130కే 200 ఉచిత చానళ్లు

  • వినియోగదారు ఎంచుకున్నవి ఇవ్వాల్సిందే
  • 26 డీడీ చానళ్లు వాటికి అదనం.. రూ.160కి ఉచిత చానళ్లన్నీ ఇవ్వాలి
  • బొకేలో ఉండే చానళ్ల గరిష్ఠ ధర.. రూ.19 నుంచి రూ.12కు తగ్గింపు
  • ఒకటికి మించి టీవీలుంటే ఎన్‌సీఎఫ్‌లో 40 శాతానికే రెండో కనెక్షన్‌
  • 20 శాతానికిపైగా వీక్షకులుండే చానళ్లకు క్యారియర్‌ ఫీజు తీసుకోవద్దు
  • గరిష్ఠ క్యారియర్‌ ఫీజు 4 లక్షలు.. మార్చి 1 నుంచి అమల్లోకి ధరలు


ఒక భాషకు చెందిన చానళ్లన్నీ ఒకే వరసలో ఉండాలి. చానల్‌ నంబరును కూడా తరుచూ మార్చకూడదు. ఒకవేళ మార్చాలంటే అందుకు ‘ట్రాయ్‌’ అనుమతి తప్పనిసరి.
న్యూఢిల్లీ, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): టీవీ వీక్షకులకు ‘ట్రాయ్‌’ నూతన సంవత్సర కానుక ప్రకటించింది! కేబుల్‌ ధరలపై కీలక నిర్ణయం తీసుకుంది. బొకేల పేరుతో చానళ్లు చేస్తున్న మాయాజాలానికి అడ్డుకట్ట వేసేలా.. ఒకటికి మించి కనెక్షన్లు తీసుకున్నవారికి ఊరట కలిగించేలా కొత్త టారిఫ్‌ విధానాన్ని రూపొందించింది. వినియోగదారులు తాము చూసిన చానళ్లకు మాత్రమే డబ్బు చెల్లించే సదుద్దేశంతో గతంలో రూపొందించిన విధానం, అమలు చేసిన నిబంధనలు అంతిమంగా ప్రజలపై భారం పడేలా చేశాయి. దానిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో.. ‘టారిఫ్‌ ఆర్డర్‌, ఇంటర్‌ కనెక్షన్‌ రెగ్యులేషన్స్‌, క్వాలిటీ
ఆఫ్‌ సర్వీసెస్‌ రెగ్యులేషన్స్‌, 2017కు ట్రాయ్‌ సవరణలు చేపట్టి ఈ కొత్త విధానాన్ని ప్రకటించింది. దానిప్రకారం..
 
