ఓటరు ఐడీ కార్డులతో ఆధార్ అనుసంధానం!
- ఇతర గుర్తింపు కార్డులతోనూ ఓటింగ్ సౌలభ్యం?
- వచ్చే సార్వత్రికం నాటికి అమలు?.. న్యాయశాఖ పరిశీలన
న్యూఢిల్లీ, ఫిబ్రవరి18(ఆంధ్రజ్యోతి): ఓటరు గుర్తింపు కార్డులకు ఆధార్ కార్డులను అనుసంధానం చేయాలని ఎలక్షన్ కమిషన్ నిర్ణయించింది. దీని వల్ల బినామీ, నకిలీ ఓటర్లను నిషేధించవచ్చని - ఢిల్లీలో రెండ్రోజుల పాటు ఎన్నికల సంస్కరణలపై జరిగిన జాతీయ వర్క్‌షాపు అభిప్రాయపడింది. ఇప్పటికే ఓటర్లుగా నమోదైన వారు, కొత్త ఓటర్ల ఐడీలకు ఆధార్‌ను అనుసంధానించేందుకు అనుమతివ్వాలని, ఇందుకు ప్రజాప్రాతినిథ్య చట్టంలో సవరణలు చేయాలని ఈసీ ... ఇప్పటికే న్యాయశాఖను కోరింది. న్యాయశాఖ కూడా ఇందుకు సమ్మతిస్తూ ఆధార్ డేటా చాలా కీలకమని, దానిని జాగ్రత్తగా వివిధ స్థాయుల్లో పరిరక్షించాలని, ఏ వివరమూ లీక్ కాకూడదని హెచ్చరించింది. దీనికి కూడా సరేనన్న ఈసీ- ఆధార్ డేటా పరిరక్షణకు తాము చేపట్టబోయే చర్యలను విశదీకరిస్తూ లేఖ పంపినట్లు తెలుస్తోంది. అలాగే ఓటర్లు తమ ఓటుహక్కును సునాయసంగా వినియోగించుకునేందుకు వీలుగా వారు ఓటరు గుర్తింపుకార్డు అందుబాటులో లేకున్నా ఓటరు ఫోటో ఉన్న పలు ఇతర గుర్తింపు కార్డులు, డాక్యుమెంట్లకు అవకాశం కల్పించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు.
దీంతో పాటు.. 80ఏళ్ల పైబడిన వయోవృద్ధులు తమ ఇళ్ల వద్దనుంచే పోస్టల్ బ్యాలెట్ పద్ధతిలో ఓటుహక్కును వినియోగించుకునే విధానానికి ఆమోదం లభించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పెయిడ్ న్యూస్ ప్రచురణలతోపాటు తప్పుడు అఫిడవిట్లపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కూడా నిశ్చయించారు. ఈ వర్కుషాపులో ఆమోదించిన సంస్కరణ ప్రతిపాదనలన్నీ న్యాయశాఖలోని శాసనవిభాగం పరిశీలనకోసం పంపనున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి ఈ నూతన సంస్కరణలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా పట్టుదలగా ఉన్నట్లు సమాచారం. ఇన్‌ఛార్జి సీఈవో రవికిరణ్ ఈ వర్క్‌షాపులో పాల్గొన్నారు.
ఈసీ ప్రతిపాదిస్తున్న సంస్కరణలు
ఓటర్ ఐడీతో ఆధార్ అనుసంధానం, ఓటరుగా నమోదుకు జనవరి 1 వరకు మాత్రమే అవకాశం ఉంది. దీన్ని సంవత్సరంలో పలు పర్యాయాలు వినియోగించుకునే వీలు, మహిళలు, పురుషులన్న తేడా లేకుండా ఎన్నికల నిబంధనలు సైనిక దళాల్లో పనిచేస్తున్నవారికి సమానంగా వర్తింపు, తప్పుడు డిక్లరేషన్‌లు సమర్పిస్తే అనర్హత వేటు తప్పదు, 6 నెలల జైలు శిక్ష కూడా!, పరిషత్ ఎన్నికల్లో అభ్యర్థుల వ్యయానికి పరిమితి విధింపు, ఎన్నికల సమయంలో లంచం ఇవ్వచూపడం నేరం. వారెంట్ లేకుండా అరెస్ట్ చేయవచ్చు.
0 Response to "ఓటరు ఐడీ కార్డులతో ఆధార్ అనుసంధానం!"
Post a Comment