ప్రతి మండలంలో జూనియర్‌ కళాశాల

అమరావతి, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రతి మండలంలో  ఒక జూనియర్‌ కళాశాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం 159 మండలాల్లో కళాశాలలు లేవని, ఆయా మండలాల్లో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలని సూచించారు.  



సీఎం జగన్‌ తన క్యాంపు కార్యాలయంలో సోమవారం ‘నాడు-నేడు’పై  ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘నాడు-నేడు’ తొలిదశ పనులు వచ్చే ఫిబ్రవరి నాటికి పూర్తి చేయాలన్నారు. రెండో దశ పనుల్లో హాస్టళ్లు కూడా ఉన్నాయని, 2022 సంక్రాంతి నాటికి అన్ని హాస్టళ్లలో బంకర్‌ బెడ్లతో సహా సకల సదుపాయాలు కల్పించాలన్నారు. ‘ముఖ్యంగా బాత్‌ రూమ్‌ల నిర్వహణలో అలక్ష్యం చూపొద్దు. మరమ్మతులు రాకుండా ఉండే విధంగా మెటీరియల్‌ వాడాలి. అన్ని బాత్‌ రూమ్‌లలో హ్యాంగర్లు కూడా ఉండాలి. గిరిజన ప్రాంతాల హాస్టళ్లలో నీళ్లు లేక విద్యార్థులు బయటకు వెళ్లడం స్వయంగా చూశాను.


అందువల్ల హాస్టళ్లలో బాత్‌ రూమ్‌ల నిర్వహణపై ప్రణాళిక సిద్ధం చేయండి.  భవిష్యత్తులో అంగన్‌ వాడీల్లోనూ ‘నాడు-నేడు’ పనులు చేపడతాం. కనుక, పనుల నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడొద్దు’ అని చెప్పారు. జగనన్న విద్యా కానుక కిట్‌లో ప్రతి ఒక్కటీ  నాణ్యత కలిగి ఉండాలని ఆదేశించారు. ‘హాస్టళ్లలో పిల్లలకు రోజుకొక వెరైటీ ఫుడ్‌ ఉండాలని స్పష్టం చేశారు. తొలిదశ పనులు కొవిడ్‌ కారణంగా కాస్త ఆలస్యమయ్యాయని, పనులు మాత్రం అత్యంత నాణ్యతగా కొనసాగుతున్నాయని అధికారులు వివరించారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ప్రతి మండలంలో జూనియర్‌ కళాశాల"

Post a Comment