వచ్చే నెల 30 వరకు ‘అన్‌లాక్’ నిబంధనలు పొడిగింపు
- ఈనెలలోని నిబంధనలే నవంబరులోనూ వర్తింపు: కేంద్రం
న్యూఢిల్లీ, అక్టోబరు 27: సినిమా థియేటర్లు, మల్టీప్లెక్సులు వంటివి 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో తెరుచుకోవచ్చని ఇచ్చిన మార్గదర్శకాలను నవంబరు 30 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. లాక్‌డౌన్ ఆంక్షలను సడలిస్తూ థియేటర్లు,
మల్లీప్లెక్సులు, క్రీడాకారుల శిక్షణ కోసం వాడే స్విమ్మింగ్ పూల్స్, వ్యాపార సమావేశాల ప్రదేశాల వంటివి పలు నిబంధనలతో తెరుచుకోవచ్చంటూ సెప్టెంబరు 30న కేంద్ర సర్కారు మార్గదర్శకాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అవి అక్టోబరు 31 వరకు అమల్లో ఉంటాయని అప్పట్లో చెప్పింది. అక్టోబరులో అమల్లో ఉన్న మార్గదర్శకాలన్నీ నవంబరులోనూ కొనసాగుతాయని మంగళవారం తెలిపింది. కరోనా వ్యాప్తి తగ్గకపోవడంతో వాటిని పొడిగిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు కొనసాగుతాయి.
విద్యాలయాలు, కోచింగ్ సెంటర్లను తెరిచే అంశంపై కరోనా తీవ్రత పరిస్థితిని బట్టి రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవచ్చు
ఈనాడు,
దిల్లీ: కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 30వ తేదీన జారీ చేసిన అన్‌లాక్-5
మార్గదర్శకాలను నవంబర్ 30 వరకు పొడిగించింది. కంటెయిన్‌మెంట్ జోన్ల బయట
అన్నిరకాల కార్యకలాపాలకు అనుమతిస్తున్నట్లు పునరుద్ఘాటించింది. మార్చి 24వ
తేదీన తొలి లాక్‌డౌన్ ఉత్తర్వులు జారీ చేసినప్పటి పరిస్థితులతో పోలిస్తే
ప్రస్తుతానికి కంటెయిన్‌మెంట్ జోన్ల బయట దాదాపు అన్ని రకాల కార్యకలాపాలు
క్రమంగా పునఃప్రారంభమయ్యాయని కేంద్ర హోంశాఖ మంగళవారం జారీ చేసిన
ఉత్తర్వుల్లో పేర్కొంది. జనం గుమికూడటానికి సంబంధించిన కొన్ని
కార్యకలాపాలను మాత్రం కొన్ని నియంత్రణలు, ప్రామాణిక నిబంధనలతో
అనుమతిచ్చినట్లు గుర్తు చేసింది. అందువల్ల ఇప్పటికే మెట్రోరైళ్లు,
షాపింగ్‌మాళ్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, ఆతిథ్యసేవలు, మతకేంద్రాలు, యోగా,
శిక్షణ కేంద్రాలు, వ్యాయామశాలలు, సినిమాహాళ్లు, వినోదపార్కులు
తెరుచుకున్నట్లు పేర్కొంది. కొవిడ్ వైరస్ వ్యాప్తికి ఎక్కువ అవకాశం ఉన్న
కార్యకలాపాల పునఃప్రారంభంపై నిర్ణయం తీసుకొనే అధికారాన్ని రాష్ట్ర
ప్రభుత్వాలకే వదిలిపెట్టినట్లు తెలిపింది. ముఖ్యంగా పాఠశాలలు, కోచింగ్
సెంటర్లు, ప్రభుత్వ, ప్రైవేటు విశ్వవిద్యాలయాలు, 100 మందికి మించి జనం
గుమికూడటానికి సంబంధించిన కార్యకలాపాల అనుమతిపై రాష్ట్ర ప్రభుత్వాలకే
నిర్ణయాధికారం ఉంటుంది. సెప్టెంబర్ 30వ తేదీ నుంచి కేంద్ర హోంశాఖ అనుమతి
ఇచ్చిన అంతర్జాతీయ విమాన ప్రయాణాలు, ఈతకొలనులు (క్రీడాకారుల కోసం)
వ్యాపారుల కోసం ఎగ్జిబిషన్ హాళ్లు, 50% సీటింగ్ సామర్థ్యంతో
సినిమాహాళ్లు, సామాజిక, విద్య, క్రీడ, వినోద, సాంస్కృతిక, మత, రాజకీయ
సంబంధమైన సమావేశాలను నాలుగు గోడల మధ్య అయితే 50% సీట్లు లేదంటే గరిష్ఠంగా
200 మంది సామర్థ్యంతో నిర్వహించుకోడానికి అనుమతి ఇచ్చినట్లు గుర్తుచేసింది.
ప్రస్తుతానికి ఇవన్నీ నవంబర్ 30వ తేదీ వరకు కొనసాగుతాయి
0 Response to "వచ్చే నెల 30 వరకు ‘అన్‌లాక్’ నిబంధనలు పొడిగింపు"
Post a Comment