to "వచ్చే ఏడాది ఏడో తరగతిలో ఆంగ్ల మాధ్యమం మార్చిలో అంగన్‌వాడీ మొదటిదశ పనులు ఏప్రిల్ నుంచి ‘నాడు-నేడు’ రెండో విడత సమీక్షలో సీఎం జగన్"
Post a Comment