క్షీణిస్తున్న గాలి నాణ్యత
తెలుగు రాష్ట్రాల్లో నాణ్యత సూచీల్లో మార్పులు
వారం రోజుల్లో సంతృప్తి స్థితి నుంచి మధ్యస్థానికి
హైదరాబాద్‌తో పాటు అమరావతిలో..
వాతావరణ మార్పులే కారణమంటున్న నిపుణులు
ఈనాడు, హైదరాబాద్
తెలుగు రాష్ట్రాల్లో గాలి నాణ్యత రోజురోజుకు క్షీణిస్తోంది. వారం వ్యవధిలోనే గాలి నాణ్యత సూచీ దాదాపు రెండింతలు పెరిగింది. 'సంతృప్తి' స్థితి నుంచి 'మధ్యస్తం'కు చేరింది. ఆస్తమా, గుండె సంబంధ సమస్యలున్న వారిపై ఈ వాయు కాలుష్యం ప్రభావం చూపుతుందని, వారు జాగ్త్రతలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు
పెరగనున్న వాయు కాలుష్యం!
వాతావరణంలో మార్పుల కారణంగా గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో కాలుష్య తీవ్రత పెరిగి స్వచ్ఛమైన గాలి తగ్గిపోతుంది. కాలుష్య తీవ్రత నవంబరు 1న తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో సంతృప్తికర (51-100) స్థితిలో ఉంది. 7నాటికి మధ్యస్థానికి (101-200) చేరుకుంది. హైదరాబాద్, తిరుపతి, రాజమహేంద్రవరంలో రెండింతలు.. అమరావతిలో రెండున్నర రెట్లు వాయు కాలుష్యం పెరిగింది. డిసెంబరు, జనవరి నెలల్లో ఈ తీవ్రత మరింత అధికమయ్యే అవకాశాలున్నాయి. ఏక్యూఐ 200 (కాలుష్యం ఎక్కువ) దాటిన నగరాల్లో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు మొదలవుతాయి. ఈ సూచీ 301 దాటితే ఆరోగ్య సమస్యలు వస్తాయి. 400 ఉంటే అత్యంత దారుణ పరిస్థితి ఉన్నట్లు భావిస్తున్నారు. దిల్లీలో ఈ నెల 3న 494 వరకు నమోదైంది.
* దేశవ్యాప్తంగా చూస్తే గాలి నాణ్యత సూచీ (నవంబరు 7న)- మొరాదాబాద్‌లో అత్యధికంగా 435, లఖ్‌నవూ, కాన్పూర్‌లో 366, పట్నాలో 378, ముజఫరాబాద్‌లో 341, నోయిడాలో 318, దిల్లీలో 309గా నమోదైంది.
ఎందుకిలా?
పరిశ్రమల, వాహన కాలుష్యం, చెత్తను కాల్చడం వంటి కారణాలతో సూక్ష్మధూళికణాలు(పీఎం 10), అతిసూక్ష్మ ధూళికణాలు (పీఎం 2.5), నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, ఓజోన్ వంటి కాలుష్య ఉద్గారాలు గాలిలో కలుస్తుంటాయి. సాధారణ రోజుల్లో అయితే ఈ ఉద్గారాలు గాలిలో చెల్లాచెదురు అయిపోతుంటాయి. ఉష్ణోగ్రతలు పడిపోయినప్పుడు, గాలిలో తేమ ఉన్నప్పుడు కాలుష్య ఉద్గారాలు విడుదలైన ప్రాంతంలోనే కదలకుండా ఉండిపోతాయి. ఫలితంగా గాలి నాణ్యత క్షీణించడంతో పాటు పీల్చినవారికి ఆరోగ్యసమస్యలు మొదలవుతాయి.
వృద్ధులు, పిల్లలు జాగ్రత్తపడాలి
- రవీందర్, సీనియర్ సైంటిస్ట్
పీఎం 2.5 అతి సూక్ష్మధూళికణాల వల్ల దమ్ము, దగ్గు వంటి ఊపిరితిత్తుల సంబంధ సమస్యలు వస్తాయి. సమస్య ఉన్నవారికి అధికమవుతుంది. వయోవృద్ధులు, పిల్లలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదయం 3-8 గంటల వరకు పొగమంచు సమయంలో కాలుష్య ఉద్గారాల్లో కదలికలు ఉండవు. ఆస్తమా, ఇతర ఆరోగ్య సమస్యలున్నవాళ్లు ఈ సమయంలో బయటకు వెళ్లొద్దు. సాధారణంగా కింద వేడిగా ఆకాశంలో పైకి వెళ్లే కొద్ది చల్లగా ఉండాలి. చలికాలంలో భూమి అకస్మాత్తుగా చల్లబడిపోతుంది. వాహనాలు, రోడ్లు, నిర్మాణ, పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్య ఉద్గారాలు కిందే ఆగిపోయి ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి.
ఉదయపు నడక మానడం మేలు
- పి.వీరన్న, మాజీ జాయింట్ చీఫ్ ఎన్విరాన్‌మెంటల్ సైంటిస్ట్ (పీసీబీ)
చలికాలంలో కాలుష్య ఉద్గారాలు వాతావరణంలోని కింది పొరల్లో తక్కువ ఎత్తులో ఉంటాయి. గాలి పీల్చుకోగానే నేరుగా శరీరంలోకి వెళ్లిపోతాయి. ఉదయపు నడక సమయంలో శ్వాస ఎక్కువ తీసుకుంటాం. ఈ సమయంలో కాలుష్య ఉద్గారాలు శరీరంలోకి ఎక్కువ వెళ్లే ప్రమాదం ఉంది. చలికాలంలో ఉదయపు నడక మానేయడం ఉత్తమం. గాలి నాణ్యత క్షీణించినప్పుడు శ్వాసవ్యవస్థపై ప్రభావం ఎక్కువ ఉంటుంది
0 Response to "క్షీణిస్తున్న గాలి నాణ్యత"
Post a Comment