ఉమ్మడి పౌర స్మృతి

  • శీతాకాల సమావేశాల్లో మోదీ మరో సిక్సర్‌!
  • పంద్రాగస్టు ప్రసంగంలోనే సంకేతం
  • సంఘ్‌ చిరకాల వాంఛ నెరవేర్చడమే లక్ష్యం
  • ఉమ్మడి స్మృతి అవసరం లేదన్న లా కమిషన్‌
  • పట్టుదలగా ఉన్న కేంద్ర ప్రభుత్వం
  • గోవా తరహాలో ఒకే చట్టం తెచ్చే యత్నం
  • సమయం ఆసన్నమైందన్న రాజ్‌నాథ్‌


ఉమ్మడి పౌరస్మృతి అంటే?
మత పరమైన ఆచారాలు, సంప్రదాయాలకు అతీతంగా దేశంలోని పౌరులందరికీ ఒకే చట్టం. అంటే వివాహం, విడాకులు, వారసత్వం, దత్తత, జీవనభృతి(మనోవర్తి, భరణం లేదా ఇతరత్రా నిర్వహణ ) మొదలైన అన్ని అంశాల్లో కుల, మత, వర్గాలకు అతీతంగా పౌరులందరికీ ఒకే చట్టం. ఇంతవరకూ ప్రజా చట్టాలకు భిన్నంగా మతపరమైన చట్టాలు ఉన్నాయి. హిందూ వివాహ, వారసత్వ చట్టాలు, షరియా లాంటి ముస్లిం పర్సనల్‌ చట్టాలు అమలవుతున్నాయి. ఉమ్మడి పౌర స్మృతి వస్తే ఇక అవన్నీ పూర్తి స్థాయిలో చెల్లవు.
 
న్యూఢిల్లీ, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన ఎజెండాలో ఒక్కొక్క అంశాన్ని నెరవేరుస్తోంది. కశ్మీరుకు ప్రత్యేకమైన 370 ఆర్టికల్‌ను నిర్వీర్యం చేసింది. ముస్లింలకు ప్రత్యేకమైన ట్రిపుల్‌ తలాక్‌ను చట్ట విరుద్ధంగా ప్రకటించింది. తాజాగా హిందూ ముస్లిం వర్గాల మధ్య శతాబ్దాలుగా నలుగుతున్న బాబ్రీ మసీదు-రామజన్మభూమి వివాదాన్ని తేల్చేసింది. ఇప్పుడు అదే ఊపులో మరేం చేయబోతోంది? బీజేపీ సర్కారు తదుపరి అడుగు ఏమిటి? అనేదే అందరి మదిలో నలుగుతున్న ప్రశ్న. దానికి సమాధానం ఉమ్మడి పౌరస్మృతి. బీజేపీ తప్పనిసరిగా దేశంలో ఉమ్మడి పౌర స్మృతిని ప్రవేశపెడుతుందని ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు. దేశంలో వివాహం, విడాకులు, జనన మరణాలు, ఆస్తుల విషయంలో అన్ని మతాల వారికీ ఒకే చట్టం అమలు చేయాలని మోదీ సర్కార్‌ భావిస్తోంది. ఇందుకు సం బంధించిన బిల్లును శీతాకాల సమావేశాల్లో కానీ, బడ్జెట్‌ సమావేశాల్లో కానీ ప్రవేశ పెట్టే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్‌, ఎస్పీ, బీఎస్పీ, డీఎంకే, ఎన్సీపీ, ఎన్సీ, లెఫ్ట్‌, తృణమూల్‌ సహా అనేక విపక్షాలు దీన్ని వ్యతిరేకించాయి. వారిని ఒప్పించి కేంద్రం ముం దుకెళ్తుందా? ఆర్టికల్‌ 370 మాదిరే వ్యవహరిస్తుందా.. అన్నది వేచిచూడాలని రాజకీయ విశ్లేషకులు అన్నారు. ఉమ్మడి పౌరస్మృతి అమలు చేసే సమయం ఆసన్నమైందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఇటీవల వ్యాఖ్యానించడం.. కేంద్రం ఈ అంశంపై దృష్టి పెట్టిందనే విషయానికి ఊతమిస్తోంది.
 
