49 ఇంజనీరింగ్‌ కాలేజీలు క్లోజ్‌

జేఎన్‌టీయూకే పరిధిలో 26.. జేఎన్‌టీయూఏలో 23 కాలేజీలు

25% కన్నా తక్కువ అడ్మిషన్లు ఉండటమే ప్రధాన కారణం 

మౌలిక సదుపాయాలు లేని మరో 64 కాలేజీల్లో సీట్లకు కోత

ఈసీల ఆమోదంతో సర్కారుకు జాబితాలు పంపిన వర్సిటీలు


అమరావతి, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): కనీసం 25 శాతమైనా అడ్మిషన్లు లేని ఇంజనీరింగ్‌ కాలేజీల కథ కంచికి చేరనుంది. రాష్ట్రంలో ఇలాంటి 49 ఇంజనీరింగ్‌ కాలేజీలు మూతపడనున్నాయి. ఇందులో జేఎన్‌టీయూకే పరిధిలో 26, జేఎన్‌టీయూఏ పరిధిలో 23 కాలేజీలు ఉన్నాయి. కొన్ని సంవత్సరాలుగా 25 శాతం కంటే తక్కువ అడ్మిషన్లు కలిగి ఉండటం, జీరో అడ్మిషన్ల కారణంగా ఆయా ఇంజనీరింగ్‌ కాలేజీల మూతకు ఈ రెండు విశ్వవిద్యాలయాలు ప్రభుత్వానికి ప్రతిపాదించాయి. ఈ మేరకు పాలక మండళ్ల (ఈసీ) ఆమోదముద్ర వేయించుకుని ఆ కాలేజీల జాబితాను ఉన్నత విద్యా మండలికి, ఉన్నత విద్యాశాఖకు పంపించాయి. దీంతో ఆయా కాలేజీలను 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్ల కౌన్సెలింగ్‌ జాబితా నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయనుంది. ఈ 49 కాలేజీలు మూతపడితే వెబ్‌ కౌన్సెలింగ్‌లో దాదాపు 12వేల వరకు సీట్లు కనిపించవు. అలాగే ఏఐసీటీఈ నిబంధనల మేరకు మౌలిక సదుపాయాలు లేవన్న కారణంగా మరో 64 ఇంజనీరింగ్‌ కాలేజీల్లో సీట్లను తగ్గించాలని కూడా ఆ వర్సిటీలు నిర్ణయించాయి.


జేఎన్‌టీౄయూకే తన పరిధిలోని 47 కాలేజీల్లో 4,812 సీట్లు తగ్గించింది. అలాగే జేఎన్‌టీయూఏ మూతకు ప్రతిపాదించిన 23 కాలేజీలు, సీట్లు తగ్గించిన 17 కాలేజీల్లో కలిపి దాదాపు 5,100 సీట్లు తగ్గించనుంది. ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ కొన్ని నెలల క్రితం జీరో అడ్మిషన్లు, మౌలిక సదుపాయాలు లేని కాలేజీలు, ఆదాయ-వ్యయాల లెక్కల్లో తేడాలున్నట్లు గుర్తించిన కాలేజీల జాబితాను జేఎన్‌టీయూకే, జేఎన్‌టీయూఏలకు పంపించి, తనిఖీలు చేసి నివేదించమని ఆదేశించింది. దీంతో ఆయా వర్సిటీలు నిజనిర్ధారణ కమిటీలను ఏర్పాటుచేసి భౌతిక తనిఖీలు చేయింౄచాయి. ఆ తర్వాత కాలేజీలు సమర్పించిన సమాచారంతో సరి చూశాయి.


అన్నీ పరిశీలించిన అనంతరం కాలేజీల మూత, సీట్ల తగ్గింపు ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించాయి. స్వచ్ఛందంగా మూతకు లేఖలు ఇచ్చిన కాలేజీలతో పాటు వర్సిటీలు ప్రతిపాదించిన కాలేజీలకు రెగ్యులేటరీ కమిషన్‌ ఫీజులు సిఫారసు చేయదు. మిగిలిన కాలేజీలకు మాత్రమే 2020-21 విద్యా సంవత్సరానికి ఫీజులు సిఫారసు చేస్తుంది. వాస్తవానికి ఫీజులపై ఇప్పటికే కసరత్తు పూర్తిచేసిన కమిషన్‌.. సర్కారు ఉత్తర్వులు రాగానే కొత్త ఫీజులను ప్రభుత్వానికి సిఫారసు చేయనుందని సమాచారం. రెండు, మూడు రోజుల్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుందని తెలిసింది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "49 ఇంజనీరింగ్‌ కాలేజీలు క్లోజ్‌"

Post a Comment