నేటి కేబినెట్ నిర్ణయాలు...

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన రెండున్నర గంటలపాటు సాగిన మంత్రి వర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ నిర్ణయాలను మంత్రి కన్నబాబు మీడియాకు వెల్లడించారు. నూతన ఇసుక విధానానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఇకపై ఇసుకను ఆఫ్‌లైన్‌లోనూ తెచ్చుకోవచ్చని మంత్రి వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక రీచ్‌లను ఒకే సంస్థకు, అదీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకు అప్పగించాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఒక వేళ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ముందుకు రాకపోతే బహిరంగ వేలం వేయాలని మంత్రివర్గం తీర్మానించింది. అంతేకాకుండా అగ్నిమాపక శాఖలో నాలుగు జోన్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోద ముద్రవేసింది. ఇప్పటివరకు రెండుజోన్లుగా ఉన్న అగ్నిమాపక, విపత్తు నిర్వహణ శాఖలను సౌలభ్యం కోసం 4 జోన్లుగా విభజన చేయాలని నిర్ణయించింది. కొన్ని జైలు సూపరింటెండెంట్‌ పోస్టుల భర్తీకి మంత్రివర్గం ఆమోదించింది. ఆదోనిలోని 2 వర్గాల ఘర్షణ కేసులను వెనక్కి తీసుకోవాలని మంత్రి వర్గం నిర్ణయించింది.

జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికీ రేషన్‌ బియ్యం పంపిణీ చేయాలనే నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. ఇప్పటికే పైలట్‌ ప్రాజెక్టుగా శ్రీకాకుళం జిల్లాలో దీన్ని అమలు చేస్తున్నారు. మరోవైపు రేషన్‌ బియ్యం పక్కదారి పట్టకుండా బియ్యం సంచులపై క్యూఆర్‌ కోడ్‌ను ముద్రించనున్నట్లు మంత్రి కన్నబాబు తెలిపారు. ఎస్‌ఈబీని మరింత బలోపేతం చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. డ్రగ్స్‌, గుట్కా, ఇతర మత్తుపదార్థాలతో పాటు ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్‌నూ ఎస్‌ఈబీలో పరిధిలోని తీసుకొచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వీధి వ్యాపారులకు రూ.10వేల వడ్డీలేని రుణం అందించే ‘జగనన్న తోడు’ పథకానికి రూ.వెయ్యికోట్లు కేటాయిస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "నేటి కేబినెట్ నిర్ణయాలు..."

Post a Comment