పన్ను చెల్లింపుదారులకు ఇ-మెయిళ్లు పంపించిన ఆదాయపు పన్ను శాఖ
దిల్లీ: పన్ను
బాకీ ఉన్న వ్యక్తులతోపాటు అంకుర సంస్థలు, కంపెనీలకు కలిసి మొత్తం 1.72
లక్షల మందికి ఇ-మెయిళ్లను జారీ చేసినట్లు ఆదాయపు పన్ను శాఖ తెలిపింది.
ఇందులో పన్ను బాకీ ఉన్నవారితోపాటు, రిఫండు కోరిన వారు తమ వివరాలను మరోసారి
ధ్రువీకరించాలని సూచించినట్లు మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో
తెలిపింది. కొవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ప్రజలకు నగదును అందుబాటులోకి
తెచ్చేందుకు ఆదాయపు పన్ను రిఫండు క్లెయింలను వేగంగా
పరిష్కరిస్తామని ఏప్రిల్ 8న కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ప్రకటించింది.
ఇప్పటికే రూ.9,000 కోట్ల విలువైన 14 లక్షల రిఫండ్ క్లెయింలను
పరిష్కరించినట్లు తెలిపింది. పన్ను బాకీ ఉన్నవారికి మరో అవకాశాన్ని
ఇవ్వడంతోపాటు, దాని తాజా పరిస్థితిని తెలుసుకోవడం కోసమే వీటిని పంపించామని
పేర్కొంది. అసెసీలు పన్ను బాకీ ఉంటే.. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 245
ప్రకారం ఇవి వస్తాయని తెలిపింది. ఇందులో ఉన్నట్లు పేర్కొన్న పన్నును
ఇప్పటికే చెల్లించారా? లేదా దానిపై ఏదైనా ఫిర్యాదు నమోదు చేశారా? అనే తాజా
సమాచారాన్ని తెలియజేస్తే సరిపోతుందని చెప్పింది. రిఫండు కోరిన వారు ఇచ్చిన
సమాధానాన్ని బట్టే అడిగిన మొత్తాన్ని చెల్లించాలా? లేక పన్ను బాకీని
మి
మినహాయించుకోవాలాన్నది నిర్ణయిస్తామని సీబీడీటీ పేర్కొంది. కొన్ని
సామాజిక వేదికల్లో వస్తున్నట్లు ఇవన్నీ పన్ను డిమాండు నోటీసులు లేదా బాకీని
రిఫండు నుంచి సర్దుబాటు చేయడంలాంటివి కాదని.. కేవలం పన్ను చెల్లింపుదారుల
నుంచి సరైన సమాచారాన్ని తీసుకోవడం మాత్రమేనని తెలిపింది. సమాధానాలు
పంపించిన వారికి సాధ్యమైనంత తొందరగా రిఫండునిచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు
పేర్కొంది
0 Response to " పన్ను చెల్లింపుదారులకు ఇ-మెయిళ్లు పంపించిన ఆదాయపు పన్ను శాఖ"
Post a Comment