లా కమిషన్‌ నో!
నిజానికి దీన్ని బీజేపీ 2014 ఎన్నికల మేనిఫెస్టోలోనే చేర్చింది. ఉమ్మడి పౌరస్మృతి సాధ్యాసాధ్యాలను పరిశీలించాల్సిందిగా 2016లోనే మోదీ ప్రభుత్వం లా కమిషన్‌ను కోరింది. నిపుణులు, ఇతర వర్గాల అభిప్రాయాలను తీసుకుని, అధ్యయనం చేశాక- ‘ప్రస్తుతానికి దేశంలో ఉమ్మడి పౌరస్మృతి అవసరమూ లేదు.. వాంఛనీయమూ కాదు’ అని లా కమిషన్‌ తేల్చి చెప్పింది. ‘చాలా దేశాలు ఇపుడిపుడే భిన్నత్వాన్ని, అభిప్రాయ భేదాన్ని గుర్తిస్తున్నాయి. విభేదం ఉన్నంత మాత్రాన వివక్ష ఉన్నట్లు భావించరాదు. నిజానికది బలమైన ప్రజాస్వామ్యం ఉన్నట్లు సంకేతం’’ అని నిరుడు సెప్టెంబరులో విడుదల చేసిన చర్చా పత్రంలో అప్పటి లా కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ బీఎస్‌ చౌహాన్‌ పేర్కొన్నారు.
 
రాజ్యాంగంలో ఉందా?
రాజ్యాంగ ఆదేశిక సూత్రాల్లో దీన్ని రేఖామాత్రంగా ప్రస్తావించారు. అధికరణం 44లో దీని గురించి ఉంది. ‘‘దేశంలోని పౌరులందరికీ వర్తించేట్లు ఒకే చట్టాన్ని తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కృషి చేయాలి’’ అని అందులో పేర్కొన్నారు. ఉమ్మడి పౌర స్మృతిని రాజ్యాంగ రూపకర్త బీఆర్‌ అంబేడ్కర్‌ గట్టిగా సమర్ధించినా హిందూ-ముస్లిం నేతాగణం రెండింటి నుంచీ ఆయనకు తీవ్ర ప్రతిఘటన ఎదురైంది.
 
సుప్రీంకోర్టు ఏమంది?
ఉమ్మడి పౌరస్మృతి తేవాలని అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు కేంద్రానికి సూచించింది. శాసనవ్యవస్థ దీనిపై ఇంతకాలం స్పందించలేదు. కనీసం ఆ దిశగా కూడా ఏ చర్యలూ తీసుకోలేదు. (వ్యక్తిగత) మత చట్టాలే ఇప్పటికీ అమలవుతున్నాయి.
 
(1) షా బానో కేసు: ఉమ్మడి పౌర స్మృతి దిశగా దేశ అభిప్రాయాన్ని మరల్చిన కేసు ఇది. మొహమ్మద్‌ అహ్మద్‌ ఖాన్‌ అనే వ్యక్తి 40 ఏళ్ల వైవాహిక జీవితం తరువాత తన భార్య అయిన షా బానోకు మూడు సార్లు తలాక్‌ చెప్పి విడాకులు ఇచ్చాడు. ఆమెకు మనోవర్తి కూడా ఇవ్వడానికి నిరాకరించాడు. స్థానిక కోర్టు రూలింగ్‌ వల్ల తొలుత కొద్ది నెలలు ఆమె భరణం అందుకుంది. అయితే అహ్మద్‌ ఖాన్‌ దీనిపై సుప్రీంకోర్టు కెక్కాడు. ఇస్లామిక్‌ చట్టాల ప్రకారం తాను షా బానోకు జీవితాంతం మనోవర్తి ఇవ్వాల్సిన పనిలేదని వాదించాడు. సుప్రీంకోర్టు ఆలిండియా క్రిమినల్‌ కోడ్‌లోని సెక్షన్‌ 125ను ఉపయోగించింది. భార్యా బిడ్డల, తలిదండ్రుల పోషణ భారం సదరు భర్తదేనని ఆమెకు అనుకూలంగా తీర్పు నిచ్చింది. ఆ సందర్భంలోనే సీజేగా ఉన్న జస్టిస్‌ వైవీ చంద్రచూడ్‌ ఉమ్మడి పౌర స్మృతి ఆవశ్యకతను చెప్పారు. ‘కామన్‌ సివిల్‌ కోడ్‌ ద్వారా జాతీయ సమైక్యత, సమగ్రతలను సాధించవచ్చు. పార్లమెంటు దీనిపై వెంటనే దృష్టి పెట్టాలి’’ అన్నారు. రాజీవ్‌గాంధీ ప్రభుత్వం దీన్ని పట్టించుకోలేదు. పైపెచ్చు, క్రిమినల్‌ కోడ్‌ ముస్లిం మహిళలకు వర్తించకుండా సెక్షన్‌ 125ను సవరిస్తూ ప్రత్యేక చట్టాన్ని 1986లో చేసింది.
 
