50 శాతం రిజర్వేషన్లపై ఉత్తర్వులు జారీ
అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలతో 50 శాతానికి లోబడి రిజర్వేషన్లు ఖరారు చేయాలని అధికారులను ఆదేశించింది. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి ఈ మేరకు కలెకర్లకు ఆదేశాలు జారీ చేసింది. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల రిజర్వేషన్లు 50 శాతం లోపే ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రమేశ్ కుమార్‌ను డీజీపీ గౌతమ్ సవాంగ్, పంచాయతీరాజ్, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శులు వేర్వేరుగా కలిశారు. 50 శాతం రిజర్వేషన్లకు లోబడి ప్రక్రియ పూర్తి చేసి రేపు లేదా ఎల్లుండిలోపు నివేదికలు అందజేస్తామని ఎన్నికల కమిషనర్ తెలిపారు. రిజర్వేషన్ల అంశంపై ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లు కసరత్తు ప్రారంభించారు. 50 శాతంలోపు రిజర్వేషన్లు ఖరారుపై కింది స్థాయి సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు.
సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని ఇటీవల హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. స్థానిక ఎన్నికల్లో 59.85 శాతం రిజర్వేషన్లు ఖరారు చేస్తూ గతంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై రామాంజనేయులు, బిర్రు ప్రతాపరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన హైకోర్టు.. ఆ రిజర్వేషన్లు సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమంటూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. 50 శాతానికి లోబడే ఎన్నికలు పూర్తి చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు 50 శాతం రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సన్నద్ధమైంది.
0 Response to "50 శాతం రిజర్వేషన్లపై ఉత్తర్వులు జారీ"
Post a Comment