మన పిల్లల భవిష్యత్ కోసం నేను పెడుతున్న పెట్టుబడి ఇది: జగన్
అమరావతి : ‘విద్యారంగంపై ఇంత ఖర్చు ఎందుకు పెడుతున్నారని అడుగుతున్నారు..? మన పిల్లల భవిష్యత్ కోసం నేను పెడుతున్న పెట్టుబడి ఇది’ అని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. పేద విద్యార్థుల కోసం ‘జగనన్న గోరుముద్ద’ పథకం ప్రారంభించామని సీఎం స్పష్టం చేశారు.
తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో విద్యారంగంపై సీఎం జగన్ మేధోమథన సదస్సు నిర్వహించారు. ‘మన పాలన- మీ సూచన’ పేరుతో మేధోమథన సదస్సు జరుగుతోంది. ఏడాదిలో విద్యాశాఖలో చేసిన కార్యక్రమాల తీరు, భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు.
చదువే వారికి ఆస్తి..
ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఇంగ్లీషు మీడియం వద్దని చెప్పేవారు.. వాళ్ల పిల్లలను ఎక్కడికి పంపిస్తున్నారు? అని ప్రశ్నించారు. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం ప్రకారం విద్యాబోధన ఉండాలన్నారు. ‘పేదవాళ్లు తమ కాళ్లపై తాము నిలబడాలంటే చదువే ఆస్తి. పేద విద్యార్థులు కూడా ఉన్నత చదువులు చదవాలి. ఇంటర్ తర్వాత ఉన్నత విద్య చదివేవారి సంఖ్య పెరగాలి. చాలా మంది తమ పిల్లలను చదివించే స్థోమత లేక మధ్యలోనే ఆపించేస్తున్నారు.
విద్యారంగంలో మార్పుల్లో భాగంగా ఇంగ్లిష్ మీడియం తీసుకొచ్చాం. ఇంగ్లిష్ మీడియం బిల్లులను ప్రతిపక్షాలు ఆలస్యం చేయగలిగారు కానీ.. ఆపలేకపోయారు. ఇంగ్లిష్ మీడియంను తీసుకొస్తే తెలుగును అగౌరవపరిచినట్లు అని ప్రతిపక్ష నేతలు అంటున్నారు. ఇంగ్లిష్ మీడియంను తీసుకురావాలని ఉక్కు సంకల్పంతో అడుగులు వేశాం. ఇంగ్లిష్ మీడియం కావాలని 40 లక్షల మంది పిల్లల తల్లిదండ్రుల అభిప్రాయాలు తీసుకున్నాం’ అని సీఎం జగన్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు

0 Response to "మన పిల్లల భవిష్యత్ కోసం నేను పెడుతున్న పెట్టుబడి ఇది: జగన్"
Post a Comment