ఈనాడు' కథనాలకు న్యాయమూర్తి స్పందన
సుమోటాగా తీసుకొని అధికారులకు తాఖీదులు
రాయచోటి, సంబేపల్లె, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న సమస్యలపై 'ఈనాడు'లో వచ్చిన కథనాలకు జిల్లా 5వ అదనపు కోర్టు న్యాయమూర్తి డి.లక్ష్మీ స్పందించారు. సంబేపల్లె మండలం శెట్టిపల్లెలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో మరుగుదొడ్లు లేక విద్యార్థులు పడుతున్న ఇబ్బందులపై ఈనెల 8న 'ఈనాడు'లో 'ఆగిన మరుగుదొడ్లు..వంట గది నిర్మాణం' శీర్షికన కథనం ప్రచురితమైంది. న్యాయమూర్తి సుమోటోగా తీసుకుని సంబంధిత విద్యాశాఖ అధికారులకు తాఖీదు జారీ చేశారు. కోర్టుకు హాజరై సమస్య పరిష్కారించడంలో జరుగుతున్న జాప్యంపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు
ఈ మేరకు శనివారం ఇన్‌ఛార్జి ఎంఈవో రామకృష్ణమూర్తి, పాఠశాల ఉపాధ్యాయులు కోర్టుకు హాజరయ్యారు. పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణం అసంపూర్తిగా ఉన్న మాట వాస్తవమేనని, నిధులు విడుదల కోసం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. సర్వశిక్ష అభియాన్ విభాగం ఈ పనులు చేపట్టాల్సి ఉందని న్యాయమూర్తికి వివరించారు. వెంటనే ఆ విభాగం అధికారులకు కోర్టు ద్వారా తాఖీదు జారీ చేస్తామన్నారు.
శాఖాపరంగా సత్వరం చర్యలు తీసుకొని పనులు పూర్తి చేసి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూడాలని న్యాయమూర్తి అధికారులకు సూచించారు. రాయచోటి పట్టణంలోని సైదియా హాల్ సమీపంలో నెలకొన్న మురుగుతో స్థానికులు పడుతున్న ఇబ్బందులపై 'ఈనాడు'లో వచ్చిన కథనాన్ని సుమోటోగా తీసుకుని పురపాలిక అధికారులను కోర్టుకు పిలిపించారు. మురుగు తొలగింపునకు జరుగుతున్న జాప్యంపై వివరణ ఇవ్వాలని కోరడంతో వెంటనే సమస్యను పరిష్కరించి న్యాయమూర్తికి నివేదిందించారని కోర్టు సిబ్బంది పేర్కొన్నారు
0 Response to "ఈనాడు' కథనాలకు న్యాయమూర్తి స్పందన"
Post a Comment