ఆదాయంపై ఉద్యోగుల్లో పెరిగిన విశ్వాసం ఆరు నెలల్లో పరిస్థితులు మెరుగవుతాయని ధీమా
దిల్లీ: భారత్‌లో ఉద్యోగుల ఆత్మవిశ్వాసం పెరిగినట్టు తెలిసింది. రాబోయే ఆరు నెలల్లో తమ ఆదాయం, ఖర్చులు పెరుగుతాయని ప్రతి నలుగురులో ఒకరు పేర్కొన్నారని లింక్‌డ్‌ఇన్ సర్వే వెల్లడించింది. దేశవ్యాప్తంగా 1351 మంది ఉద్యోగులు/ప్రొఫెషనల్స్‌ను జూన్-14 వరకు సర్వే చేయగా తమ వ్యక్తిగత ఆర్థికస్థితిపై చాలామంది ఆశాభావం వ్యక్తం చేశారు.
మే 4-17తో పోలిస్తే ఉద్యోగుల్లో ప్రస్తుతం భద్రతా భావం పెరిగింది. ఆదాయం, మిగులుపై సానుకూలంగా కనిపించారు. మే4-17 సర్వేలో 1646 మంది పాల్గొనగా 20% మంది తమ ఆదాయం పెరుగుతుందని అంచనా వేశారు. 27% మంది మిగులు, 23% మంది ఖర్చులు పెరుగుతాయని తెలిపారు. ఈ మధ్యే జరిపిన సర్వేలో ప్రతి నలుగురిలో ఒకరు రాబోయే ఆరు నెలల్లో ఆదాయం, వ్యక్తిగత ఖర్చులు పెరుగుతాయని అంచనా వేశారు. ముగ్గురిలో ఒకరు తమ వ్యక్తిగత మిగులు, వ్యక్తిగత రికరింగ్ అప్పుల చెల్లింపులు పెరుగుతాయని అన్నట్టు లింక్‌డ్‌ఇన్ ఉద్యోగుల ఆత్మవిశ్వాస సూచీలో తేలింది.
స్వల్పకాల యాజమాన్య ఆత్మవిశ్వాసం విషయానికి వస్తే 50% కార్పొరేట్ సేవలు, 46% తయారీ రంగ, 41% విద్యారంగ ప్రొఫెషనల్స్ తమ కంపెనీలు రాబోయే ఆరునెలల్లో మెరుగవుతాయని భావిస్తున్నారు. దీర్ఘకాల యాజమాన్య ఆత్మవిశ్వాసం ప్రకారం.. 64% తయారీరంగ, 60% కార్పొరేట్ సేవలు, 59% సాఫ్ట్‌వేర్, ఐటీ ప్రొఫెషనల్స్ ఏడాది కాలంలో తమ సంస్థలు మెరుగవుతాయని ధీమా వ్యక్తం చేశారు.
కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నా 38% జెన్ ఎక్స్ (40-54 వయసు), 29% బేబీ బూమర్స్ (55+ వయసు) అనుమతిస్తే కంపెనీలకు వచ్చి పనిచేయాలని భావిస్తున్నారు. జెన్ జెడ్ (25 కన్నా తక్కువ వయసు), మిలినియల్స్ (25-39 వయసు)లో ప్రతి ముగ్గురిలో ఒకరు ఇంటి నుంచే పనిచేయడం సురక్షితమని భావిస్తున్నారు. ప్రయాణం, భోజనం సమయంలో నిర్లక్ష్యంగా ఉండే కొందరితో ప్రమాదముందని 55% మంది అంటున్నారు
0 Response to " ఆదాయంపై ఉద్యోగుల్లో పెరిగిన విశ్వాసం ఆరు నెలల్లో పరిస్థితులు మెరుగవుతాయని ధీమా"
Post a Comment