బో‘ధనం’ ఏదీ


  • ఇంటర్‌ ట్యూషన్‌ ఫీజుపై కిరికిరి
  • ‘అమ్మఒడి’ 15 వేలు ఇస్తామంటున్న సర్కారు
  • నిర్వహణ పేరుతో తల్లికి ఇస్తే కాలేజీల పరిస్థితేంటి?
  • రీయింబర్స్‌ చేస్తారో లేదో తెలియక సతమతం
  • జీవోలతో సందిగ్ధత.. 6 నెలలుగా రూపాయి లేదు
  • ఆందోళనలో జూనియర్‌ కాలేజీల యాజమాన్యాలు
అమరావతి, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్‌ చదువుతున్న విద్యార్థుల ట్యూషన్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై గందరగోళ పరిస్థితి నెలకొంది. ‘అమ్మ ఒడి’ పథకం కింద పిల్లలను బడికి పంపించే ప్రతి తల్లికీ ఏటా రూ.15 వేలు ఇస్తామని చెబుతున్న ప్రభుత్వం.. రకరకాల ఆంక్షలతో జూనియర్‌ కళాశాలలకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై మాత్రం స్పష్టత ఇవ్వకుండా దోబూచులాడుతోంది. నిర్వహణ కింద తల్లికి రూ.15 వేలు ఇస్తే... మరి పిల్లలకు చదువు చెప్పే కాలేజీల పరిస్థితి ఏమిటని యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 2019-20 విద్యా సంవత్సరం మొదలై ఆరు నెలలు కావస్తున్నా జూనియర్‌ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థుల బోధనకు ఇప్పటి వరకూ ఒక్క రూపాయి ఫీజు కూడా యాజమాన్యాలకు ప్రభుత్వం రీయింబర్స్‌ చేయలేదు. అసలు ట్యూషన్‌ ఫీజును రీయింబర్స్‌ చేస్తారో, చేయరో కూడా తెలియని గందరగోళ పరిస్థితి ఏర్పడింది

కోర్సులు సమానమే అయినా..
ప్రస్తుతం ట్యూషన్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ స్కీమ్‌ రెండు రూపాల్లో ఉంది. ఒకటి... మెయింటెనెన్స్‌ ఆఫ్‌ ట్యూషన్‌ ఫీజు(ఎంటీఎఫ్‌), రెండు... రీయింబర్స్‌మెంట్‌ ఆఫ్‌ ట్యూషన్‌ ఫీజు(ఆర్‌టీఎ్‌ఫ)గా గత ప్రభుత్వం అమలు పరుస్తోంది. ఎంటీఎ్‌ఫను విద్యార్థుల ఖాతాలో ప్రభుత్వం జమచేస్తుంది. ఆర్‌టీఎ్‌ఫను కాలేజీల ఖాతాలో జమచేస్తారు. గత విద్యా సంవత్సరం వరకూ ఈ పద్ధతి అమల్లో ఉంది. ఇంటర్‌ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ స్కీమ్‌ లేదు. కానీ పోస్ట్‌మెట్రిక్‌ స్కాలర్‌షిప్స్‌ పేరిట ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు ఎంటీఎఫ్‌ కింద ఏటా రూ.6 వేలు, బీసీ విద్యార్థులకు రూ.5 వేలు వాళ్ల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఆర్‌టీఎఫ్‌ కింద తొలి సంవత్సర విద్యార్థులకు రూ.2850, రెండో సంవత్సర విద్యార్థులకు రూ.3150 కాలేజీల ఖాతాల్లో వేస్తున్నారు. కానీ జగన్‌ ప్రభుత్వం రాగానే ‘అమ్మ ఒడి’ పథకాన్ని ప్రవేశపెట్టింది. తొలుత ఒకటి నుంచి పదో తరగతి వరకూ ఈ పథకాన్ని అమలు చేస్తామని చెప్పి, తర్వాత దాన్ని రెండేళ్ల ఇంటర్మీడియట్‌ వరకూ విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. దీని అమలుకు సంబంధించిన విధివిధానాలతో హడావిడిగా జీవోలు జారీచేసింది. ఈ పథకం అమలు చేస్తున్నందున ట్యూషన్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ స్కీమ్‌ వర్తించని విధంగా మార్గదర్శకాలు ఇవ్వడం ద్వారా ఒక రకమైన అయోమయ పరిస్థితిని సృష్టించింది.
 
అమ్మ ఒడి పథకం కింద ఒక విద్యార్థికి సంవత్సరానికి రూ.15 వేలు సరిపోయే పరిస్థితి ఉందా? పదో తరగతి తర్వాతి కోర్సులైన ఐటీఐ, పాలిటెక్నిక్‌ కోర్సులు చదివే విద్యార్థులతో సమానంగా ఇచ్చే పరిస్థితి లేకపోవడం సరికాదని జూనియర్‌ కాలేజీల యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. జగన్‌ ప్రభుత్వం గత ఆరు నెలల నుంచి రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వకపోగా, కొత్తగా అమ్మ ఒడి, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన అనే పేర్లతో హడావిడిగా జీవోలు ఇచ్చి కాలయాపన చేస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంటర్‌తో సమానమైన కోర్సులైన ఐటీఐ విద్యార్థులకు.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద రూ.15,700, మెయింటెనెన్స్‌ కింద రూ.10 వేలు... అంటే మొత్తం రూ.25,700 ఇస్తున్నారు. పాలిటెక్నిక్‌ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద రూ.24 వేలు, మెయింటెనెన్స్‌ కింద రూ.15 వేలు... అంటే మొత్తం రూ.39వేలు ఇస్తున్నారు. కానీ ఎక్కువ మంది చదువుతున్న ఇంటర్‌ విద్యార్థులకు మాత్రం ’అమ్మఒడి’ కింద రూ.15 వేలతో సరిపెట్టి భారం తగ్గించుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న అభిప్రాయాలున్నాయి. కళాశాల ఎటాచ్డ్‌ హాస్టళ్లకి ఇవ్వాల్సిన భోజన ఫీజులను కూడా తల్లి ఖాతాకు తరలించడం ఎంతవరకూ సబబని యాజమాన్యాలు ప్రశ్నిస్తున్నాయి. గత 25 ఏళ్లుగా విద్యార్థులకు సంబంధించిన భోజన రుసుములను కళాశాల ప్రిన్సిపాల్‌ ఖాతాలో వేస్తున్నారని, కానీ ఈ ప్రభుత్వం రుసుమును చెల్లించడం లేదన్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "బో‘ధనం’ ఏదీ"

Post a Comment