ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్‌ వరాలు

హైదరాబాద్‌: ఆర్టీసీ కార్మికులతో సీఎం కేసీఆర్‌ నిర్వహించిన ఆత్మీయ సమావేశం ముగిసింది. ప్రగతిభవన్‌లో నిర్వహించిన ఈ సమావేశంలో ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్‌ వరాలు ప్రకటించారు. ఈ మేరకు సీఎం కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆర్టీసీలో ఒక్క ఉద్యోగినీ తొలగించకుండా ఉద్యోగ భద్రత కల్పిస్తామని.. ఏ ఒక్క రూటులోనూ ప్రైవేట్‌ బస్సులకు అనుమతి ఇవ్వబోమని సీఎం స్పష్టం చేశారు. వచ్చే ఏడాది నుంచి ఏటా బడ్జెట్‌లో ఆర్టీసీకి రూ.వెయ్యికోట్లు కేటాయిస్తామని చెప్పారు. నాలుగునెలల్లోనూ ఆర్టీసీ లాభాల బాట పట్టాలని.. ఏటా వెయ్యికోట్ల లాభం రావాలన్నారు. ప్రతి కార్మికుడూ ఏడాదికి రూ.లక్ష బోనస్‌ అందుకునే స్థితికి రావాలని కేసీఆర్‌ ఆకాక్షించారు

సమ్మెకాలానికి వేతనం.. విరమణ వయసు పెంపు



కార్మికులకు 52 రోజుల సమ్మెకాలానికి వేతనం ఇస్తామని సీఎం ప్రకటించారు. సమ్మె కాలానికి సంబంధించిన వేతనాన్ని ఏకమొత్తంలో ఒకేసారి ఇవ్వనున్నట్లు చెప్పారు. దీంతో పాటు సెప్టెంబర్‌ వేతనం సోమవారమే చెల్లించనున్నట్లు సీఎం తెలిపారు. మరోవైపు కార్మికుల పదవీ విరమణ వయసును 58 నుంచి 60 ఏళ్లకు పొడిగించనున్నట్లు స్పష్టం చేశారు.

రాష్ట్రంలోని 97 డిపోల నుంచి డిపోకు ఐదుగురు చొప్పున కార్మికులు ఈ సమావేశానికి హాజరయ్యారు. వారితో కలిసి మద్యాహ్న భోజనం చేసిన కేసీఆర్.. తర్వాత రెండు గంటలపాటు వారితో సమావేశమయ్యారు. ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన ప్రతి అంశంపైనా సీఎం స్పందించి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశం సుహృద్భావ వాతావరణంలో జరిగిందని సీఎం కార్యాలయం పేర్కొంది. ఈ భేటీలో మంత్రి పువ్వాడ అజయ్‌, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ, ఈడీలు, ఆర్‌ఎంలు, డీవీఎంలు, కంట్రోలర్లు, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు


SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్‌ వరాలు"

Post a Comment