 (2) సరళా ముద్గల్‌ కేసు 1995: హిందూ వివాహ చట్టం ప్రకారం ఒక మహిళను పెళ్లాడిన ఓ వ్యక్తి, అది కొనసాగుతుండగానే, ఇస్లాం మతంలోకి మారి ఓ ముస్లిం మహిళను పెళ్లాడిన ఘటన ఇది. దీన్ని పరిశీలించిన సుప్రీంకోర్టు- రెండో పెళ్లి చట్టవిరుద్ధమని తేల్చింది. ఆ సమయంలోనే సాధ్యమైనంత త్వరగా ఉమ్మడి పౌర స్మృతి తేవాలని కేంద్రానికి సూచించింది. ‘‘హిందూ కోడ్‌ బిల్లును 1954లో తెచ్చారు. ఉమ్మడి పౌర స్మృతి తేవడానికి దేశంలో పరిస్థితులు అనుకూలంగా లేవని ఆనాడు పండిట్‌ నెహ్రూ అన్నారు. సరే, మరి స్వాతంత్య్రం వచ్చిన 41 ఏళ్ల తరువాత కూడా పరిస్థితులు మెరుగుపడలేదా? ఇక రాజ్యాంగంలోని 44వ అధికరణంలో పేర్కొన్న కామన్‌ సివిల్‌ కోడ్‌ అంశం ఎప్పటికీ దుమ్ముకొట్టుకుని పడి ఉండడమేనా? దేశంలోని 80 శాతం మంది పౌరులు దీనికి సమ్మతిస్తున్నపుడు ఇంకా దేనికి ఆలస్యం?’’ అని జస్టిస్‌ కుల్‌దీప్‌ సింగ్‌ ఆనాటి తీర్పులో ప్రశ్నించారు.
 
(3) జాన్‌ వల్లమట్టం కేసు 2003: ఈ కేసులో కూడా నాటి సుప్రీం చీఫ్‌ జస్టిస్‌ వీఎన్‌ ఖరే కేంద్రాన్ని ఆక్షేపించారు. ‘44వ అధికరణంపై ఇప్పటికీ కేంద్రం దృష్టి పెట్టలేదు. దురదృష్టకరం’’ అన్నారు.
 
(4) 2015లో: ‘‘ప్రతీ అంశంలోనూ మా మతం ప్రకారం ఇది కుదరదు, అది చెల్లదు.. అని చెబితే సమ్మతించం. ఉమ్మడి పౌర స్మృతి తేవడానికి కేంద్రానికి ఏంటి అభ్యంతరం? పార్లమెంటు చట్టం చేయవచ్చు గదా’’ అని సుప్రీంకోర్టు ఓ కేసు విచారణ సమయంలో పేర్కొంది.
 
