అబ్దుల్ కలాంపై బయోపిక్
కలాం పాత్రలో అలీ
జగదీశ్ దర్శకత్వం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం బయోపిక్
తెరకెక్కబోతోంది. కలాం పాత్రలో హాస్య నటుడు అలీ నటిస్తున్నారు. హాలీవుడ్ దర్శకుడు జానీ మార్టిన్ సారథ్యంలోని మార్టినీ ఫిల్మ్స్, మరో ప్రముఖ హాలీవుడ్ సినీ నిర్మాణ సంస్థ పింక్ జాగ్వార్ ఎంటర్‌టైన్‌మెంట్ కలిసి ఈ చిత్రం నిర్మిస్తున్నాయి. జగదీశ్ దానేటి దర్శకత్వం వహిస్తున్నారు. జానీ మార్టిన్ ప్రఖ్యాత హాలీవుడ్ చిత్రం ‘టైటానిక్’కు అసిస్టెంట్ కోఆర్డినేటర్‌గా పనిచేశారు. ఆదివారం ఢిల్లీలో ఈ చిత్రం పోస్టర్‌ను కేంద్ర సమాచార ప్రసార మంత్రి ప్రకాశ్ జావడేకర్ ఆవిష్కరించారు. సినిమా పేరు... ‘ఏపీజే అబ్దుల్ కలాం: ది మిస్సైల్ మేన్’. ‘‘ప్రజల రాష్ట్రపతి’గా పేరొందిన అబ్దుల్ కలాం.. శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం. ఆయన నిరాడంబర జీవితం గడిపిన మహామేధావి’’ అని జావడేకర్ ఈ సందర్భంగా కొనియాడారు.
కలాం బయోపిక్ విశేషాలను మంత్రికి జగదీశ్, మార్టిన్‌లు వివరించారు. 14 భాషల్లో నిర్మిస్తున్న బయోపిక్‌లో కలాం పాత్రను పోషించే అవకాశం రావడం తన అదృష్టమని, పట్టలేనంత ఆనందంగా ఉందని అలీ తెలిపారు. ‘నేను కలాంకు గత 47 ఏళ్లుగా పెద్ద అభిమానిని. ఆయన పాత్ర పోషించడం నాకో చాలెంజ్’ అని అన్నారు. రాష్ట్రపతిగా పదవీ కాలం పూర్తయిన సందర్భంలో ఆయనకు వచ్చిన బహుమతులను అధికారులు అప్పగించబోగా, అవన్నీ ప్రభుత్వ ఆస్తేనంటూ తీసుకునేందుకు నిరాకరించిన గొప్ప వ్యక్తి కలాం అన్నారు. మార్చి నుంచి షూటింగ్ మొదలవుతుందని తెలిపారు. కార్యక్రమంలో పింక్ జాగ్వార్ సంస్థ ఎండీ సువర్ణ, సిద్ధారెడ్డి, రామచంద్రరావు పాల్గొన్నారు.
100 కోట్ల డాలర్లతో ఐదు సినిమాలు
కలాం బయోపిక్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఫొటోను ట్విటర్‌లో జావడేకర్ పోస్టు చేశారు. ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో విడుదల చేయనున్నారని పేర్కొన్నారు. అమెరికాకు చెందిన మార్టిని ఫిల్మ్స్, పింక్ జాగ్వార్ ఎంటర్‌టైన్‌మెంట్ కలిసి మన దేశంలో ఐదు సినిమాల నిర్మాణానికి 100 కోట్ల డాలర్లు పెట్టుబడి పెట్టనున్నాయని తెలిపారు. వాటిలో ఛత్రపతి శివాజీ మహారాజ్, భారత ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంపై సినిమాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు.
0 Response to "అబ్దుల్ కలాంపై బయోపిక్"
Post a Comment