సీపీఎస్ రద్దు భిక్ష కాదు... ఉద్యోగుల హక్కు
రద్దయ్యే వరకూ సంఘటిత పోరాటం
విజయనగరంలో భారీ ర్యాలీ, సభ
ర్యాలీ నిర్వహిస్తున్న ఉద్యోగులు
విజయనగరం విద్యావిభాగం, న్యూస్‌టుడే: విద్యలనగరి విజయనగరంలో సీపీఎస్ ఉద్యోగులంతా కదం తొక్కారు. తమ మనోవేదనను ప్రభుత్వానికి వినిపించేలా గళమెత్తారు. సీపీఎస్ రద్దు భిక్ష కాదు.. ఉద్యోగుల హక్కంటూ నినదించారు. ఏపీసీపీఎస్‌ఈఏ (ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పింఛను పథకం ఉద్యోగుల సంఘం) ఆధ్వర్యంలో ఆదివారం విజయనగరంలో భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించారు. జిల్లా పరిషత్తు కార్యాలయం వద్ద ప్రారంభమైన ఉద్యోగుల ర్యాలీ రైల్వేస్టేషను, ఎన్‌సీఎస్ కూడలి, కన్యకాపరమేశ్వరి ఆలయం, గంటస్తంభం, కోట మీదుగా గురజాడ కళాక్షేత్రం వరకు సాగింది
అక్కడ బహిరంగ సమావేశం నిర్వహించారు. విజయనగరంతో పాటు శ్రీకాకుళం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఉద్యోగులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఏపీసీపీఎస్‌ఈఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు బోకం బాలకృష్ణ మాట్లాడుతూ సీపీఎస్‌పై నిర్ణయం తీసుకోవడంలో ప్రభుత్వంలో ఎవరు అడ్డుపడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రిపై నమ్మకంతోనే ఉన్నామని, ఉద్యోగుల మనోవేదనను అర్థం చేసుకోవాలని కోరారు.
శాంతియుత మార్గంలోనే ఉద్యమం చేస్తున్నామని, ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని లేనిపక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర కోశాధికారి రొంగలి అప్పలరాజు మాట్లాడుతూ సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇవ్వడంతోనే ఎన్నికల్లో మద్దతిచ్చామని తెలిపారు. నెల రోజుల్లో రద్దు చేస్తామని చెప్పి ఆరు నెలలైనా చేయలేదన్నారు. రోడ్డెక్కకూడదనే ఇంతవరకూ ఆగాల్సివచ్చిందన్నారు.
సమస్యకు ఒక్క అడుగు పడలేదని, రద్దు చేసే వరకూ సంఘటిత పోరాటం సాగించాలన్నదే సంఘ ఆశయమని ప్రకటించారు. జిల్లా అధ్యక్షులు గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ మేనిఫెస్టోలో పొందుపర్చలేదని ఆర్థిక మంత్రి అనడం హాస్యాస్పదమన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు కె.రాజేశ్వరరావు, ఉమా మహేశ్వరరావు, బాలకృష్ణ, గురాన శ్రీను, షేక్ ఇమాం, సంతోష్‌కుమార్, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు జయరాం, శ్రీకాకుళం అధ్యక్ష కార్యదర్శులు సురేష్, సూరిబాబు, విశాఖ జిల్లా సతీష్ సూర్యప్రకాష్ పాల్గొన్నారు
0 Response to "సీపీఎస్ రద్దు భిక్ష కాదు... ఉద్యోగుల హక్కు"
Post a Comment