జిల్లాకు మరో జేసీ
రాష్ట్ర పాలనా యంత్రాంగంలో మార్పులు
ఇకపై జిల్లాకు ముగ్గురు జాయింట్ కలెక్టర్లు
నేడో, రేపో ఉత్తర్వులు
గ్రామ, వార్డు సచివాలయాలతో పాటు పలు సంక్షేమ పథకాల పర్యవేక్షణ బాధ్యత కొత్త జేసీకి
సీనియర్ టైమ్ స్కేలు ఉన్న ఐఏఎస్ అధికారి నియామకం
ముగ్గురికీ పని విభజనలో సర్కారు స్పష్టత
మొత్తంగా జిల్లా కలెక్టర్‌కు వీరు పాలనలో సహకారం అందిస్తారు
మరింత జవాబుదారీతనం, అవినీతి రహిత పాలన..
ప్రభుత్వ సేవలు సమర్ధవంతంగా, సజావుగా అందించాలన్నదే లక్ష్యం
అమరావతి: పాలనా
వ్యవస్థలో మరింత జవాబుదారీతనం తీసుకురావడానికి.. అవినీతి రహితంగా పాలన
సాగించడానికి.. సమాజంలోని అన్ని వర్గాలకు సమర్థవంతంగా సంక్షేమ ఫలాలు
అందించడానికి జిల్లా యంత్రాంగంలో మార్పులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం
నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ప్రస్తుతం జిల్లాల్లో ఇద్దరేసి
జాయింట్ కలెక్టర్లు ఉన్నారు. తాజాగా ఇప్పుడు మరో జాయింట్ కలెక్టర్
పోస్టును ప్రభుత్వం సృష్టించనుంది. ఈ పోస్టులో సీనియర్ టైమ్ స్కేలు ఉన్న
ఐఏఎస్ అధికారిని నియమించనున్నారు. ఈ మేరకు నేడో, రేపో ఉత్తర్వులు
వెలువడనున్నాయి.
గ్రామ, వార్డు సచివాలయాల పర్యవేక్షణతో పాటు పలు సంక్షేమ పథకాల అమలు
బాధ్యతను కొత్తగా నియమితులు కానున్న జేసీకి అప్పగించనున్నారు. సంక్షేమ
పథకాలు, ప్రభుత్వ సేవలను ప్రజల ముంగిటకు చేర్చడంలో గ్రామ, వార్డు
సచివాలయాలు కీలకంగా పనిచేస్తున్న విషయం విదితమే. కొత్తగా జాయింట్
కలెక్టర్ పోస్టు ఏర్పాటుచేస్తుండడంతో.. ఇక నుంచి ప్రతి జిల్లాలో మొత్తం
ముగ్గురు జాయింట్ కలెక్టర్లు ఉంటారు. పని విభజన విషయంలో ముగ్గురు జేసీలకు
ప్రభుత్వం మరింత స్పష్టత ఇవ్వనుంది. ఏ జాయింట్ కలెక్టర్ ఏ పథకాలను
పర్యవేక్షించాలో, ఏఏ విభాగాలను చూడాలనే విషయంలో ఉన్నతాధికారులు విస్పష్టంగా
జాబితా రూపొందించారు. చివరి వ్యక్తికి కూడా ప్రభుత్వ సేవలు.. సంక్షేమ
ఫలాలు సమర్థవంతంగా, సజావుగా అందించాలన్నదే ఈ మార్పు లక్ష్యమని సమాచారం. ఈ
ముగ్గురు జేసీలు జిల్లా కలెక్టర్‌కు పాలనలో సహకారం అందిస్తారు.
ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో సీనియర్ టైమ్ స్కేలులో ఐఏఎస్ అధికారులు పెద్ద
సంఖ్యలో ఉన్నారు. కలెక్టర్లుగా బాధ్యత స్వీకరించే ముందే వారికి
క్షేత్రస్థాయిలో పాలన అనుభవం అవసరం అని ప్రభుత్వం భావిస్తోంది. స్టేట్
సివిల్ సర్వీసు (ఎస్‌సీఎస్) అధికారులకు, నాన్–ఎస్‌సీఎస్ అధికారులకూ
ఐఏఎస్‌లుగా పదోన్నతి పొందడానికి ముందు క్షేత్రస్థాయిలో విశేష అనుభవం అవసరం.
దీనిని దృష్టిలో పెట్టుకొని జిల్లా స్థాయి పాలనా వ్యవస్థలో మార్పులు
చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది
0 Response to "జిల్లాకు మరో జేసీ"
Post a Comment