బడుల మూసివేతతో భవిష్యత్తు భయంకరం

 బడుల మూసివేతతో భవిష్యత్తు భయంకరం

కరోనా సంక్షోభంతో భవిష్యత్తులో జీడీపీపై తీవ్ర ప్రభావం
భారత ఆదాయంలో రూ.29 లక్షల 35 వేల కోట్ల కోత
ప్రపంచ బ్యాంకు నివేదిక

దిల్లీ: కరోనా వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా దేశంలో దీర్ఘకాలం పాటు పాఠశాలలు మూసివేయడం భవిష్యత్తులో తీవ్ర ప్రతికూలతను చూపనుందని ప్రపంచ బ్యాంకు హెచ్చరించింది. దీనివల్ల విద్యార్థుల అభ్యాస ప్రక్రియకూ తీవ్ర విఘాతం కలగడమే కాక  రాబోయే కాలంలో దేశం సుమారు రూ.29 లక్షల 35 వేల 404 కోట్లు(400 బిలియన్‌ డాలర్లు) ఆదాయం కోల్పోయే ప్రమాదముందని పేర్కొంది. భారత్‌ సహా దక్షిణాసియా దేశాలు పాఠశాలల మూసివేత ద్వారా మొత్తంగా 622 బిలియన్‌ డాలర్లు నష్టపోనున్నాయని వెల్లడించింది. ఆయా దేశాల జీడీపీ కూడా గణనీయంగా తగ్గిపోనుందని పేర్కొంది. ‘బీటెన్‌ ఆర్‌ బ్రోకెన్‌? ఇన్ఫార్మాలటీ అండ్‌ కొవిడ్‌-19 ఇన్‌ సౌత్‌ ఏసియా’ పేరుతో విడుదల చేసిన నివేదికలో ప్రపంచ బ్యాంకు ఎన్నో ఆందోళనకర విషయాలను వివరించింది. ‘‘దక్షిణాసియా దేశాల్లో పాఠశాలల తాత్కాలిక మూసివేత విద్యార్థులపై పెను ప్రభావం చూపనుంది. ఆయా దేశాల్లో ప్రాథమిక, మాధ్యమిక విద్యను అభ్యసిస్తున్న సుమారు 3.91 కోట్ల విద్యార్థులు బడులకు దూరమయ్యారు’’ అని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. కరోనా సంక్షోభం వల్ల సుమారు 55 లక్షల మంది బడులకు శాశ్వతంగా దూరం కానున్నారని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. దీని వల్ల ఒక తరం విద్యార్థుల ఉత్పాదకత మీద జీవిత కాల ప్రభావం ఉండబోతోందని తెలిపింది. విద్యా సంవత్సరంలో సగ భాగం కోల్పోయిన ఆ విద్యార్థుల అభ్యాస నష్టం తీవ్రంగా ఉందని పేర్కొంది. దీనివల్ల ఆయా దేశాల వేతనాల స్థాయిని పరిగణనలోకి తీసుకుంటే సగటున దక్షిణాసియాలోని ఒక్కో విద్యార్థి జీవితకాలంలో 4,400 డాలర్ల ఆదాయాన్ని కోల్పోనున్నాడని తెలిపింది. దక్షిణాసియా దేశాలన్నీ కలిపి ప్రాథమిక, మాధ్యమిక విద్య కోసం ఏటా 400 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేస్తున్నాయని, అయితే పాఠశాలల మూసివేత ద్వారా అంతకు మించి ఆదాయాన్ని కోల్పోనున్నాయని వెల్లడించింది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to " బడుల మూసివేతతో భవిష్యత్తు భయంకరం"

Post a Comment