సైజుల్లేని బూట్లు..జిప్పుల్లేని బ్యాగులు

అస్తవ్యస్తంగా ‘జగనన్న కానుక’ పంపిణీ

వలంటీర్లకు వదిలేసిన హెడ్‌ మాస్టర్లు

మండలాలకు చేరవేత..పంపిణీలో కిరికిరి

కిట్ల పంపిణీ మొదలై ఇప్పటికి 40రోజులు

ఇంకా కానుక అందని పాఠశాలలెన్నో


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా .. ప్రచారాస్త్రంగా మలుచుకున్న కార్యక్రమం ‘జగనన్న విద్యా కానుక’! దేశంలో ఎక్కడా ఇలాంటి కార్యక్రమం అమలు కావడంలేదని ఎంతో ఘనంగా చెప్పుకుంటోన్న పథకం ఇది! కానీ ఈ కార్యక్రమం అమలు తీరు అంత ‘ఘనం’గా లేకపోవడమేకాదు, అంతా గందరగోళంగా తయారయిందని పాఠశాల విద్యాశాఖ వర్గాలే చెబుతున్నాయి. ఈ పథకం అమలుపై పాఠశాల విద్యా శాఖ మరోసారి మార్గదర్శకాలు విడుదల చేయాల్సిన పరిస్థితి వచ్చింది. పాఠశాల స్థాయిలో ప్రధానోపాధ్యాయులు, మండల స్థాయిలో ఎంఈవోలు, జిల్లా స్థాయిలో డీఈవోలు  పూర్తి స్థాయి బాధ్యత తీసుకుని... ఇతర అధికారులు, సిబ్బందితో  సమన్వయం  చేసుకుంటూ కిట్ల పంపిణీ పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చింది.  చాలా మంది ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సరిగా సైజులు తీసుకోలేదని, తప్పు సైజులు పంపించారని  ఈ శాఖ పరిశీలనలో తేలింది. పర్యవేక్షణ లోపం వల్ల సీఆర్పీలు,  వలంటీర్ల ద్వారా సైజులు తీసుకుని ఆర్డర్‌ పెట్టారని తేల్చారు. 


పాఠశాల స్థాయికి తీసుకెళ్లాలన్నా..

మండల రిసోర్సు కేంద్రం నుంచి ముందుగా ఇండెంట్‌ పెట్టిన సరుకును పాఠశాలస్థాయికి తీసుకు వెళ్లాలని ఇచ్చిన ఆదేశాలు అమలు కాలేదు. ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణ లేకుండా అటెండర్లు, సీఆర్పీలు, ఇతర వ్యక్తులు వెళ్లి అవసరమైనవీ , లేనివీ బూట్లను ఇష్టానుసారంగా తీసుకుని పంపిణీ చేశారు.   సరిపోని/ డ్యామేజ్‌ అయిన బూట్లను  వెనక్కి తిరిగి ఇస్తే మళ్లీ కొత్తవి ఇస్తారన్న విషయాన్ని  పిల్లలకు కనీసం తెలియజేయలేదు. పిల్లలకు పంపిణీ చేశాక మిగిలిన సరుకును  రిసోర్సు కేంద్రానికి ఇవ్వాలన్న సూచనలు గాలికిపోయాయి. మండల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులు పూర్తి స్థాయి నిర్లక్ష్యాన్ని, వైఫల్యాన్ని ప్రదర్శించినట్లు తేల్చారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి 40 రోజులు పూర్తయినా ఇప్పటికీ  చాలా పాఠశాలలు కొంత సరుకు విద్యార్థులకు ఇవ్వలేదు.


కానీ సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయానికి ఇచ్చిన రిపోర్టులో మాత్రం అన్నీ ఇచ్చినట్లుగా తప్పుడు నివేదికలు పంపించారు. ఇవన్నీ ఇటీవల సీఎంవో, పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, సమగ్ర శిక్ష రాష్ట్ర స్థాయి అధికారులు రాష్ట్రంలో పలు పాఠశాలలను తనిఖీ చేసినప్పుడు గుర్తించిన లొసుగులు. కానీ విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేశ్‌ మాత్రం ఈ లోపాల గురించి ఏ మాత్రం పట్టించుకోకుండా .. నాణ్యతతో కూడుకున్న నోట్‌ బుక్స్‌, విద్యాకానుక కిట్లు ఇచ్చామని పదేపదే చెబుతుండటం గమనార్హం. మరోవైపు చూస్తే, గుర్తించిన లొసుగులను సరిదిద్దుకొనే పనిని పాఠశాల విద్యాశాఖ ఎట్టకేలకు ప్రారంభించింది. 


మార్గదర్శకాలు ఇవీ..

పాఠశాల వారీగా ఇచ్చిన బూట్లలో అవసరమైనవీ, మిగిలినవీ, డ్యామేజ్‌ ఉన్న వాటిని  మండల రిసోర్సు కేంద్రానికి ఈ నెల 18లోపు చేర్చాలి. చేరిన బూట్లను తిరిగి అవసరం మేరకు పాఠశాలలకు పున:పంపిణీ చేయాలి. రిసోర్సు కేంద్రాల్లోనూ, మండల స్థాయిలోనూ మిగిలిన బూట్లను తిరిగి జిల్లా స్థాయిలో అవసరమైన ఇతర మండలాలకు పంపిణీ చేయాలి.  సదరు జిల్లాలో ఇచ్చిన బూట్ల పూర్తి వివరాలు అంటే డ్యామేజీ అయిన, మిగిలిన, ఇంకా అవసరమైన బూట్ల వివరాలను రాష్ట్ర కార్యాలయానికి పంపించాలి. 19, 20ల్లోపు ఈ కార్యక్రమం పూర్తి చేసి ఆ రిపోర్టులను 21 తేదీకల్లా రాష్ట్ర కార్యాలయానికి పంపించాలి

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "సైజుల్లేని బూట్లు..జిప్పుల్లేని బ్యాగులు"

Post a Comment