ఇంటర్మీడియట్ పరీక్షల్లో మార్పులు
- నిర్వహణకు ముమ్ముర ఏర్పాట్లు
- వెబ్‌సైట్ హాల్‌టిక్కెట్‌తో నేరుగా పరీక్షకు వెళ్లే అవకాశం
- జిల్లాలో హాజరు కానున్న 1.5 లక్షల మంది విద్యార్థులు
జిల్లాలో మార్చి 4వ తేదీ నుంచి ప్రారంభమై 18వ తేదీ వరకూ నిర్వహించనున్న ఇంటర్మీడియట్, ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్షలకు సంబంధించిన ఒఎంఆర్ షీట్స్, ఇతర మెటీరియల్ జిల్లా కేంద్రానికి చేరింది. పరీక్షలకు మరో పది రోజులే ఉంది. ఇప్పటికే ప్రాక్టికల్ పరీక్షలు ముగిశాయి.
ప్రజాశక్తి-గుంటూరు
ఈసారి పరీక్షల నిర్వహణలో పలు మార్పులొచ్చాయి. పరీక్షలను పారదర్శకంగా నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆర్‌ఐఒ జెడ్‌ఎస్ రామచంద్రరావు తెలిపారు. ఈసారి ప్రతి పరీక్షా కేంద్రంలో తప్పనిసరిగా సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలందాయి. ఆయా కెమెరాలను ఆన్‌లైన్‌కు అనుసంధానం చేసి, ఇంటర్ బోర్డు సెక్రెటరీతోపాటు, జిల్లా స్థాయి అధికారులూ వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యార్థుల హాల్ టిక్కెట్లను ఇంటర్ బోర్డు వెబ్‌సైట్‌లో ఉంచారు. విద్యార్థులు ఆన్‌లైన్‌లో నుంచి హాల్ టిక్కెట్ డౌన్‌లోడ్ చేసుకొని, దాంతో నేరుగా పరీక్షకు రావచ్చని అధికారులు ప్రకటించారు. గతంలో డౌన్‌లోడ్ చేసుకున్న హాల్ టిక్కెట్లకు ప్రిన్సిపాల్స్ ధ్రువీకరణ తప్పనిసరిగా ఉండాలి. ప్రస్తుత మార్పుతో ఫీజులు చెల్లించలేదని, ఇతర అనేక కారణాలతో యాజమాన్యాలు హాల్ టిక్కెట్లు మంజూరు చేయకుండా నిలుపుదల చేయటానికి అవకాశం లేదని అధికారులు తెలిపారు.
ఇన్విజిలేటర్లను జంబ్లింగ్ విధానంలో కేటాయిస్తున్నారు. అంటే ఒక కాలేజికి చెందిన ప్రిన్సిపాల్స్ గానీ, ఇన్విజిలేటర్లుగానీ, ఇతర సిబ్బంది సహా అదే కాలేజిలో విధులు నిర్వహించటానికి అవకాశం లేకుండా జంబ్లింగ్ విధానంలో మరో కాలేజికి కేటాయిస్తున్నారు. ప్రతి పరీక్షా కేంద్రంలో ప్రతిరోజూ విద్యార్థులకు కేటాయించిన గది నంబరు, సీటు వివరాలు విద్యార్థులకు వారి రిజిస్టర్డ్ మొబైల్‌కు సంక్షిప్త సందేశాన్ని పంపుతారు. దీంతో పరీక్షా కేంద్రం వద్ద గదులు, సీట్లు వెతుక్కునే పని ఉండదు. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ పరీక్ష జరుగుతుంది. పరీక్ష హాల్లోకి అరగంట ముందుగానే అనుమతిస్తారు. నిర్ధేశించిన సమయం దాటి ఒక్క నిముషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించరు.
కట్టుదిట్టమైన ఏర్పాట్లు
ఆర్‌ఐఒ జెడ్‌ఎస్ రామచంద్రరావు
ఇంటర్ పరీక్షలకు జిల్లాలో ఎలాంటి తప్పులూ దొర్లకుండా చర్యలు తీసుకుంటున్నాం. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో రెవెన్యూ, విద్యుత్, ఆర్‌టిసి, వైద్య ఆరోగ్యశాఖ, తదితర లైన్ డిపార్ట్‌మెంట్లతో కో-ఆర్డినేషన్ సమావేశం జరిగింది. పరీక్షల నిర్వహణపై ఆయా శాఖల అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో నాలుగు ఫ్లైయింగ్ స్క్వాడ్స్, 5 సిట్టింగ్ స్వ్కాడ్స్ ఏర్పాటు చేశాం. మరో ఐదు సిట్టింగ్ స్వ్కాడ్స్ ఏర్పాటుకు అనుమతి కోరుతూ ఉన్నతాధికారులకు నివేదిక పంపించాం. ప్రాక్టికల్స్ పరీక్షల్లో మాదిరిగా థియరీ పరీక్షల్లోనూ టాస్క్‌ఫోర్స్ బృందం బోర్డు సెక్రెటరీ సూచనలతో నేరుగా పరీక్షా కేంద్రాల్లోకి వెళ్లి తనిఖీ చేస్తుంది. పరీక్షా కేంద్రాల్లో అవసరమైన బల్లలు, తాగునీరు, విద్యుత్ సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నాం. విద్యార్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలను చూసుకొని రావాలి
0 Response to "ఇంటర్మీడియట్ పరీక్షల్లో మార్పులు"
Post a Comment