పెరగనున్న ఏసీల ధరలు

దిల్లీ: ఈ వేసవిలో చల్లదనం కోసం ఏసీలు కొనాలనుకునేవారికి షాక్‌. ఈ సారి ఏసీల ధరలు పెరగనున్నాయి. కరోనా వైరస్‌ ప్రభావంతో విడి భాగాల దిగుమతి భారం కానుండడం.. బడ్జెట్‌లో వాటిపై కస్టమ్స్‌ డ్యూటీ పెంచడం ఇందుక్కారణం. దీంతో దాదాపు 5 శాతం మేర ఏసీల ధరలు పెంచాలని ఆయా కంపెనీలు నిర్ణయించాయి.



ఏసీల తయారీకి కావాల్సిన కంట్రోలర్స్‌, కంప్రెషర్స్‌, ఇతర విడిభాగాలు చైనా, థాయ్‌ల్యాండ్‌, మలేసియా నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. కరోనా వైరస్‌ ప్రభావంతో ఈసారి వాటిని విమానాల్లో తరలించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో తయారీ వ్యయం పెరగనుంది. కరోనా వైరస్‌ కారణంగా విడి భాగాల కొరత ఏర్పడిందని, ఉత్పత్తి నిలిచిపోకుండా ఉండాలంటే వాటిని చైనా నుంచి విమానాల్లో తరలించడం తప్పదని బ్లూస్టార్‌ ఎండీ త్యాగరాజన్‌ పేర్కొన్నారు. దీని వల్ల లాజిస్టిక్స్‌ వ్యయం పెరుగుతోందని, దీనికి తోడు కంప్రెషర్లు ఇతర విడి భాగాలపై కస్టమ్స్‌ డ్యూటీ పెంచడంతో ధరలు పెంచాల్సి వస్తోందన్నారు. ఇప్పటికే ఆ కంపెనీ వివిధ ఉత్పత్తులపై 3 నుంచి 5 శాత ధరలు పెంచింది.

భారత కంపెనీలు కేవలం కంప్రెషర్ల మాత్రమే కాక ఇతర విడిభాగాలపైనా చైనాపై ఆధారపడుతున్నాయని, ప్రస్తుత పరిస్థితుల్లో 3 నుంచి 5 శాతం తక్షణమే ధరలు పెరుగుతాయని అంచనా వేస్తున్నట్లు డైకిన్‌ ఇండియా ఎండీ కేజే జావా పేర్కొన్నారు. పరిస్థితులు అదుపులోకి రాకుంటే మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. డైకిన్‌ ఉత్పత్తులపై పెరిగిన ధరలు మార్చి నుంచే అమల్లోకి రానున్నాయని తెలిపారు. ధరల పెరుగుదల ఉంటుందని వోల్టాస్‌, గోద్రెజ్‌ కూడా ప్రకటించాయి. రిఫ్రిజిరేటర్లు, ఏసీల్లో వాడే కంప్రెషర్లపై 10 శాతంగా ఉన్న కస్టమ్స్‌ డ్యూటీని 12.5 శాతానికి పెంచుతూ ఇటీవల బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "పెరగనున్న ఏసీల ధరలు"

Post a Comment