97 మంది టీచర్లకు పాజిటివ్Nov
కృష్ణా జిల్లాలో ఒక్కరోజే 124 కేసులు
తూర్పులో 8 మంది విద్యార్థులకు వైరస్
కరోనాతో ఉపాధ్యాయుడు మృత్యువాత
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్)
రాష్ట్రంలోని పాఠశాలల్లో మళ్లీ కరోనా కలవరం మొదలైంది. కృష్ణా జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన కరోనా పరీక్షల్లో బుధవారం 97 మంది ఉపాధ్యాయులు, 27 మంది విద్యార్థులకు వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. ఒక్కరోజులోనే 124 కేసులు నమోదవడం జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. కాగా.. తూర్పుగోదావరి జిల్లాలో మరో 8 మంది విద్యార్థులు కరోనా బారినపడగా.. ఓ ఉపాధ్యాయుడు కొవిడ్‌తో మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. ముమ్మిడివరం మండలం సీహెచ్ గున్నేపల్లి జడ్పీ హైస్కూల్‌లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న గాలిదేవర త్రినాథరావు (45) బుధవారం కరోనాతో మృతిచెందారు. ఇటీవల ఆయనకు వైరస్ సోకడంతో కొన్నిరోజులుగా అమలాపురం కిమ్స్ కొవిడ్ సెంటర్‌లో చికిత్స పొందుతున్నారు.
పరిస్థితి విషమించడంతో బుధవారం మృతి చెందారు. అంబాజీపేట మండలం కె.పెదపూడి జిల్లా పరిషత్ హైస్కూల్, తొండంగి మండలం ఏవీ నగరం ఉన్నత పాఠశాల, కాట్రేనికోన మండలం చెయ్యేరు హైస్కూల్‌లలో ఒక్కో విద్యార్థికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కె.గంగవరం మండలం కుందూరు ఉన్నత పాఠశాలలో నలుగురు విద్యార్థులు, దంగేరు ఉన్నత పాఠశాలలో ఒక విద్యార్థికి తాజాగా కొవిడ్ సోకింది.
రాష్ట్రంలో కొత్తగా 1,732 కేసులు
రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతున్నట్టు కనిపిస్తోంది. వరుసగా మూడోరోజు కూడా 2 వేలలోపే కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 70,405 శాంపిల్స్‌ను పరీక్షించగా 1,732 మందికి పాజిటివ్‌గా తేలినట్టు వైద్యఆరోగ్యశాఖ బుధవారం వెల్లడించింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 8,47,977కి పెరిగింది. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో 344 మందికి వైరస్ సోకగా.. కృష్ణాలో 246, పశ్చిమ గోదావరిలో 227, చిత్తూరులో 198, గుంటూరులో 195 కేసులు నమోదయ్యాయి. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 1,761 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 8,20,234కి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 20,915 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా దెబ్బకు రాష్ట్రంలో మరో 14 మంది మరణించారు. కృష్ణాలో ముగ్గురు, అనంతపురం, చిత్తూరు, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఇద్దరేసి చొప్పున, తూర్పుగోదావరి, గుంటూరు, నెల్లూరుల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మరణాల సంఖ్య 6,828కి పెరిగింది
0 Response to "97 మంది టీచర్లకు పాజిటివ్Nov"
Post a Comment