ఎక్కడివాళ్లు అక్కడే ఉండండి: జగన్
అమరావతి:
కరోనా లాంటి వ్యాధులు వందేళ్లకు ఒకసారి వస్తాయో రావో తెలియదని.. ఇలాంటి
పరిస్థితులు వచ్చినప్పుడు సమర్థంగా ఎదుర్కోలేకపోతే చాలా కష్టంగా ఉంటుందని
ఏపీ సీఎం జగన్
అన్నారు. ఇలాంటి వ్యాధులను మనం చూస్తామని కూడా అనుకోలేదని చెప్పారు. ఈ
పరిస్థితుల్లో సరైన నిర్ణయాలు తీసుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని
అభిప్రాయపడ్డారు. తాడేపల్లి క్యాంపు
కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం మాట్లాడారు. కరోనాలాంటి వ్యాధిపై క్రమశిక్షణతోనే గెలవగలమని.. లాక్‌డౌన్‌కు ప్రజలంతా సహకరించాలని కోరారు. కొన్ని నిర్ణయాలు చాలా
కఠినంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. బుధవారం రాత్రి జరిగిన కొన్ని ఘటనలు తన మనసును కలచివేశాయని చెప్పారు. తెలంగాణ సరిహద్దు నుంచి మన వాళ్లు ఏపీలోకి రావడానికి
ప్రయత్నించారని.. అయితే ప్రస్తుతం చిరునవ్వుతో వారిని ఆహ్వానించే పరిస్థితి లేదన్నారు. ఎక్కడి వాళ్లు అక్కడికే పరిమితం కాకపోతే ఈ వ్యాధిని కట్టడి చేయలేమని స్పష్టం చేశారు. ఈ పరిస్థితుల్లో ఒకసారి ప్రదేశం మారితే వచ్చే ఇబ్బందేంటో ఆలోచించాలన్నారు.
తప్పనిసరి పరిస్థితుల్లో వారిని క్వారంటైన్ చేశాం
ఏపీ-తెలంగాణ సరిహద్దుకు వద్దకు వచ్చిన సుమారు 200 మందిని కాదనలేక రాష్ట్రంలోని అనుమతించామని.. వారందర్నీ క్వారంటైన్‌లో ఉంచామని సీఎం చెప్పారు. ‘‘అనుమతించిన అందరినీ తీసుకుని ఇళ్లకు పంపిచేలా చేయలేం.. వాళ్లు ఎక్కడి నుంచి వచ్చారో.. ఎవరితో సన్నిహితంగా ఉన్నారో తెలియదు. వాళ్లలో ఇప్పటికే ఏ ఒక్కరికి ఉన్నా అది మరో పది మందికి సోకే అవకాశముంటుంది. అందుకే తప్పనిపరిస్థితుల్లో క్వారంటైన్ చేస్తున్నాం. ఒకవేళ వచ్చి ఏకంగా వాళ్ల ఊళ్లకు వెళితే వారితో పాటు కుటుంబసభ్యులకూ ప్రమాదకరం. దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి’’ అని జగన్ వివరించారు. మూడు వారాల పాటు ఎక్కడివాళ్లు అక్కడ ఉంటేనే కరోనాను కట్టడి చేసే పరిస్థితి ఉంటుందన్నారు. ఏప్రిల్ 14 వరకు (సుమారు మరో మూడువారాలు) ఎక్కడికీ కదలొద్దని సూచించారు.
ఏమైనా సమస్యలుంటే 1902కి కాల్‌చేయండి
‘‘ఏప్రిల్ 14 వరకు మనం కాస్త ఎక్కడికి తిరగకుండా ఎక్కడివాళ్లం అక్కడే ఉండిపోగలిగితే వైరస్ సోకే ప్రమాదం తగ్గుతుంది. ఎక్కడైనా గుర్తించినా చికిత్స అందించడం సులువు అవుతుంది. అదే జరగకపోతే ఎప్పటికీ సమసిపోని సమస్యగా మారుతుంది. ఈ మూడు వారాలు ఇతర రాష్ట్రాల నుంచి కానీ.. మన రాష్ట్రంలోనే ఇతర జిల్లాల నుంచి.. గ్రామాల నుంచి మరో గ్రామానికి వెళ్లొద్దు. వేరే చోటికి వెళ్తే వివరాలు కనుక్కోవడం కష్టమవుతుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఎక్కడి వాళ్లు అక్కడే ఉండాలని చెప్పింది. ఏమైనా సమస్యలు ఉంటే 1902 కాల్‌సెంటర్‌కు కాల్ చేయండి. ఆరోగ్య సమస్యలపై 104కు ఫోన్ చేసి సహాయం పొందవచ్చు’’ అని సీఎం వివరించారు.
నాలుగుచోట్ల క్రిటికల్ కేర్ యూనిట్లు
‘‘గ్రామ వాలంటీర్లు, సచివాలయాల సిబ్బంది, ఆశా వర్కర్లకు మనస్ఫూర్తిగా హ్యాట్సాప్ చెప్తున్నా. వాళ్లు చేస్తున్న పనులు చాలా గొప్పవి. ప్రజలంతా స్వీయ క్రమశిక్షణ, సామాజిక దూరం పాటించకపోతే అందరమూ ఇబ్బంది పడతాం. ఈ సమస్యను ఎదుర్కోవడానికి విశాఖ, తిరుపతి, విజయవాడ, నెల్లూరులో క్రిటికల్ కేర్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కరోనా కోసం ప్రత్యేకంగా 475 ఐసీయూ బెడ్లు ఏర్పాటు చేశాం. ప్రతి జిల్లా కేంద్రంలో ఇప్పటికే 200 క్వారంటైన్ బెడ్లు ఏర్పాటు చేశాం. ప్రతి నియోజకవర్గంలో క్వారంటైన్ కోసం 100 పడకలు సిద్ధం చేశాం. ఈ మూడు వారాల పాటు ప్రజలు ఇళ్లలో ఉండకపోతే ప్రభుత్వం ఎన్ని చేసినా లాభం ఉండదు. దయచేసి ఎక్కడి వాళ్లు అక్కడే ఉండాలి. ప్రభుత్వం తరఫున చేయాల్సిందంతా చేస్తాం. పోలీసులు, వైద్యులు, నర్సులు, గ్రామ వాలంటీర్లు, వైద్య సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, విద్యుత్ శాఖ సిబ్బంది అన్నీ పణంగాపెట్టి చేతనైన విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఎవరూ తీసుకోని రిస్క్ వాళ్లు తీసుకుని చేయగలిగిన మంచి చేస్తున్నారు. వాళ్లందరికీ కృతజ్ఞతలు’’ అని జగన్ అన్నారు
0 Response to " ఎక్కడివాళ్లు అక్కడే ఉండండి: జగన్ "
Post a Comment