గోవా ఆదర్శమా?
స్వాతంత్య్రం వచ్చాక గోవా ప్రభుత్వం పోర్చుగీసులో అమల్లో ఉన్న ఉమ్మడి పౌర స్మృతి విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించుకుంది. దీని ప్రకారం అన్ని అంశాల్లో గోవాలో ఒకటే చట్టం. ఆస్తులన్నింటికీ భార్యా భర్తలిద్దరూ ఉమ్మడిగా యజయానులు. తమ పిల్లలు తమ వారసులు కాదని వారు చెప్పడానికి వీల్లేదు. జేజే చట్టం ఓ ముందడుగా?
ఉమ్మడి పౌర స్మృతి దిశగా 2014లో చేసిన బాల నేరస్తుల న్యాయ చట్టం ఓ ముందడుగని చెబుతారు. తమ మతపరమైన సంప్రదాయం ప్రకారం నిషేధమైనప్పటికీ ముస్లింలు ఏ మతం వారినైనా దత్తత తీసుకునేందుకు ఆ చట్టం వీలు కల్పిస్తుంది. దానిని సవాలు చేస్తూ దాఖలైన ఓ పిటిషన్‌ సమయంలోనూ ఉమ్మడి పౌరస్మృతి మాటేంటని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది.
ఉమ్మడి పౌర స్మృతి
అనుకూలతలు
  • కులం, మతం, వర్గం, స్త్రీ పురుష భేదాలకు అతీతంగా దేశంలోని పౌరులందరికీ సమాన హోదా.
  • లైంగిక సమానత్వం సాధించవచ్చు. స్త్రీ పురుషులిద్దరూ చట్టప్రకారం సమానమే అని తీసుకోవచ్చు
  • క్రిమినల్‌, సివిల్‌ చట్టాలన్నీ అందరికీ సమానమవుతాయి.
  • ప్రస్తుత పర్సనల్‌ చట్టాలను సంస్కరించాల్సిన పనిలేదు.
  • బహుభార్యత్వం నేరంగా మారుతుంది
  • అన్ని మతాల్లో చిన్న కుటుంబం తప్పనిసరి చేసే చాన్స్‌
  • దేశ నిర్మాణంలో యువత సామర్థ్యాన్ని వాడుకోవచ్చు
ప్రతికూలతలు
  • దేశంలో భిన్నత్వం వల్ల ఉమ్మడి పౌర చట్టంపై ప్రతిఘటన రావొచ్చు
  • ఈ ఉమ్మడి చట్టం తమ మతంపై, సంస్కృతిపై దాడి అని ముస్లింలు సహా కొన్ని వర్గాలు
  • భావించే అవకాశం
  • వ్యక్తిగత పనుల్లో ప్రభుత్వ జోక్యానికి నిరసన
  • రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 25 ద్వారా సంక్రమించే మత స్వేచ్ఛకు అడ్డంకి
  • ప్రజల భావోద్వేగాలకు సంబంధించిన సున్నితమైన అంశం కావడం.
వారే సంస్కరించుకోవాలి
సంస్కరణ అనేది ఒక వర్గంలో అంతర్గతంగా మొదలుకావాలి. బహుభార్యత్వం మనకి మం చిది కాదని ముస్లింలు తమం త తాముగా నిర్ణయించుకుంటే నేను సంతోషిస్తాను. అంతే తప్ప ‘ఇది తప్పు’ అని వారిపై నా అభిప్రాయాన్ని బలవంతంగా రుద్దను. ముస్లింలు వారి చట్టాలను వారే సంస్కరించుకోవాలన్నది నా అభిమతం.
ఆరెస్సెస్‌ చీఫ్‌ గోళ్వాళ్కర్‌(1972)
ఒకే పద్ధతి అమలు చేయాలి
ప్రతీ జననాన్ని, మరణాన్ని నమోదు చేయాలి. ప్రతీ వివాహానికి, విడాకులకు ఒకే పద్ధతి అమలు చే యాలి. పెళ్లిని చట్టరీత్యా నమో దు చేయడం అవసరం. ఉమ్మ డి నేర చట్టాలు ఉన్నపుడు ఉమ్మ డి పౌర స్మృతి ఎందుకుండకూడదు?
 శేషాద్రి చారి, ఆర్‌ఎ్‌సఎస్‌ సిద్ధాంతకర్త
ఆర్టికల్‌ 25కు విరుద్ధమా?
రాజ్యాంగంలోని 25వ అధికరణంలోని కొన్ని అంశాలతో ఉమ్మడి పౌర స్మృతి విభేదిస్తుందని నిపుణులంటున్నారు. పౌరులు తమకు నచ్చిన మతాన్ని స్వీకరించేందుకు, అనుసరించేందుకు, వ్యాప్తి చేసేందుకు ఆర్టికల్‌ 25 వీలు కల్పిస్తుం ది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ‘పౌరులపై ఉమ్మడి పౌర స్మృతిని బలవంతంగా రుద్దలేమని’ రాజ్యాంగ నిపుణులు అంటున్నారు. యూసీసీ (వ్యక్తిగత) మతపరమైన చట్టాలు రెంటినీ సమన్వయ పరుచుకోవాలని సూచిస్తున్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to " ఉమ్మడి పౌర స్మృతి"

Post a Comment