అమ్మా.. నాకేం కనిపించడంలేదు
● 'కంటి వెలుగు' పరీక్షల్లో గుర్తింపు
● పౌష్టికాహారలేమి, వంశపారంపర్యం, జీవనశైలే కారణం
● 37 వేల మంది విద్యార్థులకు దృష్టి లోపాలు
● కంటి పరీక్షలు చేయించుకున్న విద్యార్థులు : 6,73,728
● దృష్టి లోపం ఉన్నట్లు మొదటి దశలో గుర్తించినవారు 37,329
● రెండో దశలో నిపుణులు పరీక్షించింది: 36,442
● కళ్లద్దాలు అవసరం ఉన్నవారు: 13,996
● ఉన్నత వైద్యం అవసరం ఉన్నవారు: 2,717
బిడ్డ ఏడిస్తే.. అమ్మ ఒడి ఆమెకు జోల పాడేది.. ఆమె చీర మెత్తని ఊయలై ఊపి
ఈనాడు డిజిటల్ - కర్నూలు: బాల్యం మసక బారుతోంది... చిరు ప్రాయం వృద్ధాప్యంలా మారుతోంది... నల్లబోర్డుపై అక్షరాలు కనిపించక, దృష్టిలోపమని చెప్పలేక సతమతమవుతున్నారు విద్యార్థులు. పౌష్టికాహార లేమి.. వంశపారంపర్యం.. జీవనశైలిలో మార్పులే వారికి శాపాలుగా మారాయి.
*విద్యార్థులకు దశల వారీగా కంటి పరీక్షలు నిర్వహించి శస్త్రచికిత్సలు చేసి, కళ్లద్దాలు అందించే లక్ష్యంతో ప్రభుత్వం 'కంటి వెలుగు' కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా మొదటి దశలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో, వసతి గృహాల్లో విద్యార్థులకు కంటి పరీక్షలు పూర్తి చేశారు. ఇందులో వేలాది మంది దృష్టి లోపాలతో బాధపడుతున్నట్లు అంచనాకు వచ్చారు. ప్రాథమిక దశలో నేత్ర సమస్యలున్నట్లు గుర్తించిన వారిని నవంబరు 1వ తేదీ నుంచి డిసెంబరు 31 వరకు నిపుణులతో ప్రత్యేక పరీక్షలు చేయిస్తున్నారు.
బృందాల వారీగా....
తొలి దశలో ఉపాధ్యాయుడు, ఆరోగ్య, ఆశ కార్యకర్తలు బృంద సభ్యులుగా కంటి వెలుగు కిట్లతో విద్యార్థులను పరీక్షించారు. ఇందులో 37,329 మంది సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించి నివేదికలు పంపారు. వీటి ఆధారంగా రెండో దశలో జిల్లాలో 40 మంది పారామెడికల్ ఆప్తాల్మిక్ అసిస్టెంట్లు ప్రాథమిక దశలో గుర్తించిన విద్యార్థులను రెండో విడత స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. డిసెంబరు 14వ తేదీ వరకు 97.62% మందిని పరీక్షించి వివిధ లోపాలను గుర్తించారు. కళ్లద్దాలతోనే ఎక్కువ మందిలో దృష్టిలోపం తీరుతుందని, మరికొంతమందికి శస్త్ర చికిత్సలు, ఉన్నత వైద్యం అవసరమని గుర్తించారు.
ఫిబ్రవరి 1 నుంచి మూడో విడత: రెండో విడతలో దృష్టి లోపాలున్న వారికి స్క్రీనింగ్ చేసి కళ్లద్దాలు పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే 2,612 కళ్లద్దాలు పునఃపరిశీలనకు జిల్లా అంధత్వ నివారణ సంస్థకు వచ్చాయి. కంటి పరీక్షల సమయంలోనే పాఠశాలల్లో కళ్లద్దాలు ధరించిన వారు 6,342 మంది ఉండగా.. వారిలో ప్రస్తుతం కంటి సమస్యలు సాధారణంగా ఉన్నట్లు నిర్ధరించారు. ఇక కంటి వెలుగు కార్యక్రమాన్ని వివిధ దశల్లో 2022 నాటికి పూర్తి చేయాలన్నది ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఫిబ్రవరి 1 నుంచి మూడో విడతలో భాగంగా గ్రామాల్లో బృందాలు పర్యటించి ప్రజల్లో దృష్టిలోపాలు గుర్తించనున్నారు.
కారణాలు ఇవే...
పిల్లల దృష్టిలోపాలకు మేనరిక వివాహాలు, పౌష్టికాహార లేమి, విటమిన్-ఎ లోపం, ఎలక్ట్రానిక్ రేడియేషన్, వంశపారంపర్యం ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. వీటితోపాటు జీవనశైలి మరో కారణంగా ధ్రువీకరిస్తున్నారు. జంక్‌ఫుడ్ అధికంగా తీసుకోవడం, సరైన వ్యాయామం లేకపోవడం, తరగతి గదుల్లో సరైన వెలుతురు లేకపోవడం, చాక్‌పీస్ పొడి నిత్యం కళ్లల్లో పడటం వంటివి సైతం దృష్టిలోపాలకు దారితీస్తున్నాయి.
జాగ్రత్తలు పాటిస్తేనే..
కంటి సమస్యలను ఆదిలోనే గుర్తించి వాటిని దూరం చేసేందుకు తగిన జాగ్రత్తలు పాటిస్తే మేలంటున్నారు వైద్యులు. ప్రతిరోజూ సూర్యరశ్మి తగిలే ప్రదేశంలో ఆటలు అవసరం. విటమిన్-ఎ అధికంగా ఉండే ఆకుకూరలు, క్యారెట్, గుడ్లు, చేపలు తీసుకోవాలి. పసుపు రంగు కల్గిన బొప్పాయి, అరటి, మామిడి, ఫైనాపిల్, పనస తదితర పండ్లు కళ్లు, మెదడుకు మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
శతశాతం అమలు చేస్తాం
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని వంద శాతం పూర్తి చేస్తాం. చిన్నారుల్లో కంటి వెలుగుతో... నీటి కాసుల వ్యాధి, మెల్లకన్ను, తట్టు..ఆటలమ్మ సమయంలో కంటిపై ప్రభావం, అలర్జీలు, ఇన్‌ఫెక్షన్లతో బాధపడుతున్న విద్యార్థులను గుర్తించాం. ప్రస్తుతం అద్దాల పవర్ పరిశీలించి పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తున్నాం. ప్రస్తుత కాలంలో చిన్న పిల్లలను అల్లరి మాన్పించడానికి, భోజనం పెట్టడానికి చరవాణి ఇచ్చి మభ్యపెడుతున్నాం. చరవాణులు, ట్యాబ్‌ల ప్రభావం రెటీనాపై పడుతోంది. - డాక్టర్ నరేంధ్రనాథ్‌రెడ్డి, కంటి వెలుగు రాష్ట్ర కమిటీ సభ్యులు
0 Response to "అమ్మా.. నాకేం కనిపించడంలేదు"
Post a Comment