వయోపరిమితి సడలింపు?
- 44 ఏళ్ల వరకు ఇవ్వాలంటున్న నిరుద్యోగులు
- ఇప్పటికే ముగిసిన సడలింపు గడువు
- కొత్త నోటిఫికేషన్ల కోసం మళ్లీ పొడిగింపు!
- ప్రభుత్వ పరిశీలనలో ప్రతిపాదన
అమరావతి, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ
ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయోపరిమితిని మరోసారి సడలించే
అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీపీఎస్సీ ద్వారా చేపట్టే రిక్రూట్‌మెంట్లకు
తెలంగాణలో అమల్లో ఉన్నవిధంగా 44 సంవత్సరాల వరకు వయోపరిమితిని పొడిగించాలని
నిరుద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వివిధ ప్రభుత్వ విభాగాల్లోని
ఖాళీల భర్తీకి ఏటా నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం, క్యాలెండర్ ఇయర్
పాటించకపోవడం వల్ల దరఖాస్తు చేసుకునే అవకాశం కోల్పోతున్నామని వాపోతున్నారు.
ఈ విషయంపై గతంలోనూ అభ్యర్థులు ఆందోళనలు చేపట్టి ప్రభుత్వాలకు
మొరపెట్టుకున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగార్థులకు వయోపరిమితి 34ఏళ్లు
కాగా, వై.ఎ్‌స.రాజశేఖరరెడ్డి హయాంలో దీన్ని 39ఏళ్లకు పెంచారు. ఆ తర్వాత
సీఎంగా పనిచేసిన కిరణ్‌కుమార్‌రెడ్డి వయోపరిమితిని 36ఏళ్లకు తగ్గించారు.
అనంతరం 2014లో
చంద్రబాబు అధికారంలోకి వచ్చాక 42ఏళ్లకు పెంచారు. రిక్రూట్‌మెంట్లను బట్టి
వయోపరిమితిని ఎప్పటికప్పుడు సడలిస్తూ వస్తున్నారు. చంద్రబాబు హయాంలో ఇచ్చిన
వయోపరిమితి సడలింపు ఉత్తర్వుల గడువు 2019 సెప్టెంబరు 30తో ముగిసింది.
దీంతో ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేవారికి వయోపరిమితి
34 సంవత్సరాలే. వై.ఎ్‌స.జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏపీపీఎస్సీ కొత్త
నోటిఫికేషన్లు ఇవ్వలేదు. ఇకపై ఏటా రిక్రూట్‌మెంట్లు ఉంటాయని, ప్రతి
జనవరిలోనే క్యాలెండర్ విడుదల చేయాలని సీఎం ఆదేశించారు. ఈ మేరకు 2020లో
చేపట్టే రిక్రూట్‌మెంట్లకు సంబంధించిన నోటిఫికేషన్ల వివరాలతో ఏపీపీఎస్సీ
క్యాలెండర్ విడుదల చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఉద్యోగార్థుల వయోపరిమితి
అంశం మరోసారి తెరపైకి వచ్చింది. వయోపరిమితి సడలించాలన్న ప్రతిపాదన ప్రభుత్వ
పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది
0 Response to "వయోపరిమితి సడలింపు?"
Post a Comment