పురపాలక’ విద్యకు తూట్లు
మున్సిపల్ ఐఐటీ హైస్కూళ్లు మూసివేత
జూనియర్ కాలేజీలకూ మంగళం
పేద, బడుగు విద్యార్థుల భవిత ప్రశ్నార్థకం
(అమరావతి-ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మున్సిపల్ విద్యా సంస్థల నిర్వహణ లోపభూయిష్టంగా మారుతోంది. పురపాలకశాఖ ఉన్నతాధికారులు అస్తవ్యస్త విధానాలతో మున్సిపల్ విద్యాసంస్థల మనుగడకే ముప్పు తెస్తున్నారు. చక్కగా నడుస్తూ, మంచి ఫలితాలు సాధిస్తున్న పాఠశాలలు, కళాశాలలు మూసివేయడం ద్వారా వాటిల్లో వేలాదిమంది విద్యార్థుల ఉత్సాహంపై నీళ్లు చల్లుతున్నారు. వాటిల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీల్లో అన్యాయం చేస్తూ, అర్హతల్లేని వారికి కీలక స్థానాలు అప్పగిస్తూ విద్యారంగాన్ని అతలాకుతలం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,715 మున్సిపల్ పాఠశాలలున్నాయి. వాటిలో సుమారు 4.25లక్షల మంది విద్యనభ్యసిస్తున్నారు. కరోనా, ఇతర కారణాలతో ఈసారి సుమారు 30,000 మంది విద్యార్థులు మున్సిపల్ పాఠశాలల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. వీరితోపాటు దాదాపు 13,250 మంది టీచర్ల పరిస్థితి ఉన్నతాధికారుల నిర్ణయాలతో అగమ్యగోచరంగా మారింది.
రాష్ట్రంలోని 17 ఐఐటీ మున్సిపల్ హైస్కూళ్లను ఈ విద్యాసంవత్సరంలో మూసివేశారు. విజయవాడ, గుంటూరు, నెల్లూరు తదితర నగరాల్లో ఉన్న ఐఐటీ హైస్కూళ్లలో చదివిన విద్యార్థులు కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా జాతీయస్థాయిలో ప్రతిభ కనబరిచారు. ఈ పాఠశాలలను ఎందుకు మూసివేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణను, ఉన్నతాధికారులను ఉపాధ్యాయ సంఘాలు అడిగితే ‘విధాన నిర్ణయం(పాలసీ డెసిషన్)లో భాగంగా’ అంటున్నారు. నెల్లూరు తదితర ప్రాంతాల్లో పేద, మైనార్టీ విద్యార్థులకు విద్యాబోధన అందిస్తున్న మున్సిపల్ జూనియర్ కళాశాలలను సైతం మూసివేయడంపై ప్రశ్నించినా ‘పాలసీ డెసిషన్’లో భాగమనే సమాధానం వస్తోంది.
పదోన్నతులివ్వండి సారూ..
సాధారణ విద్యాశాఖలో క్రమం తప్పకుండా పదోన్నతులిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపల్ విద్యాసంస్థల్లోని ఉపాధ్యాయులకు ఆ విధానం వర్తింపజేయడం లేదు. తమకు ప్రమోషన్లు ఇవ్వాలని దాదాపు రెండేళ్లుగా వీరు మొరపెట్టుకుంటున్నా ఉన్నతాధికారులకు పట్టడంలేదు. పైగా ఏ సబ్జెక్ట్ టీచరైనా ఉద్యోగవిరమణ చేస్తే, ఆ పోస్టులను అర్హులతో భర్తీ చేయకుండా విద్యార్థులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు. విజయవాడ, విశాఖ నగరపాలక సంస్థల్లో ఉప విద్యాశాఖాధికారి(డీవైఈవో) పోస్టులను నిర్దేశిత విద్యార్హతలు, అనుభవం కలిగిన ఉపాధ్యాయులతో భర్తీ చేయకుండా, పురపాలకశాఖ ఉద్యోగులకు కట్టబెట్టారు.
విద్యార్హత, బోధనానుభవం లేనివారిని ఈ పోస్టుల్లో నియమించడమంటే విద్యాహక్కు చట్టాన్ని ఉల్లంఘించినట్లేనని ఎంటీఎఫ్ తదితర ఉపాధ్యాయ సంఘాలు విమర్శిస్తున్నాయి. రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థల్లో మొత్తం 9డీవైఈవో పోస్టులు మంజూరవగా, వాటిని అర్హులతో భర్తీ చేయకుండా సుమారు దశాబ్దంపాటు కాలక్షేపం చేశారని, ఇదే అన్యాయమనుకుంటే, తాజాగా అనర్హులతో భర్తీచేసి మరింత అన్యాయం చేస్తున్నారని ఎంటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.రామకృష్ణ ఆక్షేపించారు
0 Response to "పురపాలక’ విద్యకు తూట్లు"
Post a Comment