  • వినియోగదారు నెలకు రూ. 130 (పన్నులు అదనం) చెల్లిస్తే 200 ఉచిత చానళ్లను.. అది కూడా వారు ఎంచుకున్న చానళ్లను తప్పనిసరిగా ఇవ్వాల్సిందే. వాటితోపాటు కేంద్ర సమాచార, ప్రసార శాఖ తప్పనిసరిగా పేర్కొన్న దూరదర్శన్‌ వంటి 26 చానళ్లను కూడా ఇవ్వాలి. ప్రస్తుతం ఈ మొత్తానికి దూరదర్శన్‌ చానళ్లు కాకుండా కేవలం 100 ఉచిత చానళ్లను మాత్రమే ప్రసారం చేస్తున్నారు. ఆ తర్వాత ఇచ్చే ప్రతి 25 ఉచిత చానళ్లకూ రూ.20 (పన్నులు అదనం) వసూలు చేస్తున్నారు.
  • వినియోగదారు నెలకు 160 చెల్లిస్తే సర్వీస్‌ ప్రొవైడర్లు తమవద్ద ఉన్న ఉచిత చానళ్లన్నీ ఇవ్వాల్సిందే.
  • చాలా టీవీ చానళ్ల యాజమాన్యాలు.. అలాకార్టే (విడివిడిగా మనకు కావాల్సిన చానల్‌ను ఎంచుకునే పద్ధతి)లో తమ చానళ్లలో ప్రధాన చానల్‌కు ఎక్కువ ధర పెట్టి, దానికి అనుబంధంగా ఉండే మిగతా చానళ్లకు తక్కువ ధర పెట్టాయి. అన్నిటినీ కలిపి గంపగుత్తగా (బొకే) తీసుకుంటే మాత్రం తక్కువ ధరకే వచ్చేలా చేశాయి. దీంతో వినియోగదారులు అన్నింటినీ కలిపి తీసుకోవాల్సిన పరిస్థితి. దీనికి విరుగుడుగా ట్రాయ్‌ కొత్త విధానంలో రెండు ప్రధాన నిబంధనలను పెట్టింది. అవేంటంటే.. 1.) అలాకార్టేలో విడివిడిగా ఇచ్చే చానళ్ల ధర బొకే ధరకు ఒకటిన్నర రెట్లకు మించి ఉండకూడదు. ఉదాహరణకు.. ‘అ’ అనే చానల్‌ ఐదారు చానళ్లు ఇస్తుంది. వాటిని విడివిడిగా (అలాకార్టేలో) తీసుకుంటే రూ.60 అయ్యేలా ధరలు నిర్ధారిస్తుంది. అవే చానళ్లను బొకేలాగా కొనుక్కుంటే రూ.30కే ఇస్తామని ప్రకటిస్తుంది. దీంతో ప్రజలు బొకే తీసుకోవాల్సిన అగత్యం ఏర్పడుతుంది. అదే, కొత్త విధానం ప్రకారమైతే.. అలాకార్టేలో ఆ చానళ్ల ధరలన్నింటినీ కలిపినా రూ.45కు మించకూడదు. 2.) అలాకార్టేలో ఉండే ఒక చానల్‌ సగటు ధర.. ఆ చానల్‌ ఉన్న బొకేలోని చానళ్ల సగటు ధరకు 3 రెట్లకు మించి ఉండరాదు.
  • బొకేలో చేర్చిన పే చానళ్లకు సంబంధించి ఒక చానల్‌కు గరిష్ఠ ధర రూ.19 నుంచి 12కు తగ్గింపు. అంటే రూ.12 లోపు ధర ఉన్న చానళ్లనే బొకేలో చేర్చాలి.
  • ఒక ఇంట్లో రెండు కనెక్షన్లు ఉంటే... రెం డో కనెక్షన్‌కు నెట్‌వర్క్‌ క్యారేజ్‌ ఫీజులో (అంటే మన కేబుల్‌/డీటీహెచ్‌ కనెక్షన్‌ను యాక్టివ్‌గా ఉంచుకోవడానికి ప్రతి నెలా కట్టే మొత్తం. అంటే రూ.130+పన్నులు) 40ు చార్జీనే వసూలు చేయాలని పేర్కొంది. ఒకటి కన్నా ఎక్కువ టీవీలున్నవారికి పెద్ద శుభవార్త ఇది.
  • ఏదైనా చానల్‌కు 20 శాతానికిపైగా వీక్షకులు ఉం టే సంబంధిత చానల్‌ నుంచి క్యారియర్‌ ఫీజును వసూలు చేయవద్దని ఎస్‌ఎంవోలకు ట్రాయ్‌ స్పష్టం చేసింది. 20 శాతానికి తక్కువగా ఎంత శాతం వీక్షకులు ఉన్నప్పటికీ క్యారియర్‌ ఫీజును రూ.4 లక్షలకు మించి వసూలు చేయకూడదు.
  • కొత్త విధానం ప్రకారం సవరించిన అ-లా-కార్టె చానల్‌, బొకేల ధరలను జనవరి 15లోగా బ్రాడ్‌కాస్టర్లు, జనవరి 30లోగా డీటీహెచ్‌, కేబుల్‌ ఆపరేటర్లు తమ వెబ్‌సైట్లలో ప్రకటించాలి. ఈ నిర్ణయాలన్నీ మార్చి 1 నుంచి అమల్లోకి వస్తాయి

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to " 130కే 200 ఉచిత చానళ్లు"

Post a Comment