మళ్లీ.. ‘లాక్‌డౌన్‌

నేటినుంచి ఒంగోలు, అనంతల్లో లాక్‌డౌన్‌ 

పట్టణాలు మూసేస్తున్న కలెక్టర్లు.. విజయవాడలో 47 డివిజన్లు లాక్‌


(అమరావతి-ఆంధ్రజ్యోతి): కరోనా స్వైరవిహారం చేస్తోంది. రాష్ట్రంలో రోజుకు 10, 20 కేసులు వచ్చేస్థాయి నుంచి ఇప్పుడు 500 వరకూ నమోదయ్యే పరిస్థితికి చేరింది. పాజిటివ్‌ కేసులతో పాటు పెరుగుతున్న మరణాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో జిల్లాల్లో కలెక్టర్లు లాక్‌డౌన్‌ అనకుండానే కట్టడి ప్రాంతాల పేరుతో పట్టణాలు మూసివేస్తున్నారు. ఇప్పటికే విజయవాడలో 47వార్డులు కట్టడిలోకి వెళ్లిపోయాయి. జిల్లాల్లోనూ అనధికార లాక్‌డౌన్‌ అమలవుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారిని చూసీచూడనట్లుగా వదిలేయడంతో పరిస్థితి చేయిదాటిపోతోంది. ఇలాంటి వారంతా, స్పందన వెబ్‌సైట్‌లో కచ్చితంగా నమోదు చేసుకోవాలి. ఈ-పాస్‌ ఉన్నవారినే రాష్ట్రంలోకి అనుమతిస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ నుంచి వచ్చినవారిలో ఎక్కువమందికి పాజిటివ్‌లు వస్తున్నాయి. 


ఒంగోలులో ఆదివారం నుంచి 14రోజుల పాటు లాక్‌డౌన్‌ అమలుకు కలెక్టర్‌ పోలా భాస్కర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. చీరాలలో 17నుంచే లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారు. ఉదయం 6 నుంచి 9వరకు నిత్యావసర, అత్యవసరాలకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. మిగతా సమయంలో అన్నీ బంద్‌ చేయనున్నారు. ఆర్టీసీ బస్సులు నగరంలోకి రాకుండా శివారుల్లోనే నిలిపివేసే ఏర్పాటు చేశారు. కాగా, అనంతపురం జిల్లాలో వైరస్‌ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో కేసులు నమోదైన ప్రాంతాల్లో ఆదివారం నుంచి లాక్‌డౌన్‌ అమలు చేయనున్నారు. ఉదయం 6నుంచి 11 గంటల వరకు సడలింపులిచ్చారు. ఆ తరువాత పూర్తిస్థాయిలో ఆంక్షలు అమలు చేయనున్నట్లు కలెక్టర్‌ గంధం చంద్రుడు, ఎస్పీ సత్యయేసుబాబు ప్రకటించారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

Related Posts :

0 Response to "మళ్లీ.. ‘లాక్‌డౌన్‌"

Post a Comment