ఎల్టీసీ కానుక

  • టూర్‌ వెళ్లకుండానే డబ్బులు ఖర్చు పెట్టుకోవచ్చు
  • ఇష్టం వచ్చిన వస్తువులు కొనుక్కోవచ్చు
  • కొవిడ్‌ నేపథ్యంలో ఉద్యోగులకు కేంద్రం ఆఫర్‌
  • రద్దయిన దసరా అడ్వాన్స్‌ పునరుద్ధరణ
  • ఉద్యోగికి రూ.10 వేల చొప్పున చెల్లింపు
  • కేంద్ర ఉద్యోగులకు ఉద్దీపన ప్యాకేజీ
  • ప్రభుత్వరంగ సంస్థల్లోనూ అమలు 
  • మార్చి 31లోగా వినియోగానికి ఆదేశం
  • రాష్ట్రాలూ, ఎల్టీసీ వర్తించే ప్రైవేటు సంస్థలూ 
  • ఇలాగే డబ్బులివ్వాలని నిర్మల సూచన
  • ఐటీ రాయితీ వర్తింపజేస్తామని హామీ
  • రాష్ట్రాలకు 12 వేల కోట్లు వడ్డీలేని రుణం
  • స్వయంగా 25 వేల కోట్ల మూలధన ఖర్చు
  • బడ్జెట్లోని రూ.4.13 లక్షల కోట్లకు అదనం
  • సమయానుగుణమైన నిర్ణయం: మోదీ
  • ప్యాకేజీ విలువ రూ.73 వేల కోట్లు
  • దీంతో ఆర్థిక రంగానికి ఊతం: నీతిఆయోగ్‌




కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ మాలాగే ఎల్టీసీ, దసరా అడ్వాన్స్‌ ఇవ్వాలి. ఎల్టీసీ, దసరా అడ్వాన్సులతో రూ.36,000 కోట్ల మేర వినియోగ వస్తువుల కొనుగోలు జరుగుతుంది. ఉద్దీపన ప్యాకేజీలు ద్రవ్యోల్బణానికి దారి తీయకూడదనే ఉద్దేశంతో ఆచితూచి అడుగు వేస్తున్నాం.

- ఆర్థిక మంత్రి నిర్మల



న్యూఢిల్లీ, అక్టోబరు 12: కరోనా కష్టకాలంలో ఉద్యోగుల చేతిలో కాస్త డబ్బులు ఆడే విధంగా కేంద్ర ప్రభుత్వం రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కరోనా సమయంలో విహార యాత్రలకు వెళ్లడం సాధ్యం కాదు కాబట్టి.. అందుకోసం ఇచ్చే లీవ్‌ ట్రావెల్‌ కన్సెషన్‌(ఎల్టీసీ) మొత్తాన్ని నగదుగా చెల్లించాలని నిర్ణయించింది. ఎల్టీసీకి వచ్చే ఐటీ మినహాయింపు ఇక్కడ కూడా వర్తిస్తుంది. ఈ సొమ్మును 12శాతం, అంతకన్నా ఎక్కువ జీఎస్టీ వర్తించే వస్తువుల కొనుగోలుకు వినియోగించవచ్చు. అంటే, ఆహార సంబంధ వస్తువుల మీద వెచ్చించడానికి వీల్లేదన్న మాట. దీనికితోడు దసరా అడ్వాన్స్‌గా మరో పది వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లిస్తారు. ఇది కాకుండా కేంద్రం వివిధ రంగాల మీద పెట్టుబడుల కోసం రాష్ట్రాలకు రూ.12,000 కోట్లు 50 ఏళ్ల పాటు వడ్డీలేని రుణాన్ని ఇవ్వనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. 


కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ తమలాగే ఎల్టీసీ, దసరా అడ్వాన్స్‌ ఇవ్వాలని సూచించారు. ఎల్టీసీ, దసరా అడ్వాన్సులతో రూ.36,000 కోట్ల మేర వినియోగ వస్తువుల కొనుగోలు జరుగుతుందని మంత్రి అంచనా వేశారు. దీని ప్రభావంతో దసరా సీజన్‌కు మరో లక్ష కోట్ల అదనపు డిమాండ్‌ ఏర్పడుతుందని చెప్పారు. డిమాండ్‌ పెంచేందుకు ఇచ్చే ఉద్దీపన ప్యాకేజీలు చివరకు ద్రవ్యోల్బణానికి దారి తీయకూడదనే ఉద్దేశంతో ఆచితూచి అడుగు వేస్తున్నట్లు తెలిపారు. ఎల్టీసీ కింద నగదు తీసుకొనే వారు.. తమకు అర్హత ఉన్న ఎల్టీసీ చార్జీల మొత్తానికి మూడు రెట్లు, ఎల్టీసీ కాలానికి వాడుకొనే కనీస ఎర్న్‌డ్‌ లీవుల మొత్తానికి సమానమైన విలువ కలిగిన వస్తువులను వచ్చే ఏడాది మార్చి 31లోపు కొనుగోలు చేయాల్సి ఉంటుందని మంత్రి చెప్పారు. వస్తువులు కొన్న బిల్లులను ఆన్‌లైన్లో చెల్లించాలని స్పష్టం చేశారు. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రూ.5,675 కోట్లు చెల్లించాల్సి ఉంటుందన్నారు. బ్యాంకులు, ఇతర ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులకు మరో రూ.1,900 కోట్లు అవుతాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రయివేటు రంగ సంస్థలూ ఈ పద్ధతిని అనుసరించదలచుకుంటే ఐటీ రాయితీని అనుమతిస్తామని ప్రకటించారు. 


ఎల్టీసీ మొత్తాలతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వరంగ సంస్థల ద్వారా రూ.19 వేల కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా రూ.9 వేల కోట్ల మేర డిమాండ్‌ ఏర్పడుతుందని అంచనా వేశారు. ఏడో వేతన సంఘం సిఫారసు మేరకు పండుగ అడ్వాన్సులు ఇవ్వడం మానేశామని, ప్రస్తుత పరిస్థితుల్లో దాన్ని పునరుద్ధరించామని చెప్పారు. రూ.10,000 వడ్డీలేని పండుగ అడ్వాన్సును కూడా మార్చి 31 లోగా వినియోగించుకోవాలన్నారు. దీన్ని పది వాయిదాల్లో తిరిగి చెల్లించాలని చెప్పారు. పండుగ అడ్వాన్సులకు రూ.4 వేల కోట్లు ఖర్చవుతుందని తెలిపారు. ఇందులో సగం మొత్తాన్ని రాష్ట్రాలు ఇచ్చినా మరో రూ.4000 కోట్లు ప్రభుత్వాల నుంచి ప్రజల్లోకి వెళతాయన్నారు. అడ్వాన్సు ముందే లోడ్‌ చేసిన రూపే కార్డుల రూపంలో ఉద్యోగులకు ఇస్తామని చెప్పారు. ఇందుకయ్యే బ్యాంకు చార్జీలను ప్రభుత్వాలే భరిస్తాయని ప్రకటించారు. దసరా అడ్వాన్సులతో రూ.8 వేల కోట్ల మేర వస్తువులకు డిమాండ్‌ ఏర్పడుతుందన్నారు. రోడ్లు, రక్షణ మౌలిక వసతులు, నీటి సరఫరా, పట్టణాభివృద్ధి ప్రాజెక్టులు, దేశీయ రక్షణ ఉత్పత్తుల కోసం రూ.25,000  కోట్లు వెచ్చిస్తామన్నారు. బడ్జెట్లో ప్రకటించిన 4.13 లక్షల కోట్ల మూలధన పెట్టుబడులకు ఇది అదనం. రాష్ట్రాలకు ఇచ్చే రూ.12 వేల కోట్లలో రూ.1600 కోట్లు ఈశాన్య రాష్ట్రాలకు, రూ.900 కోట్లు ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌లకు, రూ.7,500 కోట్లు ఇతర రాష్ట్రాలకు ఇస్తారు. మరో రూ.2000 కోట్లను.. ఒప్పందం ప్రకారం సంస్కరణలను అమలు చేస్తున్న రాష్ట్రాలకు ఇస్తారు. 


సమయానుగుణ నిర్ణయమిది

నిర్మల ప్రకటించిన ప్యాకేజీల పట్ల ప్రధాని మోదీ సంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘ఇది సమయానుగుణంగా తీసుకున్న నిర్ణయం. దీని వల్ల మూలధన వ్యయం పెరుగుతుంది. మన ఆర్థికానికి డిమాండ్‌ను పెంచుతుంది’’ అని ట్వీట్‌ చేశారు. నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు రాజీవ్‌కుమార్‌ కూడా ప్యాకేజీల పట్ల హర్షం వ్యక్తం చేశారు. ‘‘స్థూలంగా ఇది రూ.73 వేల కోట్ల ప్యాకేజీ. కరోనా కల్లోలంతో మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది’’ అన్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఎల్టీసీ కానుక"

Post a Comment